ధర్మస్థలలో మహిళలు, బాలికల మృతదేహాల ఖననంపై సిట్

ధర్మస్థలలో మహిళలు, బాలికల మృతదేహాల ఖననంపై సిట్
కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థల ప్రాంతంలో 1998 నుండి 2014 మధ్య కాలంలో వందలాది మంది మహిళలు, యువతులను లైంగిక వేధింపులకు గురిచేసి, సామూహిక ఖననం చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై పెద్ద దుమారం చెలరేగడంతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తుకు సిట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (అంతర్గత భద్రతా విభాగం) ప్రణబ్ మొహంతి నేతృత్వంలో సిట్ పనిచేస్తుంది. డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (రిక్రూట్‌మెంట్) ఎం ఎన్ అనుచేత్, ఐపీఎస్ అధికారులు సౌమ్యలత, ఎస్ కె, జితేంద్ర కుమార్ దయామా ఆయనకు సహాయం చేస్తారు.


గత 20 సంవత్సరాలుగా ధర్మస్థల ప్రాంతంలో తప్పిపోయిన మహిళలు, బాలికలపై వివరణాత్మక సమాచారం కోరుతూ కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ దక్షిణ కన్నడ పోలీసు సూపరింటెండెంట్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలకు లేఖ రాయడంతో ప్రభుత్వం స్పందించింది. “తమ పిల్లల అదృశ్యం లేదా మరణం కేసు నమోదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు సిబ్బంది సరిగ్గా స్పందించలేదని చాలా కుటుంబాలు ఆరోపించాయి” అని ఆ లేఖలో ఆమె పేర్కొన్నారు. జూలై 3న తన న్యాయవాదుల ద్వారా పోలీసులను ఆశ్రయించిన మాజీ పారిశుధ్య కార్మికుడి ఫిర్యాదుతో తొలుత దర్యాప్తు ప్రారంభమైంది.
 
1995 నుండి 2014 మధ్య ధర్మస్థల ఆలయ పరిపాలన కోసం పనిచేస్తున్నప్పుడు, అనేక మృతదేహాలను ఖననం చేయవలసి వచ్చిందని, వాటిలో కొన్ని లైంగిక హింసకు సంబంధించిన సంకేతాలను కలిగి ఉన్నాయని ఆయన ఆరోపించారు. దాదాపు దశాబ్దం క్రితం తాను  అపరాధ భావనతో. ఆ ప్రాంతం నుండి పారిపోయానని, ఇటీవలే తిరిగి వచ్చానని అతను చెప్పాడు.
 
ధర్మస్థలంలోని మంజునాథ మందిరంలో పనిచేస్తున్న మాజీ పారిశుధ్య కార్మికుడు ఒకరు ధర్మస్థలంలో మహిళలు, మైనర్ బాలికల మృతదేహాలను బలవంతంగా ఖననం చేశానని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు అందరి దృష్టిని ఆకర్షించింది. ధర్మస్థల యాత్రకు వెళ్లిన తన కుమార్తె అదృశ్యమైందని సుజాత అనే మహిళ మరో ఫిర్యాదు చేసింది. జూన్ 3, 2025న, మాజీ పారిశుధ్య కార్మికుడ అస్థిపంజర అవశేషాల ఫోటో ఆధారాలతో సహా. పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
తన ఫిర్యాదులో, 1998 నుండి 2014 మధ్య మహిళలు, యువతులు సహా వందలాది హత్య బాధితుల మృతదేహాలను ఖననం చేయమని బలవంతం చేశారని  పేర్కొన్నాడు. వీరిలో చాలామంది లైంగిక వేధింపులకు గురయ్యారని ఆరోపించాడు. “చాలా మంది మహిళా మృతదేహాలు దుస్తులు లేదా లోదుస్తులు లేకుండా ఉన్నాయి. కొన్ని లైంగిక దాడి, హింసకు సంబంధించిన స్పష్టమైన సంకేతాలతో ఉన్నాయి. హింసను సూచించే గాయాలు లేదా గొంతు కోసి చంపడం… విద్యార్థులు సహా 100 మందికి పైగా మహిళలు అత్యాచారం, హత్య మరియు ఖననం చేసాను…,” అని తన ఫిర్యాదులో రాశారు.
 
ఫిర్యాదు చేసిన వారం తర్వాత, తన ఫిర్యాదులో చేసిన ఆరోపణలకు సాక్ష్యం చెప్పడానికి తల నుండి కాలి వరకు వస్త్రం కప్పుకుని కోర్టుకు హాజరయ్యాడు. నిందితులు ఆలయ పరిపాలనతో సంబంధం ఉన్న ప్రభావవంతమైన వ్యక్తులని అతను పేర్కొన్నాడు. అతని ఫిర్యాదు తర్వాత జూలై 15న అనన్య భట్ అనే మొదటి సంవత్సరం ఎంబిబిఎస్ విద్యార్థిని తల్లి సుజాత మరో ఫిర్యాదు దాఖలు చేసింది.
 
తన కుమార్తె 2003లో ధర్మస్థలానికి కళాశాల పర్యటన సందర్భంగా వచ్చి అదృశ్యమైనట్లు ఆరోపించింది. మాజీ పారిశుధ్య కార్మికుడి వాంగ్మూలంలో పేర్కొన్న బాధితుల్లో తన కుమార్తె కూడా ఉండవచ్చని 60 ఏళ్ల సుజాత నమ్ముతోంది.
 
