రేవంత్ ఫోన్ ట్యాప్పింగ్ తో తెలంగాణ మంత్రుల కలవరం!

రేవంత్ ఫోన్ ట్యాప్పింగ్ తో తెలంగాణ మంత్రుల కలవరం!
కేసీఆర్ ప్రభుత్వం హయాంలో 2023 ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడటం ద్వారా ప్రతిపక్షాల కదలికలు, ఎత్తుగడలను తెలుసుకొనే ప్రయత్నం చేయడమే కాకుండా, సెలెబ్రెటీలు, సంపన్నుల ఫోన్ లను సహితం ట్యాప్ చేసి వేధించారని, పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేశారని తీవ్రమైన ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణ చేపట్టింది. 
 
మరోవంక స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రుల ఫోన్ లపై నిఘా అంచారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ విషయమై బిఆర్ఎస్ నేత కేటీఆర్ ఆరోపణలు చేసిన రెండు రోజులకే `సౌత్ పోస్ట్’ అనే వెబ్ పోర్టల్ సవివరమైన కధనాన్ని ఇవ్వడం గమనార్హం. దానితో  కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మె ల్యేలు, ఆఖరికి కార్పొరేషన్ల చైర్మన్లు సైతం  అభద్రతాభావానికి గురవుతున్నారు. 
 
ఈ  కథనం ప్రకారం ఒక సీనియర్ మంత్రి, తన బంగ్లాలోని బెడ్ రూంలో విశ్రాంతి తీసుకుంటూ, మరో మంత్రితో ఫోన్లో మాట్లాడారు.  ఈ సంభాషణ దాదాపు ఒక గంటకు పైగా సాగింది. ఇద్దరూ ఒకే జిల్లాకు చెందిన మంత్రులు కావడంతో తమ ఆవేదనను ఒకరితో ఒకరు పంచుకున్నారు. అయితే, వారు ఊహించని విధంగా, ఈ సంభాషణ దాదాపు పూర్తిగా ముఖ్యనేత చెవులకు చేరింది. 
 
వారిద్దరూ మాట్లాడుకున్న సంభాషణలోని చాలా భాగాలను గుర్తు చేస్తూ ఆ మంత్రిని ముఖ్యమంత్రి ఆశ్చర్యపరిచారు.  “నువ్వు ఆయనతో (మరో మంత్రి) ఎందుకు చేతులు కలిపావు? నీకు ఏమైనా సమస్యలుంటే నాతో చెప్పు, నేను పరిష్కరి స్తాను” అని అన్నట్టు సమాచారం. ఈ సంభాషణ గురించి మీకెలా తెలిసిందని మంత్రి ప్రశ్నించగా, ఆయన చాలా స్పష్టంగా ఇలా సమాధానమిచ్చారట.
“మీరు ఎవరితో ఏమి మాట్లాడుతున్నారు, ఎవరిని కలుస్తు న్నారు, ఎప్పుడు, ఎక్కడికి వెళ్తున్నారు అనే విషయాలపై నిఘా ఉంచడం సహజం” అని సమాధానం ఇచ్చారు. ఈ హఠాత్ పరిణామాలతో సంబంధిత మంత్రులిద్దరూ తమ ఫోన్లు మార్చేశారు. ఒకరు ఫోన్ వాడకాన్ని మానేయగా, మరొక మంత్రి ఎవరినైనా సంప్రదించాలంటే గన్ మెన్, లేదా వ్యక్తిగత కార్యదర్శిని సంప్రదిం చాల్సిన పరిస్థితి నెలకొన్నది. మరో మంత్రి, కీలక నేత ఈ ఫోన్ ట్యాపింగ్  సంభాషణలో పాల్గొనకపోయినా తనపై నిత్యం నిఘా ఉందని తెలుసుకున్నారట.