
తెలంగాణాలో బిసి రిజర్వేషన్ల పెంపు ఆర్డినెన్స్ పంచాయతీ ఢిల్లీకి చేరింది. ఆర్డినెన్స్ ముసాయిదాపై న్యాయ సలహా కోసం గురువారం హోం శాఖకు ఆర్డినెన్స్‌ను గవర్నర్ జిష్ణుదే వ్ వర్మ పంపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు రిజర్వేషన్ల పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌పై ఇప్పటికే అడ్వకేట్ జనరల్‌తోపాటు పలువురు సీనియర్ న్యాయవాదులతో గవర్నర్ చర్చించారు. అనంతరం ఈ బిల్లును కేంద్రానికి ఆయన పంపారు.
పంచాయతీ రాజ్ చట్టం 2018లోని సెక్షన్ 285 క్లాజ్- ఎ సవరించాలని ఇటీవల రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే 285 క్లాజ్- ఎ సెక్షన్‌లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా అమలవుతాయని ఉంది. అందులో 50 శాతానికి మించకుండా అనే వాక్యాన్ని తొలగిస్తూ చట్టాన్ని సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది.
ఈ ఆర్డినెన్స్ ముసాయిదాపై న్యాయ సలహా కోసం తాజా గవర్నర్ కేంద్రానికి పంపించారు. అయితే గతంలో సుప్రీంకోర్టు సైతం 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండకూడదంటూ ఇచ్చిన తీర్పును ఈ ఆర్డినెన్స్ ఉల్లంఘించినట్లు అవుతుందా? లేదా? అంటూ గవర్నర్ అనుమానం వ్యక్తం చేశారు. అందులో భాగంగా న్యాయ సలహా కోసం కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఈ ఆర్డినెన్స్ పంపారు.
నేటితో ముగియనున్న హైకోర్టు విధించిన గడువు
మరోవంక, రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30లోగా గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. మొదటి నెల రోజుల్లో రిజర్వేషన్లను ఖరారు చేయాలని, ఆ తర్వాతి 2 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రిజర్వేషన్లు నెల రోజుల్లో ఖరారు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. అంటే శుక్రవారం(జులై 25)లోగా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉన్నది.
కానీ ఇప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై స్పష్టత రాలేదు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం ఈ నెల 10న జరిగిన రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీనికి చట్టబద్ధత కల్పనకు పంచాయతీరాజ్ చట్టానికి సవరణలతో ఆర్డినెన్స్ తీసుకువచ్చి గవర్నర్‌కు పంపించగా, తాజాగా గవర్నర్‌ను ఆర్డినెన్స్ ముసాయిదాపై న్యాయ సలహా కోసం కేంద్రానికి పంపించారు.
అయితే ఆర్డినెన్స్ ఇప్పటివరకు గవర్నర్ ఆమోదం కానీ, కేంద్ర ప్రభుత్వ ఆమోదం కానీ లభించలేదు.ఈ అంశం అంత త్వరగా తేలేది కాకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయవర్గాలలో ఉత్కంఠ నెలకొంది. మరోవంక, రాష్ట్రంలో బిసి రిజర్వేషన్లపై స్పష్టత వచ్చిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే సంకేతాలు ఉండటంతో అధికార యంత్రాంగం ముందస్తుగా అన్ని ఏర్పాట్లు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఓటర్ల జాబితాను గ్రామాలు, వార్డుల వారీగా సిద్దం చేశారు. పోలింగ్ సిబ్బంది డాటాను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల కలెక్టర్లను ఆదేశించింది. జిల్లా, రెవిన్యూ డివిజన్, మండలం, పంచాయతీ, వార్డుల సంఖ్య ఆధారంగా వివరాలు ఉండాలని తెలిపింది.
కాగా, గత ఫిబ్రవరి 1వ తేదీతో పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు రావడంతో పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. మళ్లీ జూన్‌లో పంచాయితీ ఎన్నికలు ఉంటాయని అనుకుంటే కులగణన చేస్తున్న నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు ఆలస్యమయ్యాయి. అయితే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్దంగా ఉండేలా యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటోంది.
రాష్ట్రంలో బిసి రిజర్వేషన్ల పెంపు ఆర్డినెన్స్ ముసాయిదాపై గవర్నర్ కేంద్ర హోంశాఖను న్యాయ సలహా కోరడంతో రిజర్వేషన్ల ఖరారు కొంత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. బిసి రిజర్వేషన్ల ఖరారుపై హైకోర్టును మరికొంత గడువు కోరాలని రాష్ట్ర ప్రభుత్వానికి నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ అంశంపై హైకోర్టు ఎలా స్పందిస్తుందో అని రాజకీయవర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు