
దాదాపు రెండు దశాబ్దాల క్రితం 2006లో జరిగిన ముంబయి రైలు పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న 12 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై తాజాగా సుప్రీంకోర్టు స్టే విధించింది. అయితే హైకోర్టు ఆదేశాలతో జైలు నుంచి విడుదలైన నిందితులను మళ్లీ అరెస్టు చేయాల్సిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం గురువారం ఉదయం వెల్లడించింది.
మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పీల్‌పై తమ స్పందన కూడా తెలియజేయాలంటూ నిందితులకు నోటీసులు జారీ చేస్తూ ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక న్యాయస్థానం (2015లో) ఇచ్చిన తీర్పును కొట్టేస్తూ శిక్ష పడిన మొత్తం 12 మందిని నిర్దోషులుగా తేల్చింది. సరిగ్గా 19 ఏళ్ల క్రితం అంటే 2006 జులై 11న ముంబై పశ్చిమ రైల్వే లైన్‌లోని పలు సబర్బన్ రైళ్లలో వరుసగా బాంబు పేలుళ్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ మారణహోమంలో 189 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 800 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక న్యాయస్థానం 2015 అక్టోబర్‌లో 12 మంది నిందితులను దోషులుగా తేల్చింది. వీరిలో రైళ్లలో బాంబు అమర్చారన్న అభియోగాలపై ఐదుగురికి మరణశిక్ష విధించింది. మిగతా ఏడుగురికి జీవితఖైదు విధిస్తూ అప్పట్లో తీర్పు వెలువరించింది. అందులో ఒకరు 2021లో కరోనా కారణంగా నాగ్‌పూర్ జైల్లో మృతి చెందాడు.
ఈ కేసుపై సుదీర్ఘ విచారణ జరిపిన బాంబే హైకోర్టు ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక న్యాయస్థానం (2015లో) ఇచ్చిన తీర్పును కొట్టేస్తూ శిక్ష పడిన 12 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ ఈనెల 21న సంచలన తీర్పు వెలువరించింది. మరే ఇతర కేసులు వారిపై లేనట్టయితే వారందర్నీ విడుదల చేయాలని ఆదేశించింది.
దోషులకు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాలు సమర్పించటంలో ప్రాసిక్యూషన్ పూర్తిగా విఫలమైందని, దోషులకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తున్నట్టు బెంచ్ పేర్కొన్నది. హైకోర్టు నుంచి వెలువడిన ఈ తీర్పు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఈ తీర్పుపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది.
More Stories
అయోధ్య సమీపంలో భారీ పేలుడు – ఐదుగురు మృతి
జార్ఖండ్లో గత పదేళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షపాతం
బీహార్ లో తొలగించిన 3.66 లక్షల ఓట్ల వివరాలు వెల్లడించండి