బిహార్‌లో 52 ల‌క్ష‌ల ఓట‌ర్ల తొల‌గింపు

బిహార్‌లో 52 ల‌క్ష‌ల ఓట‌ర్ల తొల‌గింపు

బిహార్ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ రోజురోజుకు ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్ప‌టికే పెద్ద సంఖ్య‌లో విదేశీయులను గుర్తించిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం (సిఈసి) మంగ‌ళ‌వారం భారీగా ఓట‌ర్లను తొలగించింది. ల‌క్షా , 10 ల‌క్ష‌లు కాదు ఏకంగా 52 ల‌క్ష‌ల మంది పేర్ల‌ను ఓట‌ర్ల జాబితా నుంచి తీసేసింది సీఈసీ. 

అయితే ఈ విష‌య‌మై రాజ‌కీయ పార్టీలు అందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని, ఆగ‌స్టు 1వ తేదీ వ‌ర‌కూ అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికి ఓటు హ‌క్కు క‌ల్పిస్తామ‌ని తెలిపింది ఎన్నిక‌ల సంఘం. బిహార్ రాష్ట్రంలోని ఓట‌ర్ల సంఖ్య‌ను వెల్ల‌డించానికి రెండు రోజుల ముందే కేంద్ర ఎన్నిక‌ల సంఘం వ‌డ‌బోత‌ను వేగ‌వంతం చేసింది. ప్ర‌ధానంగా రెండు అంశాల‌ను ప్ర‌మాణికంగా తీసుకొని 52 ల‌క్ష‌ల ఓట‌ర్ల‌ను తొల‌గించింది. 

చ‌నిపోయిన‌, ఇత‌ర నియోజ‌క వ‌ర్గాల‌కు వ‌ల‌స వెళ్లిన వాళ్ల పేర్ల‌ను మాత్ర‌మే జాబితా నుంచి త‌ప్పించామ‌ని సీఈసీ వెల్ల‌డించింది. ర‌ద్దు చేసిన‌ 52 ల‌క్ష‌ల మంది ఓట‌ర్ల‌లో 18 ల‌క్ష‌ల మంది చ‌నిపోయిన‌వాళ్లు కాగా, 26 ల‌క్ష‌ల మంది ఇత‌ర నియ‌జ‌క‌వ‌ర్గాల‌కు వ‌ల‌స వెళ్లిన వారు ఉన్నారు. మ‌రో 7 ల‌క్ష‌ల మంది రెండు ద‌ఫాలుగా ఓట‌ర్లుగా పేర్లు న‌మోదు చేసుకున్నారు. దాంతో వీళ్లంద‌రి పేర్ల‌ను ఉన్న‌పళంగా తీసేసింది సీఈసీ.

“స‌ర్ ఆర్డ‌ర్ 24.06.2025 ప్ర‌కారం ఆగ‌స్టు 1 నుంచి సెప్టెంబ‌ర్ 1 వ‌ర‌కూ ఓట‌ర్ల జాబితాపై ప్ర‌జలు త‌మ అభ్యంత‌రాల‌ను వ్య‌క్తం చేయ‌వ‌చ్చు. ఓట‌ర్ల తొల‌గింపు, జాబితాలో త‌మ పేర్లు లేక‌పోవ‌డం వంటి విష‌యాల‌ను మా దృష్టికి తీసుకువ‌చ్చేందుకు అవ‌కాశం క‌ల్పిస్తున్నాం. ఈ ప్ర‌క్రియ పూర్త‌య్యాక తుది జాబితాను సెప్టెంబ‌ర్ 30న ప్ర‌క‌టిస్తాం. ఆ త‌ర్వాత నుంచి అభ్య‌ర్థులు నామినేష‌న్ వేసే చివ‌రి రోజు వ‌ర‌కూ కూడా అర్హులైన వాళ్లు కొత్తగా ఓటు హ‌క్కుకు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు” అని సీఈసీ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.