లిక్కర్‌ కేసులో వైసిపి ఎంపి మిథున్‌రెడ్డి అరెస్ట్

లిక్కర్‌ కేసులో వైసిపి ఎంపి మిథున్‌రెడ్డి అరెస్ట్

రాష్ట్రంలో సంచలనంగా మారిన లిక్కర్‌ కేసులో వైసిపి రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని సిట్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. దాదాపుగా ఏడు గంటల పాటు శనివారం విచారించిన అనంతరం సాయంత్రం ఆరు గంటల ప్రాంతలో మిథున్‌రెడ్డిని అరెస్ట్‌ చేస్తున్నట్లు సిట్‌ అధికారులు ప్రకటించారు. ఆయన్ను ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఎసిబి కోర్టు జడ్జి ముందు హాజరుపరచనున్నారు. 

ఇదే కేసులో అప్పటి ఎక్సైజ్‌ శాఖ మంత్రి నారాయణస్వామి సోమవారం ఉదయం సిట్‌ అధికారుల ముందు విచారణకు హాజరుకావాలంటూ నోటీస్‌ అందజేశారు. కీలకమైన ఈ కేసులో పోలీసులు అరెస్ట్‌ చేయకుండా ముందస్తు బెయిల్‌ కోసం ఎంపి హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించగా, ఆ రెండు కోర్టులు ముందస్తు బెయిల్‌ను తిరస్కరించిన నేపథ్యంలో ఆయన శనివారం మధ్యాహ్నం విజయవాడలోని సిట్‌ అధికారులు ముందు హాజరయ్యారు. 

లిక్కర్‌ కేసులో మొత్తం 41మందిని నిందితులుగా చూపగా ఇందులో 40మంది పేర్లను పేర్కొన్న అధికారులు 41వ పేరును ఖాళీగా ఉంచినట్లు తెలిసింది. బహుశా అంతిమ లబ్ధిదారుని పేరు కోసమేమన్న ఖాళీగా ఉంచి ఉంటారేమోననే చర్చ నడుస్తోంది. లిక్కర్‌ కేసులో పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని సిట్‌ అధికారులు ఎ4గా చూపించారు.

ఈ కేసులో ఎంపి మిధున్‌రెడ్డి అత్యంత కీలకమైన వ్యక్తిగా దర్యాప్తు బృందాలు భావిస్తున్నాయి. ఈ నేపధ్యంలో సిట్‌ అధికారులు ముఖ్యంగా మద్యంపాలసీ తయారీ, మిధున్‌రెడ్డి కంపెనీలకు నిధుల మళ్లింపు, మద్యం డిస్టలరీస్‌ నుంచి ఎలా నగదును రాబట్టారు? మద్య వర్తుల పాత్ర, మొత్తం మీద అంతిమ లబ్ధిదారుడు ఎవరు? అనే అంశాలపై దర్యాప్తు అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు సమాచారం. 

లిక్కర్‌ అంశాల గురించి ఎక్కడెక్కడ సిట్టింగ్‌లు జరిగాయి? లిక్కర్‌ కుంభకోణం ఎవరి సూచనలతో చేయాల్సి వచ్చింది? ఈ స్కామ్‌లో అంతిమ లబ్ధిదారునికి ఎంత మొత్తంలో చేరిందనే విషయాలపై పలు దఫాలుగా ప్రశ్నించినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి సుమారు 50 ప్రశ్నలు వరకు అటూ ఇటూ తిప్పి సిట్‌ అధికారులు అడిగి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. 

కొన్ని ప్రశ్నలకు అరకొరగా సమాధానం చెప్పినట్లు, మరి కొన్ని ప్రశ్నలకు తనకు తెలియదని సమాధానం చెప్పినట్లు తెలిసింది. అంతే కాకుండా ఈ విషయంతో తనకు సంబంధం లేక పోయినా రాజకీయ కక్షతో ఉద్ధేశ్యపూర్వకంగా తనను కేసులో ఇరికించినట్లు మిధున్‌రెడ్డి దర్యాప్తు అధికారులతో అన్నట్లు సమాచారం.

ప్రిలిమనరీ చార్జిషీట్‌ దాఖలు

మరోవంక, వైసిపి ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్‌ కుంభకోణం కేసుపై సిట్‌ దర్యాప్తు అధికారులు 300 పేజీలతో చార్జిషీట్‌ను శనివారం సాయంత్రం ఎసిబి కోర్టు జడ్జి ఇంటికి తీసుకెళ్ళి సమర్పించినట్లు సమాచారం. చార్జిషీట్‌తో పాటు వందకు పైగా ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నివేదికలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలను కూడా జత చేసినట్లు తెలిసింది. ఈ కేసులో ఇప్పటి వరకు రూ.62కోట్లు సీజ్‌ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. 

268 మంది సా క్షులను విచారించినట్లు చార్జిషీట్‌లో తెలిపారు. మద్యం ముడుపుల కేసులో షెల్‌ కంపెనీల ద్వారా రావడం, బ్లాక్‌ను వైట్‌గా మార్చడం, ఇప్పటి వరకు దర్యాప్తులో సేకరించిన సమాచారంతో పాటు స్వాధీనం చేసుకున్న పలు పత్రాలను కూడా జడ్జి ముందు ప్రవేశపెట్టినట్లు తెలిసింది. మరో 20 రోజుల్లో పూర్తి స్ధాయి చార్జిషీట్‌ దాఖలు చేస్తామని సిట్‌ అధికారులు పేర్కొంటున్నారు.