మనీలాండరింగ్ ఆరోపణలతో ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన సంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం దాడులు చేపట్టారు. దేశ రాజధాని ఢిల్లీ, ముంబై నగరాల్లోని దాదాపు 50కిపైగా ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపడుతున్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దాఖలు చేసిన రెండు ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ ఈ చర్యలు చేపట్టినట్లు తెలిసింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఇటీవల అనిల్ అంబానీ సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ లోన్ ఖాతాలను ఫ్రాడ్‌గా తేల్చిన విషయం తెలిసిందే. 2017-19 మధ్య యస్ బ్యాంక్ నుంచి అనిల్ అంబానీ దాదాపు రూ.3 వేల కోట్ల రుణం తీసుకొని దారి మళ్లించారని ఆరోపణలు ఉన్నాయి. గ్రూప్ కంపెనీలకు రుణాలు ఇవ్వడానికి ముందు బ్యాంకు ప్రమోటర్లతో సంబంధం ఉన్న సంస్థలకు నిధులు బదిలీ అయ్యాయని ఈడీ ఆరోపణలు.
ఈ కేసులో అనిల్ అంబానీ గ్రూప్‌తో సంబంధం ఉన్న సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను కూడా విచారిస్తున్నారు. దాదాపు 50 సంస్థలు, 25 మందిపై కేసులు నమోదైనట్లు తెలిసింది. అయితే, ఈ సోదాలు మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి జరిగినట్లు తెలుస్తోంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా దర్యాప్తును ప్రారంభించిన ఈడీ రిలయన్స్ కమ్యూనికేషన్స్‌తో పాటు ఇతర అనుబంధ సంస్థలపై ఫుల్ ఫోకస్ పెట్టింది.
నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) వంటి ఇతర సంస్థలు కూడా అనిల్ అంబానీ చేసిన మోసాలపై ఈడీకి సమాచారం అందిన నేపథ్యంలో ఈ సోదాలకు అత్యంత ప్రాధాన్యత నెలకొంది. కాగా, అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ సంస్థలు గత కొన్నేళ్లుగా ఆర్థిక ఇబ్బందులు, న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నాయి.
2024 ఆగస్టులో, సెబీ అనిల్ అంబానీని రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ నుంచి నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఐదేళ్లపాటు సెక్యూరిటీస్ మార్కెట్‌లో పాల్గొనకుండా నిషేధించింది. అనిల్ అంబానీతో పాటు 24 ఇతర సంస్థలపై రూ.25 కోట్ల జరిమానా విధించగా, ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్‌పై ఆరు నెలల నిషేధంతో పాటు రూ.6 లక్షల జరిమానా విధించింది. సెబీ దర్యాప్తులో, అనిల్ అంబానీ తన సంస్థలతో సంబంధం ఉన్న సంస్థలకు రుణాల రూపంలో నిధులను మళ్లించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.

More Stories
నిబంధనల ఉల్లంఘనల సాకుతో భీమా పరిహారం ఎగవేత కుదరదు!
త్వరలో భారత్‌కు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల
అమెరికా ఆంక్షలతో రష్యా చమురుకు చెల్లింపు సమస్యలు!