అన్ని అంశాలపై పార్లమెంట్‌లో చర్చకు సిద్ధం

అన్ని అంశాలపై పార్లమెంట్‌లో చర్చకు సిద్ధం
 
పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న సందర్భంగా ఆదివారం కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు పలు అంశాలపై చర్చించాలని డిమాండ్‌ చేశారు. బిహార్​లో కొనసాగుతున్న ఓటర్ల ప్రత్యేక పునర్విశ్లేషణ ప్రక్రియ (ఎస్ఐఆర్), పహల్గాం ఉగ్రదాడి, భారత్- పాక్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సహా పలు అంశాలను ప్రతిపక్షాలు లేవనెత్తాయి. 
 
కేంద్ర మంత్రి, రాజ్యసభ నాయకుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన ఈ అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్, బీజేపీ, ఆప్, సహా పలు రాజకీయ పార్టీల నాయకులు హాజరయ్యారు. ఈ క్రమంలో సభ సజావుగా సాగడానికి సహకరించాలని విపక్ష పార్టీలను కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. బిహార్​లో ఓటరు జాబితాల సవరణ (ఎస్ఐఆర్) తాలుక పోల్ స్కామ్, భారత్- పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి తానే మధ్యవర్తిత్వం వహించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల గురించి వివరణ వంటి అంశాలను అఖిలపక్ష సమావేశంలో లేవనెత్తినట్లు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు. 

పహల్గాం ఉగ్రదాడి, బిహార్​లో ఎస్ఐఆర్, భారత్- పాక్ మధ్య కుదిరిన కాల్పుల ఒప్పందంపై ట్రంప్ వ్యాఖ్యలు తదితర అంశాలను అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ లేవనెత్తిందని ఆ పార్టీ ఎంపీ గౌరవ్ గొగోయ్ తెలిపారు. కాంగ్రెస్ లేవనెత్తిన కీలక అంశాలపై ప్రధాని మోదీ పార్లమెంటులో ప్రకటన ఇవ్వాలని కోరామని చెప్పారు. ఒడిశాలో శాంతిభద్రతలను కాపాడడంలో బీజేపీ సర్కార్ పూర్తిగా విఫలమైందని బీజేడీ ఎంపీ సస్మిత్ పాత్రా వ్యాఖ్యానించారు. 

శాంతి భద్రతలను పరిరక్షణలో ఒడిశా సర్కార్ నిస్సహాయంగా ఉండిపోయిందని విమర్శించారు. సమావేశంలో ఆయా అంశాలపై నిర్మాణాత్మక చర్చకు హామీ ఇచ్చింది. సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు మాట్లాడుతూ తామ విశాల హృదయంతో చర్చకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. నిబంధనలు, సంప్రదాయం మేరకు పని చేస్తామని. వీటిని చాలా విలువైనవిగా భావిస్తామని పేర్కొన్నారు.

కేంద్రం పార్లమెంట్‌లో తగిన విధంగా స్పందిస్తుందని చెప్పారు. అయితే, ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశంపై మీడియా ఆయనను ప్రశ్నించగా పార్లమెంట్‌లో ఆపరేషన్‌ సిందూర్‌ వంటి ముఖ్యమైన అంశాలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
 
కాలిపోయిన రూ.500 నోట్ల కట్టలు దొరికిన తర్వాత అభిశంసనను ఎదుర్కొంటున్న ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ కేసుపై స్పందిస్తూ,  ఆయనను తొలగించేందుకు ఇప్పటికే 100 మంది ఎంపీలు సంతకాలు చేశారని చెప్పారు.  జస్టిస్ వర్మ కేసులో ఈ ప్రక్రియను అన్ని పార్టీలు కలిసి చేపడుతాయని, ఇది ఒక్క ప్రభుత్వం చర్య కాదని స్పష్టం చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 21 నుంచి ఆగస్టు 21 వరకు జరగనున్నాయి.
 
అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు గౌరవ్ గోగోయ్, కె. సురేశ్, జైరాం రమేశ్, శివసేన ఎంపీ శ్రీకాంత్ శిందే, కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్, ఎన్‌ సీపీ (ఎస్ పీ) ఎంపీ సుప్రియా సూలే, బీజేపీ నేత రవి కిషన్ సహా మరికొందరు నాయకులు అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నారు. అలాగే ఎస్ పీ, వైసీపీ, జేడీయూ, ఏఐఏడీఎంకే, సీపీఎం, డీఎంకే ప్రతినిధులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి పార్లమెంటు సమావేశాలు (వర్షకాల సమావేశాలు) జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.