భారత్ వైదొలిగితే ఆసియా కప్ పై సందిగ్ధం!

భారత్ వైదొలిగితే ఆసియా కప్ పై సందిగ్ధం!
జులై 24న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరగనున్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) వార్షిక సర్వసభ్య సమావేశం వేదిక మార్చనిదే పాల్గొనబోమనే సంకేతం భారత్ ఇవ్వడంతో  ఆసియా కప్ జరగడంపై సందిగ్ధం నెలకొంది. జులై 24న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరగనున్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) వార్షిక సర్వసభ్య వేదికను మార్చాలని బీసీసీఐ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

బంగ్లాలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి పరిస్థితులు, ఆ దేశంతో భారత్ సంబంధాలు అంతత మాత్రంగా ఉన్న నేపథ్యంలో ఏసీసీ సమావేశం వేదికను మార్చాలని కోరుతుంది.  ఒకవేళ ఏసీసీ సమావేశ వేదికను ఢాకా నుంచి మార్చకపోతే ఆ మీటింగ్లో ఆమోదించిన ఏ తీర్మానాన్ని అయినా బహిష్కరిస్తామని భారత క్రికెట్ బోర్డు స్పష్టం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

అక్కడ జరగబోయే ఏసీసీ మీటింగ్ హాజరుకామని ఇదివరకే భారత్ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బంగ్లాదేశ్తో భారత్‌ వన్డే, టీ20 సిరీస్లను బీసీసీఐ 2026 సెప్టెంబర్ నాటికి వాయిదా చేసింది. అంతర్జాతీయ షెడ్యూల్ కఠినంగా ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కానీ బంగ్లాలో రాజకీయ అనిశ్చితి కారణంగా ఆటగాళ్ల భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా, ఆసియా క్రికెట్ కౌన్సిల్కి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్, ఆ దేశ మంత్రి మొహ్సిన్ నఖ్వీ నేతృత్వం వహిస్తున్నారు. ఆ ఏసీసీ సమావేశం విషయంలో భారత్ పై ఒత్తిడి తీసుకురావడానికి మొహ్సిన్ నఖ్వీ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఏసీసీ వేదికను మార్చమని బీసీసీఐ కోరిందని, ఇంకా ఆయన స్పందన రాలేదని సమాచారం.

“ఏసీసీ సమావేశ వేదిక ఢాకా నుంచి మారితేనే ఆసియా కప్ జరుగుతుంది. ఏసీసీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ సమావేశం కోసం భారత్పై అనవసరమైన ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. వేదికను మార్చమని ఇప్పటికే కోరాం. కానీ ఎటువంటి స్పందన రాలేదు. మొహ్సిన్ నఖ్వీ ఢాకాలో సమావేశాన్ని కొనసాగిస్తే అందులో తీసుకున్న ఏ నిర్ణయాన్నైనా బీసీసీఐ బహిష్కరిస్తుంది” అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.

షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ లో ఆసియా కప్ జరగాల్సి ఉంది. ఈ టోర్నీ నిర్వహించే హక్కులు భారత్కు దక్కాయి. ఏసీసీ ఇంకా టోర్నమెంట్ షెడ్యూల్ లేదా వేదికను ప్రకటించలేదు. 2023లో పాక్లో ఆసియా కప్ ఆడేందుకు భారత్ వెళ్లలేదు. అప్పుడు భారత్ ఆడే మ్యాచ్లు తటస్థ వేదికైన శ్రీలంకలో జరిగాయి. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ కూడా తటస్థ వేదికైన దుబాయ్లో జరిగింది.