ఘనంగా మహంకాళి అమ్మవారి బోనాలు

ఘనంగా మహంకాళి అమ్మవారి బోనాలు
పాతబస్తీ లాల్‌ద‌ర్వాజా సింహవాహిని మ‌హాకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా ప్రారంభ‌మైంది.  ఉద‌యం అమ్మ‌వారికి కుమ్మ‌రి బోనం స‌మ‌ర్పించారు. గోల్కొండ కోటపై జగదాంబిక ఎల్లమ్మకు తొలి బోనంతో మొదలైన బోనాలు ఈ లాల్ దర్వాజ బోనాలతో చివరి అంకానికి చేరుకున్నాయి.  ఈ లాల్‌దర్వాజ బోనాల ఉత్సవాలను ఆదివారం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు నగరవాసులు సిద్ధమయ్యారు. 
 
ఆషాడంలో మొదటిగా గోల్కొండ బోనాలు, రెండోది బల్కంపేట ఏల్లమ్మ బోనాలు, ఆ తరువాత సికింద్రాబాద్‌ ఉజ్జయిని బోనాలు అనంతరం వచ్చే ఆదివారం రోజున లాల్‌దర్వాజ బోనాలు నిర్వహించడం సాంప్రదాయంగా వస్తున్నది.  అమ్మవారికి బోనాలని సమర్పించడానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఆలయానికి భక్తులు క్యూ కట్టడంతో పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి.
 
బోనాలతో వచ్చే భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. బోనాల సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారి పాటలతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. భక్తులు భారీగా ఆలయానికి తరలి వస్తుండటంతో అమ్మవారి దర్శనానికి గంటల సమయం పడుతోంది. తెలంగాణ ప్రభుత్వం తరపున ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ పట్టు వస్త్రాలు సమర్పించారు.
 
 లాల్‌దర్వాజ బోనాల జాత‌ర నేటి తెల్ల‌వారుజామున నాలుగు గంట‌ల‌కు ప్రారంభ‌మైంది. అమ్మ‌వారిని ద‌ర్శించుకునేందుకు తెల్ల‌వారుజాము నుంచే భారీగా భ‌క్తులు త‌ర‌లివ‌స్తున్నారు. అమ్మవారి పాటలతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. భక్తులు భారీగా ఆలయానికి తరలి వస్తుండటంతో అమ్మవారి దర్శనానికి గంటల సమయం పడుతోంది. 
 
దీంతో భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఆల‌యం వ‌ద్ద నాలుగు క్యూలైన్లు ఏర్పాటు చేశారు బోనాలు తెచ్చేవారి కోసం ప్ర‌త్యేకంగా ఒక క్యూలైన్ ఉంది. అలాగే భ‌క్తుల కోసం రెండు మెడిక‌ల్ క్యాంపులు ఏర్పాటు చేశారు.   సోమవారం అమ్మవారి భవిష్యవాణి చెప్పే సంప్రదాయ కార్యక్రమం మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుంది. ఒక మహిళ మట్టికుండపై నిలబడి భవిష్యవాణి వినిపించనుంది. సోమవారం సాయంత్రం లాల్ దర్వాజా నుంచి చార్మినార్, ఢిల్లీ దర్వాజ వరకు ఘటాల ఊరేగింపు, పోతరాజు విన్యాసాలు జరగనున్నాయి. ఇవి కనులపండుగగా సాగుతాయి. 
 
అందుకే ప్రభుత్వం సోమవారం అధికారిక సెలవు ఇచ్చింది. సోమవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, బ్యాంకులు మూతపడతాయి. లక్షలాదిగా భక్తులు తరలిరానుండటంతో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు చేపడుతున్నారు.. సుమారు 2500 మంది పోలీసులతో ప్రభుత్వం పటిష్ట భద్రత ఏర్పాటు చేసింది. బోనాలు జరుగుతున్న తీరును సమీక్షించేందుకు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.