కళాశాలపై కూలిన ఎయిర్‌ఫోర్స్‌ విమానం.. 20 మంది దుర్మరణం

కళాశాలపై కూలిన ఎయిర్‌ఫోర్స్‌ విమానం.. 20 మంది దుర్మరణం
బంగ్లాదేశ్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎఫ్‌-7 విమానం సోమవారం కళాశాల  భవనంపై కూలిపోవడంతో ఇప్పటివరకు 20 మంది ప్రాణాలు కోల్పోగా, 170 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో మైల్‌స్టోన్‌ కళాశాలలో విద్యార్థులు ఉన్నారు. విమానం కూలిన తర్వాత కళాశాలలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత సంఘటనా స్థలానికి అగ్నిమాపక, రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. 
 
నేషనల్ బర్న్ ఇన్‌స్టిట్యూట్ అధికారి ప్రొఫెసర్ మొహమ్మద్ సైదుర్ రెహమాన్ మాట్లాడుతూ విమానం పైలట్ సహా కనీసం 19 మంది ఈ ప్రమాదంలో మరణించారని థెయ్ల్పారు. హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయం సీనియర్ అధికారి ప్రమాదాన్ని ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న బంగ్లాదేశ్ ఆర్మీ బృందం, అగ్నిమాపక దళం, సివిల్‌ డిఫెన్స్‌ టీమ్‌ వాహనాలను మోహరించి సహాయక చర్యలు చేపట్టాయి. 
 
ఢాకాలోని ఉత్తర ప్రాంతంలోని దియాబారి ప్రాంతంలోని మైల్‌స్టోన్ స్కూల్, కళాశాల క్యాంపస్‌లో వైమానిక దళ శిక్షణ విమానం ఎఫ్-7 బిజీఐ కూలిపోయిందని బంగ్లాదేశ్ ఆర్మీ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీస్ తెలిపింది. మధ్యాహ్నం 1.06 గంటలకు శిక్షణ విమానం టేకాఫ్ అయిన వెంటనే కూలిపోయిందని అధికారులు తెలిపారు. ప్రమాదం తర్వాత విమానం మంటలు చెలరేగాయి.

మంటలను ఆర్పడానికి ఎనిమిది అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. విమానం కూలిపోయిన పాఠశాల ఆవరణలో తరగతులు జరుగుతున్నాయి. సైన్యం, అగ్నిమాపక దళం సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులను తల్లిదండ్రులను సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్లారు.  గాయపడిన విద్యార్థులను ఆర్మీ సిబ్బంది రక్షించారు. 

కాగా, ఎఫ్-7 జెట్ చైనా తయారు చేసింది. చైనా నిర్మిత ఎఫ్-7 కూలిపోవడం ఇది ఈ ఏడాదిలో రెండో ఘటన కావడం గమనార్హం. గత నెలలో మయన్మార్ వైమానిక దళానికి చెందిన ఎఫ్-7 ఫైటర్ జెట్ సాగింగ్ ప్రాంతంలో కూలిపోయింది. నెల వ్యవధిలోనే రెండు చైనా నిర్మిత ఎఫ్-7 జెట్‌లు కూలిపోవడంతో బీజింగ్ ఉత్పత్తి చేసే రక్షణ పరికరాల నాణ్యతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.