వచ్చే ఏడాది నాటికి కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ 

వచ్చే ఏడాది నాటికి కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ 
* కాచిగూడ నుండి జోధ్‌పూర్‌కు నూతన ఎక్స్‌ప్రెస్ రైలు
వరంగల్ జిల్లా, కాజీపేట రైల్వే యూనిట్‌లో 2026 నాటికి ఉత్పత్తి ప్రారంభమవుతుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. కాజీపేటలో కొత్తగా నిర్మాణమవుతున్న రైల్వే ఉత్పత్తి యూనిట్ పనులను మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణం జరుగుతోందని చెప్పారు. 
 
కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒక మెగా ఫ్యాక్టరీగా రూపుదిద్దుకుంటోందని తెలిపారు. ఇక్కడ రైల్వే కోచ్‌లు, ఇంజన్లతో పాటు మెట్రో రైళ్ల తయారీ, డిజైన్ పనులు కూడా జరుగుతాయని పేర్కొన్నారు. బహుళ రకాల రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ కార్యకలాపాలు కొనసాగుతాయని తెలిపారు. రైల్వే కోచ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ అనేక ఏళ్లుగా ప్రజల కలగా ఉందని చెబుతూ ఆ కలను సాకారం చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీదేనని స్పష్టం చేశారు.
 
రూ.500 కోట్లతో ఈ పరిశ్రమ ఏర్పాటు జరుగుతోందని చెబుతూ ఈ ప్రాజెక్టు పురోగతిపై చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు.  కాజీపేట రైల్వే కోచ్ పరిశ్రమ అనేది 40 ఏళ్ల పోరాటమని, పివి నరసింహారావు కూడా కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ కోసం ప్రయత్నించారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. రైల్వే వ్యాగన్లు, కోచ్ లు, ఇంజిన్ల తయారీ పరిశ్రమను కాజీపేటకు ప్రధాని మంజూరు చేశారని, మోదీ  ఏదైనా మాట ఇస్తే తప్పకుండా నెరవేరుస్తారని పేర్కొన్నారు.

కోచ్ ఫ్యాక్టరీతో 3 వేల మందికి నేరుగా ఉపాధి కల్పిస్తామని, తెలంగాణలోని 40 వేల రైల్వే స్టేషన్లను ఆధునికరిస్తున్నాం అని తెలియజేశారు. వరంగల్ కు ఎయిర్ పోర్టు కూడా ఇప్పటికే రావాల్సి ఉందని, ఎయిర్ పోర్టుకు భూములివ్వాలని గతంలో మాజీ సిఎం కెసిఆర్ ను కోరామని చెప్పారు. భూసేకరణ గురించి ఈ ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నామని, ఎంత త్వరగా భూములిస్తే అంత త్వరగా ఎయిర్ పోర్టు పూర్తవుతుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

కాగా, జోధ్‌పూర్ (భగత్- కీ -కోఠి) నూతన ఎక్స్‌ప్రెస్ రైలును కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, . కిషన్ రెడ్డి జెండా ఊపి కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ హైదరాబాద్ నుండి జోధ్‌పూర్‌కు రోజువారీ రైలు నడపడం హైదరాబాద్‌లో నివసిస్తున్న రాజస్థానీ సమాజం చిరకాల స్వప్నమని చెప్పారు.

గతంలో పరిమితుల కారణంగా రైలును ప్రారంభించలేకపోయామని తెలిపారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా రైలు మౌలిక సదుపాయాలు గణనీయంగా పెరిగాయని, కొత్త ట్రాక్‌ల నిర్మాణం, కొత్త రైల్వే స్టేషన్ల నిర్మాణం, సామర్థ్యం పెరగడం వల్ల హైదరాబాద్ నుండి జోధ్‌పూర్‌కు ఈ ప్రత్యక్ష రోజువారీ రైలు నడపడానికి వీలు కలిగిందని చెప్పారు. 

ఈ నూతన రోజువారీ రైలు రిజర్వ్, అన్ రిజర్వ్ విభాగాల ప్రజల అవసరాలను తీరుస్తూ హైదరాబాద్, పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న దేశంలోని మధ్య, వాయువ్య రాష్ట్రాల ప్రజలు తమ స్వస్థలాలకు ప్రయాణించడానికి ఎక్కువగా ప్రయోజనం చేకూరుస్తుంది. వ్యాపారవేత్తలు, విద్యార్థులు, ఉద్యోగులు , సెలవుల్లో విరివిగా ప్రయాణించేవారికి, ప్రత్యేక పర్యటనలకు చేసే వారికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది.

వాణిజ్యం, వాణిజ్య మార్గాలను పెంచడంతో పాటు పర్యాటకం, తీర్థయాత్రలను ప్రోత్సహించడంలో కూడా ఈ రైలు సహాయపడుతుంది. రెగ్యులర్ డైలీ రైలు సర్వీసులు కాచిగూడ -భగత్ కీ కోఠి (17605) ఆదివారం నుండి అమలులోకి వస్తుంది. భగత్ కి కోఠి – కాచిగూడ (17606) రైలు ఈ నెల 22 నుండి అమలులోకి వస్తుంది.