విమాన ప్రమాదంపై నిబంధనల ప్రకారమే దర్యాప్తు

విమాన ప్రమాదంపై నిబంధనల ప్రకారమే దర్యాప్తు

అహ్మదాబాద్‌ విమాన ప్రమాద ఘటనపై విచారణ జరుగుతోందని, తుది నివేదిక వచ్చేంత వరకు వేచి చూడాలని పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు కోరారు. రాజ్యసభలో విమాన ప్రమాదంపై మాట్లాడిన రామ్మోహన్‌, విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ-ఏఏఐబి  నిబంధనల ఆధారిత ప్రక్రియలో విచారణ జరుపుతోందని తెలిపారు. 

ఏఏఐబి ప్రాథమిక నివేదికను సమర్పించిందన్న కేంద్రమంత్రి ఇప్పుడే ఓ అవగాహనకు వచ్చినట్లు కాదని పేర్కొన్నారు. విమాన ప్రమాదంపై పెద్ద ఎత్తున అసత్య ప్రచారం జరుగుతోందని పేర్కొంటూ  ప్రాథమిక నివేదిక, కేవలం ప్రమాదం ఎలా జరిగిందని తెలిపేందుకు మాత్రమే ఉపయోగపడుతుందని చెప్పారు. బ్లాక్‌బాక్స్​ను విజయవంతంగా వెలికి తీశారని, దాన్ని డీకోడ్‌ చేసే ప్రక్రియ పూర్తిగా భారత్‌లోనే జరుగుతోందని వెల్లడించారు. భవిష్యత్​లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంపై విదేశీ మీడియా అసత్యాలు ప్రచారం చేస్తోందని కేంద్ర మంత్రి మండిపడ్డారు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు సొంత అభిప్రాయాలు చెప్పకూడదని, నిబంధనల ప్రకారమే దర్యాప్తు జరుగుతుందని తెలిపారు.  ఈ సందర్భంగా, ఎయిర్ ఇండియా లేదా బోయింగ్ వంటి సంస్థలకు మద్దతు ఇవ్వడం కాదని, తమ లక్ష్యం కేవలం సత్యాన్ని వెలికితీసేందుకేనని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.

దర్యాప్తు ప్రక్రియను అందరూ గౌరవించాలని, నిజమైన సమాచారం తుది నివేదిక ద్వారా బయటకు వస్తుందని ఆయన వెల్లడించారు. ఇలాంటి విమాన ప్రమాద దర్యాప్తులు అంతర్జాతీయంగా ఒక నిర్దిష్ట ప్రక్రియను అనుసరిస్తాయని మంత్రి వివరించారు. భారతదేశం కూడా ఈ అంతర్జాతీయ ప్రమాణాలకు కట్టుబడి ఉందని, ఈ దర్యాప్తు ఆ దిశగా సాగుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రమాద కారణాలను గుర్తించేందుకు సమగ్ర విశ్లేషణ జరుగుతోందని, తుది నివేదికలో అన్ని వివరాలు స్పష్టమవుతాయని ఆయన హామీ ఇచ్చారు.

విమానాలు, ఎయిర్‌పోర్టుల్లో నిత్యం తనిఖీలు జరుగుతాయని, ప్రతికూల వాతావరణం, పక్షుల వల్ల కొన్ని ప్రమాదాలు జరగవచ్చని తెలిపారు. “కొన్నిసార్లు అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి నిబంధనల ప్రకారం అన్నీ తనిఖీ చేశాకే విమానం టేకాఫ్ అవుతుంది. ఎక్కడైనా నిర్లక్ష్యం ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం” అని మంత్రి పేర్కొన్నారు.

విమానశ్రయాల్లో సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి రామ్మోహన్​  తెలిపారు. 90 శాతం వరకు పోస్టులు భర్తీ జరిగేలా చూస్తామని వెల్లడించారు. దేశంలో రోజుకు 5 లక్షల మంది విమానాల్లో సురక్షితంగా ప్రయాణిస్తున్నారని, విమానయానశాఖకు ప్రపంచ దేశాలతో అనేక సంబంధాలు ఉంటాయని తెలిపారు. ఇతర దేశాల నియమాలు, నిబంధనలు కూడా పాటించాలని పేర్కొన్నారు. ఈ పదేళ్లలో దేశంలోని విమానాశ్రయాలు రెండింతలు అయ్యాయని తెలిపారు. విమానాశ్రయాల అభివృద్ధి, విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కొన్ని విమానాశ్రయాల విస్తరణకు స్థానికంగా అనేక ఇబ్బందులు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.