అబూజ్‌మఢ్‌ అటవీ ప్రాంతంలో ఆరుగురు మావోయిస్టులు మృతి

అబూజ్‌మఢ్‌ అటవీ ప్రాంతంలో ఆరుగురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో నాయయణ్‌పూర్‌ జిల్లాలోని అబూజ్‌మఢ్‌ అటవీ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారని పోలీసులు చెప్పారు. వారి నుంచి పలు ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మావోయిస్టుల సమస్యకు వారిని ఏరిపారేయడమే పరిష్కారంగా భావించిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ‘ఆపరేషన్‌ కగార్‌’ చేపట్టిన సంగతి తెలిసిందే. 
 
ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఒడిశా తదితర రాష్ట్రాల్లో అటవీ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో భద్రతాబలగాలతో జల్లెడ బట్టి మరీ కాల్పులు చేపడుతున్నారు. ఈ ఆపరేషన్‌లో ఇప్పటికే వందలాది మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. తాజా ఘటనపై పోలీసులు తెలిపిన విరాల ప్రకారం అబూజ్‌మఢ్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టు క్యాడర్‌ దాగి ఉన్నదన్న నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రతా దళాలు కూంబింగ్‌ను చేపట్టాయి. 
 
డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌ (డిఆర్‌సి), స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎస్‌టిఎఫ్‌), ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటిబిపి)లు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను నిర్వహించాయి. ఈ క్రమంలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. వారి మృతదేహాలను జిల్లా కేంద్రానికి తీసుకొచ్చారు. చనిపోయిన మావోయిస్టులు ఎవరు, వారిటి వివరాలు ఏమిటి అనేది గుర్తించాల్సి ఉన్నది. 
 
ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతం నుంచి పలు ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని పోలీసు అధికారులు చెప్పారు. ఇందులో ఏకే-47, ఎస్‌ఎల్‌ఆర్‌ రైఫిల్స్‌ వంటివి ఉన్నాయని తెలిపారు. భద్రతా దళాల వ్యూహాత్మక, రక్షణ చర్యల్లో భాగంగా తదుపరి ఆపరేషన్‌ వివరాలను వెల్లడించలేమని బస్తర్‌ రేంజ్‌ పోలీస్‌ ఐజీ సుందర్రాజ్‌ పి చెప్పారు. 
 
ఛత్తీస్‌గఢ్‌తో పాటు మహారాష్ట్రలో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ల కోసం దాదాపు 20 వేల మంది సిబ్బందితో కూడిన భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. గతేడాది దేశంలో మొత్తం 217 మంది మావోయిస్టులు మృతి చెందగా, ఆ సంఖ్య ఈ ఏడాది అర్ధభాగానికి 460కు పెరిగటం గమనార్హం.

ఇదిలా ఉండగా సుక్మా జిల్లాలో రూ.1.18 కోట్ల రివార్డున్న 23 మంది నక్సలైట్లు లొంగిపోయారు. వారిలో 14 మంది పురుషులు, తొమ్మిది మంది మహిళలు ఉన్నారని సుక్మా ఎస్పీ కిరణ్ చౌహాన్ వెల్లడించారు. 23 మంది పేరుమోసిన నక్సలైట్లు లొంగిపోయారని తెలిపారు. మావోయిస్టులందరూ ఆయుధాలు విడిచిపెట్టి జన జీవన స్రవంతిలో చేరాలని కోరారు. అలా లొంగిపోయిన వారికి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని హామీ ఇచ్చారు.