
తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ – కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాల అసలైన రూపం బయటపడిందని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ‘హైడ్ అండ్ సీక్’ రాజకీయ నాటకం కొనసాగుతోందని ఆమె ధ్వజమెత్తారు.
రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫోన్ ట్యాపింగ్, వ్యక్తిగత నిఘా, గోప్యత ఉల్లంఘనలపై రేవంత్ రెడ్డి తీవ్రంగా ఆరోపణలు చేశారని ఆమె గుర్తు చేశారు. తనతో పాటు తన కుటుంబం ఫోన్లు ట్యాపింగ్ కు పాల్పడ్డారని మాట్లాడారని, కానీ ఇప్పుడు ఆయన అవన్నీ మరిచినట్టుగా, ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే తనకు నోటీసులు వచ్చేవి కదా అనే పేర్కొనడం పట్ల అరుణ విస్మయం వ్యక్తం చేశారు.
అలాంటప్పుడు గతంలో రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నాటకమా? లేక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీతో కుదిరిన ప్యాకేజీ డీలే కారణమా? అని ఆమె ప్రశ్నించారు. బీఆర్ఎస్–కాంగ్రెస్ మధ్య ప్యాకేజీ బేరాలు కుదిరాయనడానికి ఇది స్పష్టమైన నిదర్శనం అని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్ – బీఆర్ఎస్ పార్టీలు ప్రజల ముందు కేవలం మాటల యుద్ధం చేసుకుంటూ కుమ్ములాటలు చేసుకుంటూ, చీకట్లో ప్యాకేజీలు కుదుర్చుకుంటున్న విషయం మరోసారి స్పష్టమైందని అరుణ వెల్లడించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కుంభకోణంపై ఇప్పటికే కేంద్ర వ్యవస్థలు సంచలన విషయాలను బయటపెట్టాయని ఆమె చెప్పారు. ఈ విషయంలో నాడు పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ కుటుంబం వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని, సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసి, అధికారంలోకి వచ్చాక అదే బీఆర్ఎస్ పార్టీకి రక్షణ కవచంగా మారారని అంటూ అరుణ విమర్శించారు.
రూ. 38,000 కోట్లతో ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం రూ. 1.2 లక్షల కోట్లకు పెంచిన సంగతి తెలిసిందే. వేల కోట్లు వృథా చేసినట్లు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలు స్పష్టంగా పేర్కొన్నాయని ఆమె తెలిపారు. ఈ ప్రాజెక్టులో టెండర్ల మంజూరు, పునర్నిర్మాణ ఖర్చులు, నిర్మాణ వైఫల్యాలపై సంపూర్ణ విచారణ జరగాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క అడుగైనా ముందుకు వేయకుండా, ఈ కేసును నీరుగార్చే కుట్రలకే పాల్పడుతోందని అరుణ ఆరోపించారు. గత 19 నెలలుగా కాళేశ్వరం అవినీతి దర్యాప్తు పేరుతో కాలయాపన చేస్తూ అసలు దోషులను అరెస్ట్ చేయకుండా విమర్శలకే పరిమితమైందని ఆమె మండిపడ్డారు. ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసులో సీబీఐ విచారణకు కోరి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి మాత్రమే కాదు… కేసీఆర్ ప్రభుత్వంలో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులు, విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అవినీతి, ఫార్ములా ఈ రేసింగ్ కేసులో నిధుల మళ్లింపు, ల్యాండ్ స్కాంలు, ఉద్యోగ నియామకాలలో చోటుచేసుకున్న అవకతవకలు.. ఈ కేసులన్నింటిపై విచారణ చేపడతామని వాగ్దానం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటి వరకు అసలు దోషులను పట్టుకున్న పరిస్థితి లేదని ఆమె విమర్శించారు. ఇప్పుడు బీఆర్ఎస్ కుటుంబంతో కుమ్మక్కై అవినీతికి కవచంగా మారిందని ఆమె ధ్వజమెత్తారు.
More Stories
స్వదేశీ, స్వావలంబన దిశగా స్వదేశీ జాగరణ్ మంచ్
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు