28 నుంచి ఆప‌రేష‌న్ సింధూర్‌పై పార్ల‌మెంట్‌లో చ‌ర్చ‌

28 నుంచి ఆప‌రేష‌న్ సింధూర్‌పై పార్ల‌మెంట్‌లో చ‌ర్చ‌

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న  పార్లమెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల్లో ఆప‌రేష‌న్ సింధూర్‌పై లోక్‌సభలో 28 నుంచి, రాజ్యసభలో 29 నుంచి  చ‌ర్చ జ‌ర‌గ‌నున్న‌ది. లోక్‌స‌భ‌లో 16 గంట‌లు, రాజ్య‌స‌భ‌లో 9 గంట‌ల పాటు చ‌ర్చించేందుకు స‌మ‌యాన్ని కేటాయించిన‌ట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వర్గాల ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో చర్చ జరగనుంది. చర్చ ముగిసిన తర్వాత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చర్చపై సమాధానం ఇవ్వనున్నారు.

 పెహల్గామ్ ఉగ్ర‌దాడి, ఆప‌రేష‌న్ సిందూర్‌పై విస్తృత స్థాయిలో చ‌ర్చ నిర్వ‌హించాల‌ని విప‌క్షాలు డిమాండ్ చేస్తున్న విష‌యం తెలిసిందే.  ఇదే అంశాన్ని ప్ర‌స్తావిస్తూ ఉభ‌య‌స‌భ‌ల్లోనూ విప‌క్షాలు ఆందోళ‌న‌లు చేస్తున్నాయి. పార్లమెంట్ ఆవరణలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఇండియా, పాకిస్థాన్ మ‌ధ్య యుద్ధాన్ని ఆపింది తానే అని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ప్ర‌క‌టిస్తున్నారని, దీని వెనుక ఉన్న ఆంత‌ర్యం ఏంటో ప్ర‌భుత్వం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. 

ఇండో, పాక్ ఉద్రిక్త‌త‌ల వేళ అయిదు యుద్ధ విమానాలు కూలిన అంశాన్ని కూడా ట్రంప్ ఇటీవ‌ల మ‌ళ్లీ మ‌ళ్లీ లేవ‌నెత్త‌డంతో విప‌క్షాలు దీనిపై అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నాయి.  ఆప‌రేష‌న్ సింధూర్ కొన‌సాగుతోంద‌ని ఒక‌వైపు చెబుతున్నార‌ని, మ‌రో వైపు విజ‌యం సాధించిన‌ట్లు చెబుతున్నార‌ని, డోనాల్డ్ ట్రంప్ మాత్రం ఆప‌రేష‌న్ సింధూర్‌ను ఆపింది తానే అని 25 సార్లు చెప్పార‌ని, దీంట్లో ఏదో మ‌ర్మం ఉంద‌ని విస్మయం వ్యక్తం చేశారు.

కాగా, సమావేశాలు ప్రారంభమైన వరుసగా మూడోరోజైన బుధవారం కూడా ఉభయసభలు అట్టుడికాయి. ప్రతిపక్షాల ఆందోళనలతో ఎలాంటి చర్చ జరగకుండానే ఉభయసభలు వాయిదా పడ్డాయి. ఎగువ సభ, దిగువ సభ గురువారం ఉదయం 11 గంటలకు వాయిదా పడ్డాయి. ఉదయం, 11 గంటలకు ఉభయసభలు మొదలవగానే బీహార్‌లో కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివ్యూ (ఎస్ఐఆర్) పేరుతో చేపట్టిన ఓటర్ల జాబితా సవరణపై ప్రతిపక్ష ఎంపీలు నిరసన గళం వినిపించారు.

ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు ఆగమేఘాల మీద ఓటర్ల జాబితాను సవరించడం ప్రజాస్వామ్య విరుద్ధమని వారు మండిపడ్డారు. ఎన్నికల వేళ బీజేపీ వ్యతిరేక ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకు ఎన్నికల సంఘం కేంద్రంతో కలిసి కుట్రకు తెరలేపిందని ఆరోపించారు. తీరా ఎన్నికల ముందు ఓటర్ల జాబితాను సవరించడం ఈ మధ్య కాలంలో పరిపాటిగా మారిందని వారు విమర్శించారు. 

ఓటర్ల జాబితా సవరణతోపాటు పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్‌ సింధూర్‌పై చర్చకు డిమాండ్‌ చేశారు. దీంతో ఉభయసభల్లో గందరగోళం నెలకొంది. ఇండియా కూటమి ఎంపీల ఆందోళనలతో సభా కార్యకలాపాలు ముందుకు సాగడం లేదు. సభ్యులు ఎంతకూ తగ్గకపోవడంతో లోక్‌సభ, రాజ్యసభ రేపటి వాయిదా పడ్డాయి.