పార్ల‌మెంట్ స‌మావేశాల్లో ‘జాతీయ క్రీడా పాలన బిల్లు

పార్ల‌మెంట్ స‌మావేశాల్లో ‘జాతీయ క్రీడా పాలన బిల్లు

* రాజ్యసభ ముందుకు 13 బిల్లులు

సోమవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న జాతీయ క్రీడా పాలన బిల్లు, భారత్ క్రీడా రంగంలో కొత్త శకానికి నాంది పలుకుతుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఇదొక చారిత్రాత్మకమైన బిల్లుగా అభివర్ణించారు.

“ఇప్పుడు ఈ బిల్లు ఆమోదం సజావుగా జరుగుతుందని ఆశిస్తున్నా. ఇంకా రెండు అంశాలు ఉన్నాయి. ఖేలో భారత్ నీతి, యాంటీ డోపింగ్ సవరణ బిల్లు. ఈ రెండు బిల్లులతో కలిపి పార్లమెంట్లో చర్చించనున్నాం. సభ్యులంతా కచ్చితంగా చరుకుగా పాల్గొంటారని అనుకుంటున్నా. కొత్త బిల్లు ఆమోదం పొందిన తర్వాత, దేశంలో ఒక కొత్త క్రీడా సంస్కృతికి నాంది పలుకుతుంది. ఇప్పటికే ఖేలో ఇండియా కార్యక్రమం క్రీడలపై అవగాహనను పెంచింది” అని కిరణ్ రిజిజు పేర్కొన్నారు.

2019 నుంచి 2021 వరకు రెండు సంవత్సరాలు పాటు కిరెణ్ రిజిజు కేంద్ర క్రీడల మంత్రిగా ఉన్నారు. ఇక ఈ బిల్లు జాతీయ క్రీడా సమాఖ్యలు, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ)లలో సుపరిపాలన కోసం స్పష్టమైన చట్రాన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తోంది. ఎన్ఎస్ఎఫ్లు గుర్తింపు ఇవ్వడం, నిధులు మంజారు చేయడం వంటి అంశాలు ఈ బిల్లులో ఉంటాయి.

అంతేకాకుకండా క్రీడా నిర్వహణదారుల కోసం రెగ్యులేటరీ బోర్డును ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. పరిపాలనా, ఆర్థిక, నైతిక ప్రమాణాల అమలును ఈ నియంత్రణ బోర్డు పర్యవేక్షించనుంది. ఈ బిల్లులో భాగంగా నియంత్రణ బోర్డుతో పాటు నైతిక, వివాద పరిష్కార సంఘాలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది.

ఇవి పరిపాలనలో పాదర్శకతను తీసుకురావడమే కాకుండా, క్రీడాకారులు, నిర్వహకుల మధ్య ఎన్నికలు, ఎంపికలు వంటి అంశాలపై తలెత్తే వివాదలను తగ్గించనున్నాయి. అయితే ఈ బిల్లును ఇండియన్ ఒలింపిక్ ఆసోసియేషన్ తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేసింది. ఎన్ఎస్ఎఫ్లకు నోడల్ బాడీగా నియంత్రణ బోర్డు ఏర్పడితే తమ హోదాను దెబ్బతీస్తుందని భావిస్తోంది.

 ప్రభుత్వ జోక్యం కోసం భారత్పై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సస్పెండ్ చేసే ప్రమాదం ఉందని ఐఓఏ ప్రస్తుత అధ్యక్షురాలు పీటీ ఉషా సూచించారు. అయితే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీతో సంప్రదింపులు జరిపిన తర్వాతే బిల్లును రూపొందించినట్లు కేంద్రం తెలిపింది. 2036లో ఒలింపిక్స్ నిర్వహణ కోసం భారత్ బిడ్ వేయాలని చూస్తున్న నేపథ్యంలో ఐఓసీ ఉండటం చాలా కీలకమని కేంద్రం భావిస్తోంది.

కాగా, రాజ్యసభ ముందుకు 13 బిల్లులు ఆమోదం కోసం రానున్నాయి. ఈ జాబితాను రాజ్యసభ సెక్రటేరియట్‌ శనివారం విడుదల చేసింది. 13 బిల్లుల్లో 8 బిల్లులు కొత్తవి. మిగిలినవి ఇప్పటికే లోక్‌సభ ఆమోదించిన బిల్లులు, లేదా దిగువ సభలో ప్రవేశపెట్టిన బిల్లులు. సరుకు రవాణా బిల్లులు, సముద్రం ద్వారా వస్తువులను రవాణా చేసే బిల్లు, కోస్టల్‌ షిప్పింగ్‌ బిల్లులను ఇదివరకే లోక్‌సభ ఆమోదించింది.
 
వీటిని ఇప్పుడు రాజ్యసభలో ఆమోదం కోసం జాబితాలో చేర్చారు. అలాగే గోవా రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాలలో షెడ్యూల్డ్‌ తెగల ప్రాతినిధ్య పునర్వ్యవస్థీకరణ బిల్లు, ఆదాయపు పన్ను బిల్లులను లోక్‌సభలో ఇప్పటికే ప్రవేశపెట్టారు.. ఆ బిల్లులను కూడా వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఇవి కాకుండా మరో 8 కొత్త బిల్లులను రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు సిద్ధం చేశారు.
 
 ఆ బిల్లులు: 1. మణిపూర్‌ వస్తువులు, సేవల పన్ను సవరణ బిల్లు, 2. జన్‌ విశ్వాస్‌ నిబంధనల సరవణ బిల్లు, 3. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ సరవణ బిల్లు, 4. పన్ను చట్టాల సవరణ బిల్లు, 5. జియోహెరిటేజ్‌ సైట్స్‌, జియో రెలిక్స్‌ సంరక్షణ, నిర్వహణ బిల్లు, 6. గనులు, ఖనిజాభివృద్ధి, నియంత్రణ సవరణ బిల్లు, 7. నేషనల్‌ స్పోర్ట్స్‌ గవర్నెన్స్‌ బిల్లు, 8. జాతీయ డోపింగ్‌ నిరోధక సవరణ బిల్లు.