
కొన్నేళ్ల క్రితం వందలాది చర్చిలు, మసీదులను నేలమట్టం చేసిన డ్రాగన్ తాజాగా టిబెట్‌లోని బౌద్ధమఠాలు, స్తూపాలపై విరుచుకుపడింది. వందలాది బౌద్ధ స్తూపాలను చైనా అధికారులు నేలమట్టం చేశారు. బయటి ప్రపంచానికి తెలియకుండా రహస్యంగా టిబెట్ సాంస్కృతిక వారసత్వాన్ని చైనా చెరిపేస్తోంది. టిబెట్‌లో మూడొందలకు పైగా బౌద్ధ స్తూపాలను చైనా తాజాగా ధ్వంసంచేసింది. కార్జేలో ఉండే ప్రముఖ పద్మసంభవ విగ్రహాన్ని సైతం నాశనం చేసింది.
టిబెట్‌లో బౌద్ధమతాన్ని నియంత్రించాలని సంకల్పించుకున్న చైనా ప్రభుత్వం, స్థానికులపై మరిన్ని కఠినమైన ఆంక్షలు విధించింది. ఈ విషయాలను భారత్‌లోని ధర్మశాల వేదికగా పాలించే సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. చైనా ధ్వంసం చేసిన వాటిలో జంగ్‌అంగ్ బౌద్ధమఠం సమీపంలో మూడు భారీ బౌద్ధ స్తూపాలు ఉన్నాయని పేర్కొంది. స్థానిక బౌద్ధులు, ప్రజలు తమ గురువులుగా భావించే కెన్పో జిగ్మే ఫుంట్సోక్, గురు రిన్పోచే విగ్రహాలను చైనా కూల్చినట్లు సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.
చైనా సైన్యం, అధికారులు టిబెటియన్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, వారిపై అనేక ఆంక్షలు విధించారని సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. అక్కడ జరిగే విధ్వంసం బయటకు వెళ్లకుండా డ్రాగన్ గట్టి నిఘాపెట్టింది. అనుమానితులను రాజ్య రహస్యాల నేరం కింద అరెస్టులు చేస్తోంది. స్థానికులు బయటకు వెళ్లకుండా, ఇతరులు లోపలికి రాకుండా పహారా కాస్తున్నారు. కెన్పో టెంగా వంటి మతనాయకులను ఇళ్లలోనే నిర్బంధించారు.
ఆధ్యాత్మిక కార్యకలాపాలను నిషేధించారు. టిబెటన్ బౌద్ధమతాన్ని మట్టిలో కలిపేసేందుకే చైనా నడుంకట్టిందని సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ విమర్శించింది. టిబెట్ సాంస్కృతిక మారణహోమానికి డ్రాగన్ పాల్పడుతోందని పేర్కొంది. కాగా ఇప్పటికే బౌద్ధ మఠాలన్నీ ప్రభుత్వ నియంత్రణలో ఉండాలని చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆదేశించింది. చైనాలో మతాల పట్ల కమ్యూనిస్టు పార్టీదే పూర్తి నియంత్రణ. ప్రభుత్వం అధికారికంగా బౌద్ధం, టావోయిజం, క్రైస్తవం, ఇస్లాం మతాలను గుర్తిస్తుంది.
ఆలయాలు, మసీదులు, బౌద్ధారామాలు, చర్చిలకు అనుమతి ఉంటుంది. కానీ అందులోని కార్యకలాపాలను కఠినంగా నియంత్రిస్తారు. మతపరమైన విద్యపై నిషేధం ఉంది. అవసరమైతే సులభంగా మత నిర్మాణాలను కూల్చివేస్తారు. ప్రజలు నిర్వహించే మతపరమైన కార్యకలాపాలు ప్రభుత్వ నియమాలకు లోబడి ఉండేలా డ్రాగన్ నిఘా పెడుతుంది. బౌద్ధ మఠాధిపతులు, ప్రభావిత వ్యక్తులను నిరంతరం పర్యవేక్షిస్తుంటారు.
More Stories
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్ కు చైనా, ఐరోపా, యుఎఈ, అమెరికాల నిఘా యంత్రాలు
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు