థాయ్ లో ‘మిస్ గోల్ఫ్’ `హనీ ట్రాప్’లో బౌద్ధ సన్యాసులు!

థాయ్ లో ‘మిస్ గోల్ఫ్’ `హనీ ట్రాప్’లో బౌద్ధ సన్యాసులు!

దాదాపు 90 శాతం మంది ప్రజలు బౌద్ధమతానికి చెందిన వారే
ఉన్న థాయిలాండ్‌లో ఇప్పుడు బౌద్ధారామాలపై వస్తున్న ఆరోపణలపై ప్రజల్లో ఆగ్రహావేశాలు రేగుతున్నాయి. బ్రహ్మచర్యాన్ని పాటించాల్సిన బౌద్ధ సన్యాసులు అనైతిక పనులకు పాల్పడడంతో దేశ ప్రతిష్ఠ మంటగలుస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో బౌద్ధాలయాలు లైంగిక నేరాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి పలు తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి.

తాజాగా, ‘మిస్ గోల్ఫ్’ అన్న మారుపేరుతో పరిచయమైన ఓ మహిళ 9 మంది బౌద్ధ సన్యాసులతో లైంగిక సంబంధాలు పెట్టుకుని వాటి ఫొటోలు, వీడియోలు ఉపయోగించి వారిని బ్లాక్‌మెయిల్ చేసి కోట్లాది రూపాయలు వసూలు చేసిన ఉదయం వెలుగులోకి వచ్చింది. ఆ మహిళను అరెస్టు చేసిన థాయ్ పోలీసులు ఆమె నుంచి 80,000 వేలకు పైగా న్యూడ్ ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు. 

ఈ బ్లాక్‌మెయిల్ ఉదంతంతో అనేక బౌద్ధ ఆలయాలకు సంబంధం ఉన్నట్లు కూడా గుర్తించారు. అనేకమంది బౌద్ధ సన్యాసులతో లైంగిక సంబంధాలు పెట్టుకుని ఆ ఫోటోలు, వీడియోలు లీక్ చేయకుండా ఉండడానికి పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసిన ఆ మహిళను థాయిలాండ్ పోలీసులు నాలుగు రోజుల క్రితం అరెస్టు చేశారు.‘మిస్ గోల్ఫ్’గా పరిచయం చేసుకున్న ఆ మహిళపై దోపిడీ, మనీ లాండరింగ్ తదితర కేసులు నమోదయ్యాయి.

ఆ మహిళ కనీసం తొమ్మిది మంది బౌద్ధ సన్యాసులతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నట్లు పోలీసులు ఈ నెల 15న మీడియా సమావేశంలో వెల్లడించారు. గత మూడేళ్లలో వారినుంచి ఈ మహిళ కనీసం 85 మిలియన్ల బాత్‌లు(థాయిలాండ్ కరెన్సీ) వసూలు చేసినట్లు వారు తెలిపారు. అంటే భారతీయ కరెన్సీలో రూ.100 కోట్లకు పైగా అన్న మాట.

ఆ మహిళ ఇంటిని సో దా చేసిన పోలీసులకు బౌద్ధ సన్యాసులను బ్లాక్‌మెయిల్ చేయడానికి ఉపయోగించిన 80,000 వేలకు పైగా న్యూడ్ ఫోటోలు, వీడియోలు దొరికినట్లు ఓ పోలీసు ప్రతినిధి చేశారు.‘తాము ఆమె ఆర్థిక లావాదేవీలను చెక్ చేయగా పలు బౌద్ధాలయాలకు ఈ కుంభకోణంతో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది’ అని థాయిలాండ్ పోలీసు కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రతినిధి జరూంకియట్ పంక్యూ చెప్పారు.

ఆమె మొబైల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని చెక్ చేసిన తర్వాత ఈ వ్యవహారంలో అనేక మంది బౌద్ధ సన్యాసులకు సంబంధం ఉన్నట్లు, పలు వీడియో క్లిప్పింగ్‌లు, లైవ్‌చాటింగ్‌లు ఉన్నట్లు గుర్తించామని ఆయన చెప్పారు. 30 35 ఏళ్ల మధ్య వయసు ఉండే ఆ మహిళ పేరు విలావన్ ఎమ్ సావత్. కానీ ‘ మిస్ గోల్ఫ్’ అన్న మారు పేరుతోనే చెలామణి అవుతూ వచ్చింది. 

గత జూన్ నెల మధ్యలో ఓ సీనియర్ బౌద్ధ గురువు ఈ మహిళ వేధింపులు తాళలేక హటాత్తుగా బౌద్ధ గురువు పదవి వదిలిపెట్టి నట్లు తెలియడంతో ఈ కేసు మొదట తమ దృష్టికి వచ్చినట్లు ఆ అధికారి చెప్పారు. 2024లో ఆ బౌద్ధ గురువుతో ఆ మహిళ లైంగిక సంబంధం పెట్టుకుంది.  ఆయన వల్ల తాను ఓ బిడ్డకు తల్లినయ్యానని చెప్తూ, ఆ బిడ్డ ఆలనా పాలన కోసం కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు పోలీసులు చెప్పారు. ఇతర బౌద్ధ సన్యాసులుకూడా ఇదే రీతిన పెద్ద మొత్తాల్లో ఆ మహిళ ఖాతాకు డబ్బులు బదిలీ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ కుంభకోణం వెలుగులోకి రావడంతో బౌద్ధారామాల నియమ నిబంధనలను పరిశీలించడం కోసం ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాలు చేస్తున్నట్లు థాయ్ బౌద్ధ మత వ్యవహారాలు చూసే సంఘ సుప్రీం కౌన్సిల్ ప్రకటించింది. బౌద్ధారామాల ఆచారాలు, నియమాలను ఉల్లంఘించి బౌద్ధ సన్యాసులకు భారీ జరిమానాలు, జైలు శిక్షలులాంటి కఠిన శిక్షలు విధించాలని థాయిలాండ్ ప్రభుత్వం కూడా యోచిస్తోంది. 

ఇటీవల వెలుగులోకి వచ్చిన బౌద్ధ సన్యాసుల అక్రమ వ్యవహారాల కారణంగా గతంలో 81 మంది బౌద్ధ సన్యాసులకు అత్యున్నత బిరుదులు ప్రకటిస్తూ గత జూన్‌లో జారీ చేసిన రాజాదేశాన్ని సైతం థాయ్‌లాండ్ రాజు వజిరాలోంగ్‌కార్న్ గత వారం ఉపసంహరించుకున్నారు.