
కరోనా, గల్వాన్ సంఘర్షణల నేపథ్యంలో నిలిపివేసిన చైనీయులకు ఇచ్చే పర్యాటక వీసాలను భారత్ తిరిగి పునరుద్ధరించనుంది. ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపరుచుకునేలా ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా దాదాపు ఐదేళ్ల తర్వాత చైనీయులకు భారత్ టూరిస్టు వీసాల జారీ ప్రక్రియను పునః ప్రారంభిస్తున్నట్లు చైనాలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.
జులై 24 నుంచి చైనా పౌరులకు టూరిస్టు వీసాలు మంజూరు చేయనున్నట్లు వెల్లడించింది. “2025 జూలై 24 నుంచి చైనా పౌరులు భారత పర్యటక వీసాలకు దరఖాస్తుప చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఆన్లైన్లో వీసా అప్లికేషన్‌ను నింపి ప్రింట్ చేసుకోవాలి. ఆ తర్వాత వెబ్ లింక్‌తో అపాయింట్మెంట్ బుక్ చేసి భారత్ వీసా అప్లికేషన్ కేంద్రానికి వెళ్లాలి. ఈ సమయంలో తప్పనిసరిగా వారి పాస్‌పోర్ట్, వీసా అప్లికేషన్ ఫారమ్, ఇతర పత్రాలు సమర్పించాలి” అని ప్రకటించింది.
2020 ప్రారంభంలో కరోనా మహమ్మారి కారణంగా చైనాలోని వివిధ యూనివర్సిటీల్లో చదువుకుంటున్న సుమారు 22 వేల మంది భారత విద్యార్థులు స్వదేశానికి తిరిగి వచ్చారు. అనంతరం వారు భౌతిక తరగతులకు హాజరయ్యేందుకు అభ్యర్థించినా చైనా వారిని అనుమతించలేదు. ఈ విషయంపై ఆ దేశానికి భారత ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ చైనా స్పందించకపోవడంతో ఆ దేశ పౌరులకు జారీ చేసిన టూరిస్ట్ వీసాలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2022లో భారత్ తరఫున ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటిఏ) ఓ సర్క్యులర్ జారీ చేసింది.
గల్వాన్ సంఘర్షణల నేపథ్యంలో భారత్-చైనాల మధ్య పలు విభేదాలు వచ్చాయి. దీంతో చైనాపై పలు ఆంక్షలు విధించింది. వందలాది చైనీస్ యాప్‌లను భారత్ నిషేధించింది. ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులను కూడా రద్దు చేసింది. అయితే, ప్రస్తుతం ఇరు దేశాలు సంబంధాలను మెరుగుపరుచుకునే విధంగా ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే లఢఖ్ సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ, గస్తీ పునఃప్రారంభం, నేరుగా విమాన సర్వీసులు పునరుద్ధరణ, కైలాస మానససరోవర్ యాత్ర పునఃప్రారంభం వంటి విషయాల్లో రెండు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. అనేక చర్చల తర్వాత దెబ్బతిన్న దౌత్య సంబంధాలు క్రమంగా సాధారణస్థితికి చేరుతున్నాయి.
మరోవైపు గల్వాన్ ఘటన తర్వాత తొలిసారిగా భారత విదేశాంగశాఖ మంత్రి చైనాలో పర్యటించారు. షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు కోసం చైనా వెళ్లిన జైశంకర్, అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో పాటు ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్ , విదేశాంగమంత్రి వాంగ్ యీతో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, సహకారాలను మరింత బలోపేతం చేసుకోవడం వల్ల రెండు దేశాలతో పాటు ప్రపంచానికి కూడా ప్రయోజనకరమని చెప్పారు. ఈ తరుణంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్ కు చైనా, ఐరోపా, యుఎఈ, అమెరికాల నిఘా యంత్రాలు