ధర్మం దారి తప్పిన ప్రతిసారి కాపాడే శక్తి పుడుతుంది

ధర్మం దారి తప్పిన ప్రతిసారి  కాపాడే శక్తి పుడుతుంది
 
* హిందువుగా జీవించాలంటే జిజియా పన్ను… హరిహర వీరమల్లు చిత్ర నేపథ్యం
ధర్మం దారి తప్పిన ప్రతిసారి దాన్ని పరిరక్షించడానికి ఒక శక్తిపుడుతుందని పేర్కొంటూ హిందువుగా జీవించాలి అంటే జిజియా పన్ను కట్టాలనే కంటక పాలకుడి నుంచి అత్యంత విలువైన కోహినూర్ వజ్రాన్ని సాధించడానికి పోరాడే యోధుడి కథగా హరిహర వీరమల్లు చిత్రం నిలిచిపోతుందని ఆ చిత్రంలో హీరో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 
 
ఆ చిత్రం ప్రచారం సందర్భంగా విశాఖపట్టణంలో జరిగిన సభలో మాట్లాడుతూ చరిత్రలో కీలకమైన విషయాలు భవిష్యత్తు తరాలకు బలంగా చెప్పాలని భావించి ఈ చిత్ర నిర్మాణాన్ని మొదలుపెట్టామని తెలిపారు. దాన్ని అత్యంత కఠినమైన పరిస్థితిలో పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు సగర్వంగా తీసుకురావడం ఆనందంగా ఉందని చెప్పారు.  వీరమల్లు రెండు భాగాలు అయ్యిందని పేర్కొంటూ మొదటి భాగం ఎలా ముగించాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు చరిత్ర మనందరికీ తెలిసేలా ముగించాలని అనుకున్నామని, సినిమా అంటే థియెటర్ కి వచ్చిన ప్రతి ప్రేక్షకుడిని ఆనందింప చేయడంతో పాటు ఎడ్యుకేట్ చేయాలని కోరుకుంటానని చెప్పుకొచ్చారు. 
మన కృష్ణా నది తీరాన కొల్లూరులో దొరికిన కోహినూర్ వజ్రం గోల్కొండ నవాబ్ చేతికి వెళ్తే, అక్కడి నుంచి మొఘలులకు, చేరి, ఇప్పుడు లండన్ మ్యూజియంలో ఉందని గుర్తు చేశారు. కోహినూర్ ని దొంగిలించడం అనే ఆలోచన తనకు నచ్హయిందని చెబుతూ  ప్రజా కంటకుడైన పాలకుడు ఔరంగజేబు కూర్చున్న నెమలి సింహాసనంపై ఉన్న కోహినూర్ వజ్రం దొంగిలించి వెనక్కి తీసుకురావాలి అన్న కులీ కుతుబ్షా ఆదేశంతో హరిహర వీరమల్లు అనే కల్పిత పాత్ర ప్రారంభం అవుతుందని చెప్పారు. కథ కొల్లూరు నుంచి గొల్కొండ, ఢిల్లీ వరకు పోతుందని, మొదటి భాగం ఎర్రకోట వద్ద ఆగుతుందని తెలిపారు. వీరమల్లు ఔరంగజేబు కలుసుకున్నారా? తదుపరి ఏం జరుగుతుంది అనేది రెండో భాగం అని చెప్పారు.
 
సనాతన ధర్మం ఏ మతానికి వ్యతిరేకం కాదని, సనాతన ధర్మం క్రిస్టియానిటీకి వ్యతిరేకం కాదని, ఇస్లాంకి వ్యతిరేకం కాదని, అన్ని ధర్మాలను ఐక్యం చేసేదే సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఔరంగజేబు లాంటి వాళ్ళ పాలనలో హిందువుగా జీవించాలంటే జిజియా పన్ను చెల్లించాలని గుర్తు చేశారు. “నేను ఏ పాలకుడికీ వ్యతిరేకం కాదు. తప్పులు జరిగినప్పుడు దాన్ని తెలియజేయాలి. చాళుక్యులు, పాండ్య రాజులు. విజయనగర రాజుల గురించి మనకు పెద్దగా తెలియదు. మన చరిత్ర పుస్తకాలు మొఘలుల గురించి ఘనంగా చెప్పాయి.  మిగిలిన రాజుల గురించి తక్కువ చెబుతాయి” అంటూ పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. 
 
కోహినూర్ తెచ్చే ప్రక్రియలో హీరో జిజియా పన్ను కట్టాల్సి వస్తుందని, ఆ పన్ను కట్టే సమయంలో యాక్షన్ ఎపిసోడ్ ఉంటుందని చెప్పారు. యుద్ధంలో పాల్గొనాలని లేకపోయినా ఎందుకు యుద్ధం చేయాల్సి వచ్చింది? కోహినూర్ వజ్రాన్ని కనుగునే క్రమంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనేది మొదటి భాగం అని పవన్ కళ్యాణ్ వివరించారు. 
“హరిహర వీరమల్లు మీద మా అందరికంటే ఎక్కువ నమ్మకం పెట్టుకున్న వ్యక్తి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి. ఆయన లేకపోతే హరిహర వీరమల్లు సినిమా లేదు. మేము ఎంత బాగా నటించినా ఆ ఎమోషన్స్ ముందుకు తీసుకువెళ్లే సంగీతం లేకపోతే సన్నివేశాల్లో జీవం ఉండదు. నాటు నాటు అని ఒక పాట కొడితే దానికి ఆస్కార్ వస్తుందంటే నమ్ముతామా? కీరవాణి సాధించిన ఘనతకు భారతీయులుగా మనమంతా గర్వించాలి” అని తెలిపారు.