మాజీ పారిశుధ్య కార్మికుడు, తాను ఖననం చేసినట్లు చెప్పుకుంటున్న హత్య బాధితులకు సంబంధించిన కొన్ని విభ్రాంతి కలిగిన్చే  వివరాలను వెల్లడించాడు. 2010లో, కల్లెరిలోని పెట్రోల్ బంక్ సమీపంలో 12-15 సంవత్సరాల వయస్సు గల పాఠశాల బాలికను బలవంతంగా పాతిపెట్టారని అతను చెప్పాడు. ఆ బాలిక స్కూల్ యూనిఫాం ధరించిందని, కానీ ఆమె స్కర్ట్,  లోదుస్తులు కనిపించలేదని, ఆమె శరీరంపై లైంగిక దాడి, గొంతు కోసి చంపిన గుర్తులు ఉన్నాయని పేర్కొన్నాడు.
 
మరో బాధితురాలి గురించి మాట్లాడుతూ, ఆమె 20 ఏళ్ల మహిళ అని, ఆమె ముఖంపై యాసిడ్ పోసి కాల్చి చంపారని, ఆమె శరీరం వార్తాపత్రికలతో చుట్టబడి ఉందని గుర్తు చేసుకున్నారు. ఆమె శరీరాన్ని డీజిల్ తో కాల్చమని తనకు సూచించారని చెప్పారు. తడి మట్టి కారణంగా మృతదేహాలు గుర్తించకుండా, త్వరగా కుళ్ళిపోకుండా ఉండటానికి నేత్రావతి నది ఒడ్డున కొన్ని మృతదేహాలను పూడ్చిపెట్టమని తనను ఆదేశించినట్లు వెల్లడించారు. 
 
ఆ బాధితులందరి మృతదేహాలను బలవంతంగా పూడ్చిపెట్టారని లేదా దహనం చేశారని, అలా చేయకపోతే చంపేస్తామని బెదిరించారని ఆయన ఆరోపించారు. తన కుటుంబంలోని మైనర్ బాలికపై తన సూపర్‌వైజర్లతో సంబంధం ఉన్న వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన తర్వాత 2014 డిసెంబర్‌లో ధర్మస్థల నుండి పారిపోయానని ఆయన చెప్పారు. పారిపోయిన తర్వాత, అతను చాలా సంవత్సరాలు పొరుగు రాష్ట్రాల్లో దాక్కున్నాడు.
 
తాను తీవ్ర అపరాధ భావన కారణంగా తిరిగి వచ్చానని  పేర్కొన్నారు. “ఖననం చేసిన మృతదేహాలకు సరైన అంత్యక్రియలు జరిగితే, బాధపడ్డ వారి ఆత్మలకు శాంతి కలుగుతుంది. నా అపరాధ భావన కూడా తగ్గుతుంది… మరణించిన వ్యక్తి గౌరవప్రదమైన వీడ్కోలు అర్హుడని నేను నమ్ముతున్నాను…” అని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సాక్షుల రక్షణ చట్టం, 2018 కింద రక్షణ కోరుతూ, ఖననం చేసిన స్థలాలు, నిందితుల పేర్లను గుర్తించడం ద్వారా కేసు దర్యాప్తులో సహకరించడానికి ముందుకొచ్చారు. 
 
మరోవంక, మణిపాల్‌కు చెందిన తన కుమార్తె అనన్య భట్, వైద్య విద్యార్థిని, 2003లో ధర్మస్థలాన్ని సందర్శించిన తర్వాత కనిపించకుండా పోయిందని సుజాత భట్ ఫిర్యాదు చేశారు. తన కుమార్తె కోసం వెతుకుతూ ఆ ప్రదేశాన్ని సందర్శించినప్పుడు, స్థానికులు కొంతమంది ఆలయ అధికారులతో కలిసి ఆ బాలికను చూశారని చెప్పారు. అయితే, ఆమె పోలీసులను సంప్రదించినప్పుడు, ఆమె ఫిర్యాదును పట్టించుకోలేదు.
 
ఆ తర్వాత ఆమెను ముగ్గురు వ్యక్తులు అపహరించి, దాడి చేసి అపస్మారక స్థితిలోకి నెట్టారు. 3 నెలల తర్వాత తాను బెంగళూరు ఆసుపత్రిలో మేల్కొన్నానని ఆమె చెప్పింది. సీబీఐలో ఉద్యోగిని అయినప్పటికీ, అధికారుల నుండి ఆమెకు ఎటువంటి మద్దతు లభించలేదు. తన కుమార్తె మృతదేహాన్ని గుర్తించడానికి దొరికిన అస్థిపంజరాల డిఎన్ఏ విశ్లేషణను ఆమె ఇప్పుడు డిమాండ్ చేసింది.
ఈ సంఘటనలపై సమగ్రంగా విచారణ చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తామని అధికారికంగా ప్రభుత్వం ప్రకటించింది. కేసుకు సంబంధించి సాక్ష్యాలను సేకరించడం, మృతదేహాల ఆవశేషాల విశ్లేషణ, డిఎన్ఏ పరీక్షలు వంటి అంశాలు ఇందులో భాగం కానున్నాయి.ఈ ఆరోపణలు నిజమైతే, ఇది కర్ణాటకలో ఇప్పటివరకు వెలుగుచూసిన అత్యంత భీకరమైన మానవ హత్యల కేసుగా నిలవనుంది. వందలాది మహిళలు గల్లంతయ్యారన్న వార్తలు స్థానికులను తీవ్ర ఆందోళనలోకి నెట్టాయి. ఇప్పటివరకు పోలీసులకు తెలియనిది, ఇన్నేళ్ల తర్వాత బయటపడుతుండటం కూడా చర్చనీయాంశమైంది. ప్రభుత్వ దర్యాప్తు ఎటు వైపు దారి తీస్తుందో అన్న ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది.