నేటి భారత్‌- పాకిస్తాన్‌ మ్యాచ్‌ రద్దు

నేటి భారత్‌- పాకిస్తాన్‌ మ్యాచ్‌ రద్దు

భారత్‌-పాకిస్తాన్‌ మధ్య ఆదివారం జరగాల్సిన వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌ (డబ్ల్యూసీఎల్) మ్యాచ్ రద్దయ్యింది. భారత ఆటగాళ్లు తాము టోర్నీ నుంచి ఆడబోమని ప్రకటించిన నేపథ్యంలో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. తమ నిర్ణయంతో అభిమానులను నిరాశపర్చినందుకు, భారత ఆటగాళ్లకు అసౌకర్యం కలిగించినందుకు నిర్వాహకులు క్షమాపణలు తెలిపారు.

భారత బ్యాట్స్‌మన్‌ శిఖర్‌ ధవన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పాక్‌తో మ్యాచ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మే 11న తాను తీసుకున్న స్టాండ్‌కు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని తెలిపాడు. నా దేశమే తనకు సర్వస్వమని, తన దేశం కంటే ఏదీ గొప్పకాదని పేర్కొన్నాడు. పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత భారత్‌-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిన విషయం తెలిసిందే. శిఖర్‌ ధవన్‌తో సహా సురేశ్‌ రైనా, హర్భజన్‌ సింగ్‌ సహా పలువురు ఆటగాళ్లు టోర్నీ నుంచి తప్పుకున్నారు.

ఈ టోర్నమెంట్‌లో యువరాజ్ సింగ్ నేతృత్వంలోని జట్టుకు ఇదే తొలిమ్యాచ్‌. భారత జట్టులో శిఖర్ ధావన్, సురేష్ రైనా, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు వంటి బ్యాట్స్‌మెన్ ఉన్నారు.  దీనిపై నిర్వాహకులు స్పందిస్తూ భారత్- పాక్ మధ్య ఇటీవల జరిగిన వాలీబాల్ మ్యాచ్కు విశేష స్పందన లభించింది. ఈ క్రమంలో క్రికెట్ అభిమానులకు కూడా అలాంటి అనుభూతిని అందించాలన్న ఉద్దేశంతో ఆదివారం ఆ మ్యాచ్‌ను ఏర్పాటు చేసినట్టు డబ్ల్యూసీఎల్ వెల్లడించింది. అయితే భారత ఆటగాళ్లలో కొందరికి ఇది అసౌకర్యంగా మారింది. 

పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో తమ బాధ్యతను దృష్టిలో పెట్టుకుని వారు ఆ మ్యాచ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించారు. మ్యాచ్ రద్దు అయిన నేపథ్యంలో డబ్ల్యూసీఎల్కు స్పాన్సర్‌గా ఉన్న ఈజ్‌మైట్రిప్ సంస్థ కీలక ప్రకటన విడుదల చేసింది. పాకిస్థాన్ పాల్గొనే మ్యాచ్‌లకు తాము మద్దతు ఇవ్వబోమని, ఆ విషయాన్ని ఇప్పటికే డబ్ల్యూసీఎల్ నిర్వాహకులకు స్పష్టం చేసినట్టు పేర్కొంది. 

రెండు సంవత్సరాల క్రితం డబ్ల్యూసీఎల్ తో ఐదేళ్ల ఒప్పందం చేసినప్పటికీ, పాకిస్థాన్ జట్టుతో సంబంధం ఉన్న ఏ మ్యాచ్‌కి తమ మద్దతు ఉండదని తాము మొదటి నుంచీ స్పష్టం చేసినట్టు తెలిపింది. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అనుమతితో ఈ టోర్నమెంట్ జులై 18 నుంచి ఆగస్టు 2 వరకు బర్మింగ్‌హామ్, నార్తాంప్టన్, లీసెస్టర్, లీడ్స్ నగరాల్లో జరగనుంది. మాజీ స్టార్ క్రికెటర్లు పాల్గొనే ఈ టోర్నీకి లెజెండ్స్ సమ్మర్ కప్గా గుర్తింపు ఉంది.