అణు విద్యుత్ యూనిట్లుగా పాత థర్మల్ ప్లాంట్లు

అణు విద్యుత్ యూనిట్లుగా పాత థర్మల్ ప్లాంట్లు
ప్రస్తుతం ఉన్న 8.8 గిగావాట్ల నుండి 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని చేరుకోవాలనే ప్రతిష్టాత్మక లక్ష్యంలో భాగంగా కాలపరిమితికి దగ్గరగా ఉన్న పాత థర్మల్ విద్యుత్ ప్లాంట్లను అణు విద్యుత్ యూనిట్లుగా మార్పు చేయాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.  2032 నాటికి మొదట 22 గిగావాట్ల అణు విద్యుత్ సామర్త్యాన్ని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇంధన మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం దేశంలో మొత్తం స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఇప్పుడు 484.82 గిగావాట్లుగా ఉంది. వీటిలో 184.62 గిగావాట్ల పునరుత్పాదక శక్తి, 49.38 గిగావాట్ల పెద్ద జల విద్యుత్, 8.78 గిగావాట్ల సామర్థ్యం కలిగిన అణు విద్యుత్ ఉత్పత్త ప్రాజెక్టులు ఉండగా, బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు వంటి శిలాజ అధారిత ఉష్ణ విద్యుత్ కు సంబంధించి 242.04 గిగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్లు ఉన్నాయి. 
 
ఈ నేపధ్యంలో 2047 నాటికి దేశంలో 10 పాత థర్మల్ ప్లాంట్లను అణు విద్యుత్ యూనిట్లుగా మార్చనుంది. విద్యుత్ యూనిట్లలో తిరిగి ఉపయోగించేందుకు వివిధ ప్రాంతాల్లోని 10 పాత లేదా రిటైర్డ్ థర్మల్ విద్యుత్ కేంద్రాలను గుర్తించింది. వీటిని తనిఖీ చేసి ప్రాథమికంగా విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై భారత అణు విద్యుత్ సంస్థ సభ్యులతో కూడిన సైట్ ఎంపిక కమిటీని ఏర్పాటు చేసింది. 
 
ఈ కమిటీ గుర్తించిన ఆయా ప్రదేశాలను తనిఖీల తర్వాత తుది నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ అధికారవర్గాలు వెల్లడించాయి.

ఈ ప్రక్రియలో మొదటి అడుగు. అణు విద్యుత్ ప్లాంట్ల ఎంపిక థర్మల్ యూనిట్ల ఏర్పాటు కంటే చాలా కఠినమైనదని, కాబట్టి ప్రక్రియకు సమయం పడుతుందని పేర్కొన్నాయి. ప్రధానంగా స్థల ఎంపిక ప్రక్రియ ప్లాంట్ల భూకంప తీవ్రత, నీటి లభ్యత, సమీపంలోని నివాస స్థలంపై ఆధారపడి ఉంటుంది. 
 
అయితే తుది నిర్ణయం తీసుకునే ముందు అణు విద్యుత్ ప్లాంట్ చుట్టూ కనీసం 1 కిలోమీటర్ల పరిధికి లోబడిన మండలాలను గుర్తించడం, ప్రజా నివాసాలకు నిషేధాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి. విద్యుత్ మంత్రిత్వ శాఖ మార్చబడిన థర్మల్ యూనిట్లలో చిన్న మాడ్యులర్ రియాక్టర్లను ఏర్పాటు ఏర్పాటు చేయడంతో సహా, పరిమాణం, వనరుల లభ్యత ఆధారంగా, అణు విద్యుత్ ఉత్పత్తి యొక్క వివిధ పద్దతులను అంచనా వేస్తోంది. 
 
ఇప్పటికే దీనికి సంబంధించి గుజరాత్ లోని వానక్బోరి థర్మల్ పవర్ ప్లాంట్ ను కూడా ఒక బృందం సందర్శించింది. ఈ సైట్లో ఒక్కొక్కటి 210 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఏడు యూనిట్లు ఉన్నాయి. మిగిలిన పాత థర్మల్ యూనిట్ల ప్రాంతాలను అణు విద్యుత్ కమిటీ పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు.