సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే మూల్యం చెల్లించక తప్పదు

సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే మూల్యం చెల్లించక తప్పదు
* ఐరాసలో మరోసారి పాక్ కు భారత్ హెచ్చరికలు
 
సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలు తీవ్రమైన మూల్యం చెల్లించక తప్పదని భారత్‌ పాకిస్థాన్ ను మరోసారి హెచ్చరించింది. మతోన్మాదంలో మునిగిపోయి ఐఎంఎఫ్‌ నుంచి వరుస అప్పులు తీసుకుంటోందని దుయ్యబట్టింది. ఐరాస భద్రతా మండలిలో పాకిస్థాన్‌ అధ్యక్షతన వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవటం ద్వారా అంతర్జాతీయంగా శాంతి, భద్రతలను ప్రోత్సహించాలనే అంశంపై ఓపెన్‌ డిబెట్‌ జరిగింది. 
 
ఈ సందర్భంగా జమ్ముకశ్మీర్‌, సింధు నదీ జలాల అంశాన్ని పాకిస్థాన్‌ ప్రస్తావించగా భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్‌ గట్టిగా తిప్పికొట్టారు. కశ్మీర్‌ వివాదాస్పద భూభాగం అనే విషయం ప్రపంచం మొత్తానికి తెలుసని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో పాక్‌ విదేశాంగశాఖ మంత్రి ఇషాక్‌ దార్‌ వ్యాఖ్యానించారు.  అలాగే సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడం సరికాదని విమర్శించారు.
ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితిలోని భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ తీవ్రంగా స్పందిస్తూ అంతర్జాతీయ సమాజానికి ఆమోదయోగ్యం కాని పద్ధతులు పాటిస్తూ ధర్మోపదేశాలు చేయడం తగదని దాయాది దేశానికి దీటుగా బదులిచ్చారు. “యూఎన్​లో భారత్‌ వ్యవస్థాపక సభ్యదేశంగా ఉంది. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ సభ్యదేశాలతో కలిసి ప్రపంచ శాంతి, శ్రేయస్సు కోసం కృషి చేస్తోంది. అంతర్జాతీయ శాంతి, భద్రత గురించి చర్చ జరిగినప్పుడు ప్రపంచ దేశాలు గౌరవించాల్సిన కొన్ని ప్రాథమిక సూత్రాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఉగ్రవాదాన్ని పూర్తిగా అరికట్టడం” అని గుర్తు చేశారు. 

“ఒకవైపు భారత్ పరిణతి చెందిన ప్రజాస్వామ్యం, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, సమ్మిళిత సమాజం వైపునకు దూసుకెళ్తోంది. మరోవైపు పాకిస్థాన్ ఉన్మాదం, ఉగ్రవాదంలో మునిగిపోయింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి వరుసగా అప్పులు తెచ్చుకుంటోంది” అంటూ ఎద్దేవా చేశారు.  “సీమాంతర  ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ద్వారా పొరుగువారి స్ఫూర్తిని, అంతర్జాతీయ సంబంధాలను ఉల్లంఘించే దేశాలకు తీవ్రమైన జరిమానాలు వేయాలి. అంతర్జాతీయ సమాజానికి ఆమోదయోగ్యం కాని విధానాలను పాటిస్తూ, యూఎన్ కౌన్సిల్ సభ్యుడు ఇషాక్ దార్ ధర్మోపదేశం చేయడం తగదు” అని హరీశ్ స్పష్టం చేశారు. 

పాకిస్థాన్‌ సీమాంతర ఉగ్రవాదానికి ప్రోత్సాహం నిలిపేసే వరకు 1960 నాటి సింధు నదీజలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని భారత్‌ నిర్ణయించినట్లు చెప్పారు. పాక్, పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ సిందూర్​ను భారత్ చేపట్టిందని హరీశ్ వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడినవారు, దానికి ఆర్థిక సహాయం చేసినవారు, స్పాన్సర్​లను జవాబుదారీగా ఉంచి వారిని న్యాయస్థానం ముందు నిలబెట్టాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. 

ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ అభ్యర్థన మేరకే భారత్ సైనిక కార్యకలాపాలను నిలిపివేసిందని గుర్తు చేశారు.  “పాకిస్తాన్ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలకు నేను స్పందించాల్సిన అవసరం ఉంది. ఐక్యరాజ్యసమితి ఏర్పాటై 80ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో యూఎన్ చార్టర్‌ లో పొందుపరచిన బహుపాక్షికత, వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడం ఎంతవరకు సాకారం అయ్యాయో ఆలోచించుకోవాలి” అని సూచించారు. 

“ఐక్యరాజ్యసమితి ఏర్పడిన తర్వాత మొదటి నాలుగు దశాబ్దాలు వలసరాజ్యాల నిర్మూలన, ప్రచ్ఛన్న యుద్ధాన్ని చూసింది. దేశాల మధ్య వివాదాలు, సంఘర్షణలను అడ్డుకోవడంలో యూఎన్ పాత్ర కీలకం. వాస్తవానికి 1988లో యూఎన్ శాంతి పరిరక్షక దళాలకు నోబెల్ బహుమతి లభించింది” అని తెలిపారు. 

“అయితే, ఇటీవల కాలంలో సంఘర్షణలు, యుద్ధాల స్వభావం మారిపోయింది. సరిహద్దుల వెలుపల నిధులు, ఆయుధాల అక్రమ రవాణా, ఉగ్రవాదుల శిక్షణ, రాడికల్ భావజాల వ్యాప్తి, ఆధునిక డిజిటల్, కమ్యూనికేషన్ టెక్నాలజీల ద్వారా యుద్ధాలు జరుగుతున్నాయి. వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ఇరు పార్టీలు ఒప్పుకోవాలి” అని పర్వతనేని హరీశ్ తేల్చి చెప్పారు.