హైజాకర్లకు ఆశ్రయం కల్పిస్తే పాక్ లో మరణ శిక్ష రద్దు

హైజాకర్లకు ఆశ్రయం కల్పిస్తే పాక్ లో మరణ శిక్ష రద్దు

ఉగ్రమూకలను పెంచి పోషిస్తూ ప్రపంచ దేశాలపై దాడులు చేయిస్తున్న పాకిస్థాన్ మరో దుస్సాహసానికి పాల్పడింది. ఉగ్రవాదులకు, విమాన హైజాకర్లకు ఆశ్రయం కల్పించిన వారికి మరణ శిక్షను రద్దు చేసింది. ఇందుకోసం ఏకంగా చట్టంలోనే సవరణలు చేపట్టింది. ఇందుకు సంబంధించిన బిల్లుకు పాక్ సెనెట్ తాజాగా ఆమోదం తెలిపింది. ‘క్రిమినల్ లాస్ (సవరణ) బిల్లు 2025’ పేరుతో ప్రవేశ పెట్టిన ఈ బిల్లు దేశంలో అమలులో ఉన్న కొన్ని నేరాలకు మరణ శిక్షను రద్దు చేయాలని చెబుతుంది.

ముఖ్యంగా మహిళలను బహిరంగంగా వివస్త్రలను చేయడం, అవమానకరంగా ప్రదర్శించడం, అలాగే హైజాకర్లకు ఆశ్రయం కల్పించడం వంటి నేరాలకు పాల్పడిన వారికి మరణ శిక్ష స్థానంలో జీవిత ఖైదును విధించాలని నిర్ణయించింది.  ఈ చట్ట మార్పుకు ప్రధాన కారణం యూరోపియన్ యూనియన్ (ఇయు)తో పాకిస్థాన్‌కు ఉన్న జిఎస్పి+ (జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ప్లస్) వాణిజ్య ఒప్పందం ప్రకారం అంతర్జాతీయ మానవ హక్కుల నిబంధనలను పాటించాలి. 

అలాగే మరణశిక్షను ‘అత్యంత తీవ్రమైన నేరాలకు’ మాత్రమే పరిమితం చేయాలి. ఈ నిబంధనలకు అనుగుణంగా దేశీయ  మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందువల్లే ప్రస్తుతం మరణశిక్ష విధించబడుతున్న రెండు నేరాలకు బదులుగా జీవిత ఖైదు, అలాగే భారీ జరిమానాలు విధించేలా సవరణలు చేశారు. ఇది యూరోపియన్ దేశాలతో పాకిస్థాన్ వాణిజ్య సంబంధాలను పెంపొందించడానికి, అంతర్జాతీయ వేదికపై దేశం విశ్వసనీయతను పెంచడానికి తోడ్పడుతుంది.

సెనేట్‌లో ఈ బిల్లుపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. కొంతమంది సెనేటర్లు.. ముఖ్యంగా మహిళలను వివస్త్రలను చేసే నేరాన్ని ‘హత్యతో సమానమైన తీవ్రమైన నేరంగా’ అభివర్ణించారు. అలాంటి వాటికి మరణశిక్షను రద్దు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మరణశిక్షను తొలగించడం వల్ల నేరగాళ్లలో భయం తగ్గుతుందని, నేరాలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 

అయితే దేశ న్యాయ శాఖ మంత్రి ఈ అభ్యంతరాలను తోసిపుచ్చారు. శిక్షల తీవ్రత ద్వారా మాత్రమే నేరాలు తగ్గుతాయన్న వాదనను ఆయన అంగీకరించలేదు. యూరప్‌ను ఉదాహరణగా చూపుతూ అక్కడ మరణశిక్ష లేనప్పటికీ నేరాల రేటు తక్కువగా ఉందని ఆయన గుర్తు చేశారు. శిక్షలు కఠినంగా ఉండటం ముఖ్యం కాదని, నేరాలను సమర్థవంతంగా నిరోధించడానికి న్యాయవ్యవస్థ పటిష్టంగా ఉండటమే ప్రధానమని ఆయన వాదించారు. 

ఈ క్రిమినల్ చట్టాల సవరణ బిల్లుతో పాటు సెనెట్ పలు ఇతర కీలక బిల్లులైన ‘ఎక్స్‌ట్రాడిషన్ సవరణ బిల్లు’, ‘పాకిస్థాన్ పౌరసత్వ చట్టం సవరణ బిల్లు’లకు కూడా ఆమోదం తెలిపింది. ఈ చట్ట సవరణలు పాకిస్థాన్ న్యాయవ్యవస్థలో గణనీయమైన మార్పులకు నాంది పలికాయి.