కాంగ్రెస్ రూ. 199 కోట్లకు పన్ను కట్టాల్సిందే

కాంగ్రెస్ రూ. 199 కోట్లకు పన్ను కట్టాల్సిందే

ఆదాయపన్ను శాఖ కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ త‌గిలింది. త‌మ పార్టీకి విరాళంగా వ‌చ్చిన రూ.199 కోట్ల డ‌బ్బుపై ప‌న్ను మిన‌హాయంపు కోసం చేస్తున్న ప్ర‌య‌త్నం బెడిసికొట్టింది. మంగ‌ళ‌వారం ఆదాయ ప‌న్ను అప్పిల్లేట్ ట్రిబ్యున‌ల్  ఆ పార్టీ అప్పీల్‌ను తిర‌స్క‌రించింది. గ‌తంలో ఆదాయ ప‌న్ను అధికారులు తీసుకున్న నిర్ణ‌యాన్నే ట్రిబ్యున‌ల్ స‌మ‌ర్ధించింది.  ఎట్టి ప‌రిస్థితుల్లోనూ కాంగ్రెస్‌కు మినహాయింపు ఇవ్వ‌బోమ‌ని తేల్చి చెప్పింది.

దాంతో, ఏం చేయాలో తెలియ‌క త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. కేంద్రంలో వ‌రుసగా మూడో ప‌ర్యాయం అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి ఆదాయ ప‌న్నుఉచ్చు బిగుసుకుంటోంది. 2018-19లో పార్టీకి విరాళం రూపంలో రూ.199 కోట్లు వ‌చ్చాయి.  ఆ డ‌బ్బుపై త‌ప్ప‌నిస‌రిగా ప‌న్ను చెల్లించాల్సిందేన‌ని ఆదాయ‌పు ప‌న్ను శాఖ అధికారులు కాంగ్రెస్‌కు స్ప‌ష్టం చేశారు.

ఇదే విష‌య‌మై ప‌లుమార్లు నోటీసులు కూడా పంపారు. అయితే.. కాంగ్రెస్ నాయ‌క‌త్వం మాత్రం అవి విరాళాలుగా వ‌చ్చిన డ‌బ్బుల‌ని, వాటిపై ప‌న్ను విధించ‌డం స‌మంజ‌సం కాద‌ని వాదిస్తోంది. అంతేకాదు 2019లో కాంగ్రెస్ ఆదాయ ప‌న్ను వివ‌రాల‌ను డిసెంబ‌ర్ బ‌దులు నెల ఆల‌స్యంగా ఫిబ్ర‌వ‌రి 2న స‌మ‌ర్పించింది. 

ఆదాయ‌ప‌న్ను చ‌ట్టంలోని సెక్ష‌న్ 13ఏ ప్రకారం రూ.199 కోట్ల‌కు మిన‌హాయింపు ఇవ్వాల‌ని ఐటీ శాఖ‌ను కోరింది. అయితే, అదే ఏడాది సెప్టెంబ‌ర్‌లో కాంగ్రెస్ పార్టీ నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా ఒక దాత నుంచి రూ.14.49 ల‌క్ష‌లు విరాళంగా స్వీక‌రించిన‌ట్టు ఆదాయపు ప‌న్ను అధికారులు గుర్తించారు. నియ‌మాల ప్ర‌కారం ఒకరి నుంచి రూ.2 వేల‌కు మించి తీసుకోకూడ‌దు.