భారత సైన్యం అమ్ములపొదిలో అపాచీ హెలికాప్టర్లు

భారత సైన్యం అమ్ములపొదిలో అపాచీ హెలికాప్టర్లు
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అపాచీ హెలికాప్టర్లు భారత సైన్యం అమ్ములపొదిలో చేరాయి. అమెరికా నుంచి రావాల్సిన అత్యాధునిక ఏహెచ్-64ఇ  అపాచీ హెలికాప్టర్లు మంగళవారం వాయుసేనకు అందాయి. తొలివిడతలో భాగంగా మూడు అపాచీ హెలికాప్టర్లు ఉత్తర్‌ప్రదేశ్‌లోని హిండన్‌ ఎయిర్‌బేస్‌కు చేరుకున్నాయి. యూఎస్‌ అంతరిక్ష సంస్థ బోయింగ్‌ అమెరికా నుంచి రవాణా విమానంలో వీటిని భారత్‌కు చేర్చింది.
 
ఈ హెలికాప్టర్లను దేశ పశ్చిమ సరిహద్దులకు చేరువలోని రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో మోహరించనున్నారు. అపాచీ హెలికాప్టర్ల రాక ఇప్పటికే 15 నెలలు ఆలస్యం కాగా, ఈ ఏడాది చివరిలోగా మరో మూడు రానున్నాయి. గగనతలం నుంచి శత్రుమూకపై ఉరుము లేని పిడుగులా నిప్పులు కురిపించే ఈ హెలికాప్టర్ల చేరికతో భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది.
 
అమెరికన్ మేడ్ అపాచీ హెలీకాప్టర్లు చేరికను భారత సైన్యం ఒక మైలు రాయిగా అభివర్ణించింది. ఇది భారత సైన్యం కార్యాచారణ సామర్థ్యాలను గణనీయంగా పెంచుతుందని ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. “ఇండియన్ ఆర్మీ ఏవియేషన్ కోసం మొదటి బ్యాచ్ అపాచీ హెలీకాప్టర్లు ఈ రోజు భారతదేశానికి చేరుకున్నాయి. ఇది ఒక మైల్ స్టోన్ మూమెంట్. ఇది మన భారత సైన్యం కార్యాచరణ సామర్థ్యాలను గణనీయంగా పెంచుతుంది” అంటూ భారతీయ సైన్యం ఎక్స్ లో పోస్ట్ చేసింది.
ఎగిరే యుద్ధట్యాంకుగా పేరుపొందిన ఈ అపాచీ హెలికాప్టర్లు నింగిలో అద్భుత విన్యాసాలు చేస్తూ ప్రత్యర్థులను తికమక పెట్టగలవు. వీటిలో అధునాతన కమ్యూనికేషన్లు, నేవిగేషన్, సెన్సర్, ఆయుధ వ్యవస్థలు ఉన్నాయి. శత్రువుపై గురితప్పకుండా ఆయుధ ప్రయోగం చేసేందుకు మోడర్నైజ్ టార్గెట్ అక్విజీషన్ డిజి గ్నేషన్ సిస్టమ్ దీనిలో ఉంది.  రాత్రి పగలు అని తేడా లేకుండా శత్రుస్థావరాలపై దాడులు చేయడానికి ఇది సాయపడుతుంది. 

ధూళి, వర్షం, పొగమంచు వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ కచ్చితత్వంతో దాడులు చేసే సామర్థ్యం వీటి సొంతం. ఈ హెలికాప్టర్ ప్రధాన బలం దీని రెక్కలపై ఉండే లాంగ్‌ బౌ రాడార్ వ్యవస్థ.  అందువల్ల చెట్లు, కొండల మాటున దాగి ఉంటూ దాడులు చేయగలదు.  శక్తిమంతమైన ఇంజిన్లు, పటిష్టమైన రెక్కలు కారణంగా ప్రత్యర్థుల దాడులను కాచుకోగలదు. గంటకు గరిష్ఠంగా 279 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ హెలికాప్టర్లు దాదాపు 6 వేల మీటర్ల ఎత్తుకు ఎగరగలదు.

అంతేకాదు, తక్కువ ఎత్తులో ఎగురుతూ మెరుపు దాడులు చేసి సురక్షితంగా తిరిగిరాగలదు. శక్తిమంతమైన 30 ఎంఎం చైన్‌గన్‌ వ్యవస్థ కలిగి ఉన్న ఇవి నిమిషానికి 16 వందల వరకూ తూటాలను పేల్చగలవు. నేలపైనున్న భిన్నలక్ష్యాల పైకి రాకెట్లతో ఏకకాలంలో దాడులు చేయగలదు. అంతేకాదు ఈ అపాచీ హెలీకాప్టర్ ఆకాశం నుంచి భూమిపైకి హెల్ ఫైర్ క్షిపణులను, 70ఎంఎం హైడ్రా రాకెట్లును ప్రయోగించగలదు. అలాగే గగనతల దాడులకు స్టింగర్ క్షిపణులు వంటి వివిధ రకాల బాంబులను వేయగలదు.

భారత వైమానిక దళం వద్ద ఇప్పటికే 22 అపాచీ హెలికాప్టర్లు ఉన్నాయి. అదనంగా సైన్యం కోసం 600 మిలియన్ డాలర్ల వ్యయంతో ఆరు హెలికాప్టర్లను అమెరికా నుంచి కొనుగోలు చేసేందుకు కేంద్రప్రభుత్వం 2020 ఫిబ్రవరిలో ఆమోదం తెలిపింది. తొలి విడతలో 3 హెలికాప్టర్లు భారత సైన్యానికి అందాయి.