
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా చేపట్టిన రాజీవ్ యువవికాసం పథకాన్ని తాత్కాలికంగా పక్కనబెట్టింది. లబ్ధిదారుల ఎంపికను ఎక్కడికక్కడ నిలిపేసింది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత, లబ్ధిదారులను గ్రామసభల్లోనే ఎంపిక చేయాలని నిర్ణయించింది. రాజీవ్ యువవికాసం పథకం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాలకు చెందిన 16,27,584 మంది దరఖాస్తు చేసుకోగా, ప్రభుత్వం 4,93,234 యూనిట్లను మంజూరు చేసింది.
తొలిదశలో రూ.50 వేల లోపు యూనిట్లతో మొదలుపెట్టి చివరగా రూ.4 లక్షల యూనిట్లను అందివ్వాలని భావించింది. వాస్తవానికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, బ్యాంకులు సిబిల్స్కోర్కే ప్రాధాన్యం ఇవ్వడం, స్థానిక నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలకే ఇవ్వాలని పట్టుబట్టడంతో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నిలిచిపోయింది.
రాజీవ్ యువ వికాసం పథకం కింద యువతకు రుణాలను అందిస్తామని చెప్పిన ప్రభుత్వం గరిష్ఠంగా 60 ఏండ్ల వయసు వారికీ అవకాశం కల్పించింది. దీనిని యువత తీవ్రంగా వ్యతిరేకించింది. మరోవైపు, ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపికకు అనేక షరతులు పెట్టింది. దీనికితోడు ఎమ్మెల్యేలు చెప్పినవారినే ఎంపిక చేస్తున్నారని, పైరవీలకు, కాంగ్రెస్ కార్యకర్తలకే పెద్దపీట వేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో పూర్తి పారద్శకంగా ఎంపిక చేసేందుకే ఈ పథకాన్ని వాయిదా వేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించడం పరిస్థితి తీవ్రతను సూచిస్తున్నది. రాజీవ్ యువ వికాసం కోసం 16,27,584 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 50 శాతానికిపైగా రూ.4లక్షల యూనిట్లకు సంబంధించినవే ఉన్నాయి.
దళితబంధు, బీసీబంధు, ట్రైకార్ రుణాలకు గతంలోనే దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నవారు మరో 10 లక్షల మందికిపైగా ఉంటారు. వారందరికీ రుణాలు ఇవ్వలేని పరిస్థితి. ఒకరికి ఇస్తే పది మంది తిరగబడతారనే భయం సర్కారుకూ పట్టుకున్నది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించిన తరువాతనే దీనిపై ముందుకుపోవాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టు ఉన్నతాధికారులు, పార్టీ వర్గాలు పేర్కొంటున్నారు.
మరోవంక, గ్రామసభల్లో ఎంపిక ప్రక్రియను ఎలాచేయాలో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ పథకం కింద రూ.50 వేల యూనిట్ మినహా మిగిలిన యూనిట్లన్నీ బ్యాంకు లింకేజీ రుణలే. ప్రభుత్వ సబ్సిడీపోగా మిగతా మొత్తాన్ని బ్యాంకులే రుణంగా మంజూరు చేయాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో దరఖాస్తుదారుల సిబిల్స్కోర్ను క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల మేరకు ఉన్న వారినే బ్యాంకులు ఎంపికచేస్తున్నాయి.
కానీ, స్థానిక కాంగ్రెస్ నేతలు తాము చెప్పిన వారికే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. దీంతో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ముందుకు సాగని పరిస్థితి నెలకొన్నది. గ్రామసభల్లో ఎంపిక అంటే రాజకీయ జోక్యం మరీ ఎక్కువవుతుందని, అది ఇంకా కష్టమని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
More Stories
17 నుంచి `సేవా పక్షం అభియాన్’గా మోదీ జన్మదినం
దక్షిణ భారత కుంభమేళాగా గోదావరి పుష్కరాలు
తెలంగాణలో 15 నుంచి కాలేజీలు నిరవధిక బంద్