“స్వదేశీ – విదేశీ వస్తువుల సూచిక” ఆవిష్కరణ

“స్వదేశీ – విదేశీ వస్తువుల సూచిక” ఆవిష్కరణ

దేశభక్తి, స్వదేశీ స్పూర్తికి ప్రతీకగా నిలిచిన లోకమాన్య బాల గంగాధర్ తిలక్ జయంతిని పురస్కరించుకుని, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యాలయం  ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో స్వదేశీ – విదేశీ వస్తువుల సూచికను భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యదర్శి రావినూతల శశిధర్, విశ్వహిందూ పరిషత్ జాతీయ నాయకులు కేశవ్ రాజ్, స్వదేశీ జాగరణ మంచ్ తెలంగాణ ప్రాంత ప్రచార ప్రముఖ్ కేశవ్ సోని విడుదల చేసారు.

అనంతరం ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి డివిజన్ అధ్యక్షులకు, మండపాల నిర్వాహకులకు ఈ సూచి పత్రాన్ని అందించారు. స్వదేశీ స్పూర్తితో ప్రారంభమైన గణేష్ ఉత్సవాల్లో ఈ సారి స్వదేశీ నినాదంతో ముందుకెళ్తూ, ప్రతి వినాయక మండపం వద్ద స్వదేశీ వస్తువుల వాడకంపై, స్థానికంగా తయారయ్యే వస్తువుల ప్రాముఖ్యతను వివరిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ సూచికలో దేశీయంగా తయారైన స్వదేశీ వస్తువుల జాబితాతో పాటు, ప్రజలు నిత్యం  ఉపయోగించే పలు విదేశీ వస్తువులకు ప్రత్యామ్నాయంగా దేశీయ ఉత్పత్తులు ఏవో వివరిస్తూ రూపొందించారు. దేశీయ రంగాలకు ప్రోత్సాహం కలిగిస్తూ స్వావలంబనకు మార్గం వేసే ఉద్యమానికి ప్రజా మద్దతు సమీకరించడమే లక్ష్యంగా, గణేష్ ఉత్సవాల్లో స్వదేశీ నినాదంతో ముందుకెళ్లడం జరుగుతుంది.

గణేష్ ఉత్సవాలు జాతీయత, సంస్కృతికోద్యమాలకు వేదికలు కూడా కావాలని, ప్రతి వినాయక మండపం స్వదేశీ ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారాలని పిలుపిచ్చారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యదర్శి మహేందర్, కోశాధికారి శ్రీరామ్ వ్యాస్,  తదితరులు పాల్గొన్నారు.