భారత్‌-యూకే మధ్య కీలక వాణిజ్య ఒప్పందం

భారత్‌-యూకే మధ్య కీలక వాణిజ్య ఒప్పందం
భారత్‌- బ్రిటన్‌ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ సమక్షంలో రెండు దేశాల వాణిజ్య మంత్రులు పీయూష్‌ గోయల్‌, జోనాథన్‌ రేనాల్డ్స్‌ ఒప్పందంపై సంతకాలు చేశారు.  భారత్‌-యూకేల మధ్య ఈ వాణిజ్య ఒప్పందం కోసం జరిపిన చర్చలు ముగిసినట్లు ఇరు దేశాలు మే 6న ప్రకటించిన విషయం తెలిసిందే.
 
2030 నాటికి ఈ రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్యాన్ని 120 బిలియన్ డాలర్లకు రెట్టింపు చేసేదిగా ఈ ఒప్పందం ఉంది. తోలు, పాదరక్షలు, దుస్తులు వంటి ఉత్పత్తుల ఎగుమతిపై పన్నులను తొలగించాలని, బ్రిటన్ నుండి విస్కీ, కార్ల దిగుమతులను చౌకగా మార్చాలని ఈ వాణిజ్య ఒప్పందంలో పొందుపర్చారు. భారత్‌-యూకేల ఈ ఒప్పందంలో వస్తువులు, సేవలు, ఆవిష్కరణ, మేధో సంపత్తి హక్కులు తదితర అంశాలను ఇందులో ప్రతిపాదించారు.
 
 యుకెఇప్పటికే భారతదేశం నుండి 11 బిలియన్ పౌండ్ల వస్తువులను దిగుమతి చేసుకుంటుంది. అయితే భారతీయ వస్తువులపై సుంకాలను సరళీకరించడం వలన బ్రిటిష్ వినియోగదారులు, వ్యాపారాలు భారతీయ ఉత్పత్తులను కొనుగోలు చేయడం సులభం, చౌకగా మారుతుంది, యూకేకి భారతీయ వ్యాపారాల ఎగుమతులు పెరుగుతాయని ఈ ఒప్పందంపై సంతకం చేయడానికి కొన్ని గంటల ముందు ఆ దేశం ఒక ప్రకటనలో తెలిపింది. “భారతదేశంతో మా మైలురాయి వాణిజ్య ఒప్పందం బ్రిటన్‌కు ఒక పెద్ద విజయం” అని స్టార్మర్ రీడౌట్‌లో చెప్పినట్లు ఉటంకించబడింది.
 
ఒప్పందంపై సంతకాలు చేసిన అనంతరం మాట్లాడిన ప్రధాని మోదీ, భారత్‌-బ్రిటన్‌ భాగస్వామ్యంలో విజన్‌-2035 లక్ష్యంగా సాగుతున్నామని తెలిపారు. బ్రిటన్‌, భారత్‌ భాగస్వామ్యంతో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోందని తెలిపారు. రక్షణ, భద్రత, ఏఐ, విద్య తదితర రంగాల్లో బ్రిటన్‌, భారత్‌ కొత్తపుంతలు తొక్కనుందని అభిప్రాయపడ్డారు. ఆరు బ్రిటన్‌ వర్సిటీలు భారత్‌లో క్యాంపస్‌లు ఏర్పాటు చేస్తున్నాయని వెల్లడించారు.
 
భారత్‌ నుంచి వెళ్లే 99శాతం ఎగుమతులపై సుంకాలు తగ్గనున్నాయి. ఫలితంగా భారతీయ వ్యాపారులకు భారీగా లబ్ధి చేకూరనుంది. అలాగే బ్రిటన్‌ నుంచి భారత్‌కు కార్లు, కాస్మోటిక్స్‌, విస్కీ వంటివి దిగుమతి కానున్నాయి. కాగా, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై భారత్‌-యూకే మధ్య మూడేళ్లకు పైగా చర్చలు జరిగాయి.  ఈయూ నుంచి నిష్క్రమించిన తర్వాత భారత్‌తో చేసుకున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం బ్రిటన్‌కు ఆర్థికంగా ఎంతో కీలకం కానుంది. భారత్‌తో మైలురాయిగా నిలిచే వాణిజ్యం ఒప్పందం బ్రిటన్‌కు పెద్ద విజయమని ప్రధాని కీర్‌ స్టార్మర్‌ సంతోషం వ్యక్తం చేశారు.

“పహల్గాం ఘటనను ఖండించిన బ్రిటన్‌ ప్రధానికి ధన్యవాదాలు. తీవ్రవాదం విషయంలో రెండు అభిప్రాయాలు ఉండే అవకాశం లేదు. ప్రజాస్వామ్య స్వేచ్ఛను దుర్వినియోగం చేసేవారి పట్ల కఠినంగా ఉంటాం. అహ్మదాబాద్‌ విమాన దుర్ఘటన మృతుల్లో బ్రిటన్‌లోని ఎన్నారైలు ఉన్నారు. అహ్మదాబాద్‌ విమాన దుర్ఘటన మృతులకు మరోసారి సంతాపం తెలుపుతున్నా” అని ప్రధాని మోదీ తెలిపారు. 

“ఎన్నారైలు భారత సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతున్నారు. క్రికెట్‌ అనేది కేవలం ఆట కాదు. క్రికెట్‌ అంటే ఓ పాషన్‌. క్రికెట్‌ తరహాలో భారత్‌-బ్రిటన్‌ దీర్ఘకాల భాగస్వామ్యం మేం కోరుతున్నాం. బ్రిటన్‌ ప్రధాని ఆతిథ్యానికి ధన్యవాదాలు. భారత్‌కు రావాలని ఆహ్వానిస్తున్నాను.” అని ప్రధాని మోదీ చెప్పారు. 

“ఇరుదేశాల సంబంధాల్లో ఇది చారిత్రాత్మక రోజు. నాకు సంతోషంగా ఉంది. కొన్నేళ్ల తర్వాత ఇరుదేశాల మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం కేవలం ఆర్థికపరమైనదే కాదు. సహజ సమృద్ధి పథకం కూడా. అంతేకాకుండా భారతీయ వస్త్ర, ఫుట్‌వేర్‌, జెమ్స్‌-జ్యువెలరీ, సముద్ర ఆహారం, ఇంజనీరింగ్‌ వస్తువులకు బ్రిటన్‌లో మార్కెట్‌ అవకాశాలు పెరగనున్నాయి” అని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. 

“భారత్‌కు చెందిన వ్యవసాయం, ప్రాసెసింగ్‌ పరిశ్రమలకు బ్రిటన్‌ మార్కెట్‌లో కొత్త అవకాశాలు లభించనున్నాయి. భారత్‌కు చెందిన యువత, రైతులు, జాలర్లు, ఎంఎస్‌ఎంఈ రంగానికి ఈ ఒప్పందం ఎంతో ప్రయోజనం చేకూర్చనుంది. మరోవైపు భారత ప్రజలు, పరిశ్రమలకు బ్రిటన్‌లో తయారయ్యే మెడికల్‌ పరికరాలు, ఎయిరోస్పేస్‌ పరికరాలు సులభంగా తక్కువ ధరకు లభించనున్నాయి.” అని నరేంద్ర మోదీ వివరించారు.