ఎయిర్‌ ఇండియాకు డీజీసీఏ నాలుగు షోకాజు నోటీసులు

ఎయిర్‌ ఇండియాకు డీజీసీఏ నాలుగు షోకాజు నోటీసులు

అహ్మదాబాద్‌లో ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదం అనంతరం డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) కఠిన చర్యలు చేపట్టింది. విమాన ప్రయాణాల్లో భద్రత, సిబ్బంది వ్యవహారాలపై కఠినంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా  ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియాకు డీజీసీఏ 4 నోటీసులు జారీ చేసింది.  క్యాబిన్ సిబ్బంది విశ్రాంతి, వారి విధి నిబంధనలు, శిక్షణ నియమాలు, కార్యాచరణ విధానాలకు సంబంధించి ఎయిరిండియా పలు ఉల్లంఘనలకు పాల్పడినట్లు అందులో పేర్కొంది.

జూన్ 20, జూన్ 21వ తేదీల్లో డీజీసీఏకు ఎయిర్ ఇండియా స్వచ్ఛందంగా ఇచ్చిన వివరాల ఆధారంగా జులై 23న షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. “డీజీసీఏ జారీ చేసిన నోటీసులు అందాయి. వాటిపై నిర్ణీత వ్యవధిలో స్పందిస్తాం. మా సిబ్బంది, ప్రయాణికుల భద్రతకు మేము కట్టుబడి ఉన్నాము” అని ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి తెలిపారు. వీటిలో కనీసం 4 ఆల్ట్రా లాంగ్ హాల్ విమానాలకు సంబంధించిన క్యాబిన్ క్రూ డ్యూటీ, విశ్రాంతి నిబంధనల ఉల్లంఘనలు ఉన్నాయి. 

ఏప్రిల్ 27న నడిపిన రెండు విమానాల్లో, ఏప్రిల్ 28, మే 2న నడిపిన ఒక్కొక్క విమానంలో ఈ నిబంధనల ఉల్లంఘన జరిగిందని డీజీసీఏ నోటీసులో ఉంది. ఇక 2024 జులై 26, అక్టోబర్ 9, 2025 ఏప్రిల్ 22న నడిపిన విమానాలతో సహా కనీసం 4 విమానాలకు సంబంధించిన సిబ్బంది శిక్షణ, కార్యాచరణ విధానాల్లో కూడా ఉల్లంఘనలు జరిగినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి.

డీజీసీఏ షోకాజ్ నోటీసులో- 2024 జూన్ 24, 2025 జూన్ 13 తేదీల్లో నడిపిన విమానాలకు సంబంధించి ఫ్లైట్ డ్యూటీ పీరియడ్/ వీక్లీ రెస్ట్ (వారపు విశ్రాంతి) ఉల్లంఘనలు జరిగాయని తెలిపారు. జూన్ 21న ఎయిర్ ఇండియా స్వచ్ఛందంగా వెల్లడించిన వివరాల ఆధారంగా, డీజీసీఏ మరొక షోకాజ్ నోటీసు జారీ చేసింది. 

దీని ప్రకారం, మూడు సందర్భాల్లో క్యాబిన్ క్రూ శిక్షణ, కార్యాచరణ విధానాల్లో ఉల్లంఘనలు జరిగాయి. అలాగే ఏప్రిల్, 10-11, ఫిబ్రవరి 16, మే 19, 2024 డిసెంబర్ 1 నడిచిన కొన్ని విమానాల్లోనూ నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు డీజీసీఏ వర్గాలు తెలిపాయి. ఇటీవలి కాలంలో కొన్ని నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఎయిర్ ఇండియా డీజీసీఏ రెగ్యులేటరీ స్కానర్ పరిధిలోకి వచ్చింది.

భద్రతా ఉల్లంఘనలకు సంబంధించి గత ఆరు నెలల్లో ఎయిరిండియాకు డీజీసీఏ తొమ్మిది షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ ఇటీవల రాజ్యసభకు తెలియజేసింది. ఉల్లంఘనలకు సంబంధించి తగిన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది.