ఉక్రెయిన్‌పై 300కు పైగా డ్రోన్‌లతో రష్యా దాడి

ఉక్రెయిన్‌పై 300కు పైగా డ్రోన్‌లతో రష్యా దాడి
రష్యా-ఉక్రెయిన్‌ దేశాల మధ్య కాల్పుల విరమణ కోసం ఒకవైపు మంతనాలు జరుగుతున్నాయి. అయినా ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగిస్తోంది. తాజాగా 
ఉక్రెయిన్‌లోని కీవ్‌ సహా పలు ప్రాంతాల్లో రష్యా సైనిక బలగాలు విరుచుకుపడ్డాయని ఉక్రెయిన్‌ సైనికాధికారులు తెలిపారు. కీవ్‌పై 300కు పైగా డ్రోన్లు, 30 పైగా క్షిఫణులతో దాడులు జరిగినట్లు వారు పేర్కొన్నారు.
 
ఈ దాడిలో అనేక నివాస భవనాలు, ఆస్పత్రులు, వాహనాలు ధ్వంసమైనట్లు తెలిపారు. భవనాల శిథిలాల కింద అనేక మంది ప్రజలు చిక్కుకున్నారని.. వారిని బయటకు తీసుకొచ్చేందుకు భద్రతా బలగాలు సహాయక చర్యలు చేపడుతున్నాయని తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. రష్యన్‌ దళాలు ఉక్రెయిన్‌లోని ఒడెసా నగరంపై 20కి పైగా డ్రోన్లు, పదుల సంఖ్యలో క్షిపణులు ప్రయోగించడంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్ర గాయాలపాలైనట్లు ఆ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు.
భారీ ఆస్తి నష్టం సంభవించింది. ఈశాన్య సుమీ ప్రాంతంలో కీలకమైన మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. అయితే ఈ యుద్ధం సమయంలో తమకు అండగా ఉంటూ ఆయుధాలను సరఫరా చేస్తున్న మిత్ర దేశాలకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కృతజ్ఞతలు తెలిపారు. రష్యాతో జరుగుతున్న యుద్ధాన్ని ఎదుర్కోవడానికి ఉక్రెయిన్‌కు ఆస్ట్రేలియా ఆయుధ సాయం చేస్తోంది. ఇందులోభాగంగా శనివారం కీవ్‌కు ఎం1ఏ1 అబ్రమ్స్ ట్యాంకులను అందజేసింది. ఇతర సామగ్రిని రాబోయే నెలల్లో పంపనున్నట్లు ఆస్ట్రేలియా రక్షణమంత్రి రిచర్డ్ మార్లెస్ పేర్కొన్నారు.