
ఎయిరిండియా విమాన ప్రమాదంపై విదేశీ మీడియాలో వస్తున్న తప్పుడు కథనాలపై కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పైలట్ పొరపాటు వల్లే ఘోర ప్రమాదం అంటూ అమెరికాకు చెందిన ది వాల్ స్ట్రీట్ జర్నల్, రైటర్స్ సంస్థలు వార్తలు ప్రచురించడాన్ని మంత్రి తీవ్రంగా తప్పుబట్టారు.
తనకు విమాన ప్రమాద దర్యాప్తు సంస్థ (ఏఏఐబి)పై పూర్తి విశ్వాసం ఉందని పేర్కొంటూ స్వలాభం కోసమే పాశ్చాత్య మీడియా ఈ ఘటనపై అసత్య కథనాలు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. “నాకు ఏఏఐబీపై పూర్తి నమ్మకం ఉంది. ప్రమాదానికి దారితీసిన కారణాలను ఆ సంస్థ కనుగొంటుందని విశ్వసిస్తున్నా. భారత్‌లో డేటాను డీకోడింగ్ చేయడంలో వాళ్లు సఫలీకృతం అయ్యారు. నిజంగా ఇది అతి పెద్ద విజయం. మరో విషయం” అని తెలిపారు.
“ఏఏఐబీ అందరికి ఒక విజ్ఞప్తి చేస్తోంది. ముఖ్యంగా పాశ్చాత్య మీడియా సంస్థలు తమ సొంత ప్రయోజనాల కోసం ఎయిరిండియా ప్రమాదంపై పనిగట్టుకొని మరీ అసత్య కథనాలను వెలువరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ వైఖరి మానుకోవాలని కోరుతున్నాం” అని మంత్రి హెచ్చరించారు. విమాన ప్రమాదానికి కారణాలను విశ్లేషించే బాధ్యత ఏఏఐబీ తీసుకున్నందున ఊహాగానాలను ప్రచారం చేయొద్దని మంత్రి కోరారు.
“తుది నివేదిక వచ్చేంత వరకూ ఎవరూ కూడా ఊహాజనిత వాఖ్యలు చేయొద్దు. అందుకే మేము దర్యాప్తు సవ్యంగా జరిగేలా చూసుకుంటున్నాం. రిపోర్టు వచ్చాకే అన్ని విషయాలు తెలుస్తాయి” అని మంత్రి పేర్కొన్నారు. ఈ కథనాలపై ఏఏఐబి కూడా ఆందోళన వ్యక్తం చేసింది. విదేశీ మీడియా తప్పుడు వార్తల్ని ప్రచారం చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరింది.
అమెరికా రవాణా భద్రతా మండలి (ఎన్ టిఎస్ బి) చైర్‌పర్సన్ జెన్నిఫర్ హోమెండీ కూడా ఈ కథనాలను ఊహాగానాలుగానే కొట్టిపారేశారు. దర్యాప్తుకు పూర్తి సహకారం అందిస్తున్నామని, విచారణ కొనసాగుతోందని స్పష్టం చేశారు. జూలై 17న ఏఏఐబీ విడుదల చేసిన ప్రకటనలో అంతర్జాతీయ మీడియాలోని అవాస్తవ కవర్‌జ్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర మంత్రి మీడియాను బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. “ఊహాగానాల వలన తప్పుడు భావనలు ఏర్పడతాయి. అందరూ సంయమనం పాటించాలి,” అని నాయుడు హెచ్చరించారు.
More Stories
ఆపరేషన్ సింధూర్ తో ముక్కలైన మసూద్ కుటుంబం
బీహార్ లో ఆర్జేడీ, కాంగ్రెస్ అస్తవ్యస్త పాలన
వక్ఫ్ సవరణ చట్టంలో రెండు నిబంధనల అమలు నిలిపివేత