పార్టీ ప్రయోజనాల కన్నా దేశం ముఖ్యం

పార్టీ ప్రయోజనాల కన్నా దేశం ముఖ్యం
 
* శశి థరూర్ తో తమకు సంబంధం లేదన్న కాంగ్రెస్ నేత!
 
పార్టీ ప్రయోజనాల కన్నా దేశం ముఖ్యమనేది తన వ్యక్తిగత అభిప్రాయమని అని పేర్కొంటూ కొన్ని సార్లు దీన్ని నమ్మకద్రోహంగా భావిస్తుంటారని, అదే పెద్ద సమస్య అని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ విచారం వ్యక్తం చేశారు. ఏ ప్రజాస్వామ్యంలోనైనా రాజకీయాలు అంటే పోటీ కావడం దురదృష్టకరమని, కొన్ని సందర్భాల్లో క్రాస్-పార్టీ సహకారాన్ని అవిధేయతగా చూస్తుంటారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో ఇటీవల కాలంలో సంబంధాలపై కొచ్చిలో ఓ హైస్కూలు విద్యార్థి అడిగిన ప్రశ్నకు శశిథరూర్ సమాధానమిస్తూ, రాజకీయాలు అంటేనే పోటీ అని, తనలాంటి వాళ్లు తమ పార్టీలను గౌరవిస్తారని తెలిపారు.  అయితే జాతీయ భద్రత విషయానికి వచ్చేసరికి మనం ఇతర పార్టీలతో కలిసి పనిచేయాల్సిన అవసరం వస్తుందని స్పష్టం చేసారు. 

అలాంటి సందర్భాల్లో ఒక్కోసారి పార్టీలు దానిని అవిధేయతగా భావిస్తుంటాయని, అదే పెద్ద సమస్య అని నవ్వుతూ సమాధానమిచ్చారు. మన సాయుధ దళాలకు, మన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం సరైనదేనని తాను నమ్మడం వల్ల అనేక మంది తనను విమర్శించారని, అయితే తన వైఖరి సరైనదేనని తాను నమ్మి నిలబడ్డానని చెప్పారు.

జాతీయ భద్రతకు తాను ఎన్నడూ తొలి ప్రాధాన్యమిస్తానని, ఏ రాజకీయ పార్టీ అయినా దేశాన్ని మెరుగుపరచాలనే కోరుకుంటుందని మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ స్పష్టం చేశారు. తనకు దేశమే మొదటి ప్రాధాన్యత అని పేర్కొంటూ దేశాన్ని మెరుగుపరచడమే పార్టీల ఉద్దేశం కావాలని తెలిపారు. సిద్ధాంతాల పరంగా పార్టీల మధ్య వైరుధ్యాలు ఉండొచ్చనీ, అయితే సురక్షితమైన భారత్‌కు అవన్నీ కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు.

‘దేశం చనిపోతో ఎవరు జీవిస్తారు’ అని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ  దేశం ప్రమాదంలో ఉన్నప్పుడు రాజకీయ పార్టీలన్నీ ఐక్యంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జాతీయ ఐక్యతకు రాజకీయాలు అడ్డుకారాదని హితవు చెప్పారు. సమావేశానంతరం కాంగ్రెస్ అధిష్ఠానంతో ఏవైనా సమస్యలున్నాయా అని అడిగినప్పుడు, రాజకీయాలు గురించి, సమస్యల గురించి మాట్లేడేందుకు తాను ఇక్కడకు రాలేదంటూ ఆయన నవ్వుతూ చెప్పారు.

మరోవంక, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కే.మురళీధరన్ ఇకపై థరూర్ తమలో ఒకరు కాదని స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలతో కాంగ్రెస్‌ థరూర్‌ను దూరం పెట్టేందుకు సిద్ధమవుతుందనే వార్తలు నిజమేనని అర్ధమవుతోంది. 

“థరూర్ తన అభిప్రాయం మార్చుకున్న రోజు నుంచి ఆయనతో సంబంధాలు తెంచుకున్నాం. అందుకే తిరువనంతపురంలో మేము నిర్వహించే పార్టీ కార్యక్రమాలకు ఎంపీని పిలవకూడదని నిర్ణయించుకున్నాం. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో సభ్యుడైన థరూర్‌ ఇకపై మాలో ఒకరు కాదు. ఆయనపై ఎలాంటి చర్యలను తీసుకోవాలనేది జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుంది” అని మురళీధరన్ స్పష్టం చేశారు.