ఆస్ట్రేలియాలో వ‌ర్ణ‌వివ‌క్ష‌.. భార‌తీయుడిపై దాడి

ఆస్ట్రేలియాలో వ‌ర్ణ‌వివ‌క్ష‌.. భార‌తీయుడిపై దాడి
ఆస్ట్రేలియాలో ఓ భారతీయుడిపై జాత్యహంకార దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ నెల 19న అడిలైడ్‌లో భారత్‌కు చెందిన చరణ్‌ప్రీత్‌ సింగ్‌ తన భార్యతో కలిసి కారులో బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో తమ కారును ఓ పక్కన పార్క్‌ చేసి నడుస్తుండగా, అకస్మాత్తుగా ఐదుగురు దుండగులు వేరే వాహనంలో అక్కడికి వచ్చి చరణ్‌పై భౌతిక దాడికి దిగారు. 
 
పదునైన వస్తువులతో కొడుతూ అతడిని దూషించారు. ఈ దాడిలో చరణ్‌ ముఖం, వెనక భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. దాడి చేస్తున్న దృశ్యాల‌ను సింగ్ భార్య షూట్ చేసింది. కారు రిజిస్ట్రేష‌న్ నెంబ‌ర్‌ను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు.  జూలై 19వ తేదీన ఈ అటాక్ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.
 
కారు పార్కింగ్‌ కారణంగానే వివాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నట్లు పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఆస్పత్రిలో చరణ్‌ మాట్లాడుతూ  ఈ దాడి తనను కలచి వేసిందని చెప్పారు. ఇలాంటివి జరిగినప్పుడు భారత్‌కు తిరిగి వెళ్లిపోవాలనిపిస్తుందని స్పష్టం చేశారు. 
 
ఇక, దాడికి పాల్పడిన దుండగుల్లో 20 ఏళ్ల యువకుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా మిగిలినవారిని కూడా పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. దక్షిణ ఆస్ట్రేలియా ప్రీమియర్‌ పీటర్‌ మాలినాస్కస్‌ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఇలాంటి జాత్యహంకార దాడులను సహించేది లేదని హెచ్చరించారు.