సుప్రీంకోర్టును ఆశ్రయించిన జ‌స్టిస్ య‌శ్వంత్ వ‌ర్మ

సుప్రీంకోర్టును ఆశ్రయించిన జ‌స్టిస్ య‌శ్వంత్ వ‌ర్మ

ఢిల్లీలోని త‌న ఇంట్లో భారీగా నోట్ల క‌ట్ట‌ల‌ను గుర్తించిన కేసులో .. అల‌హాబాద్ హైకోర్టు జ‌స్టిస్ య‌శ్వంత్ వ‌ర్మ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. ఇన్‌హౌజ్ క‌మిటీ ఇచ్చిన నివేదిక‌ను ఆయ‌న స‌వాల్ చేశారు. ఢిల్లీ హైకోర్టు జ‌డ్జిగా ప‌నిచేస్తున్న స‌మ‌యంలో మార్చి 14వ తేదీన అత‌ని ఇంటిలో భారీగా నోట్ల క‌ట్ట‌లు బ‌య‌ట‌ప‌డిన‌ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. 

పంజాబ్‌, హ‌ర్యా హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ శీల్ నాగు, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ జీఎస్ సంధ‌వాలియా, క‌ర్నాట‌క హైకోర్టు జ‌స్టిస్ అను శివ‌రామ‌న్‌తో కూడిన క‌మిటీ ఓ నివేదిక‌ను మే 4వ తేదీన విడుదల చేసింది. జ‌స్టిస్ య‌శ్వంత్ వ‌ర్మ ఇంటి స్టోర్‌రూమ్‌లో క్యాష్ ఉన్న‌ట్లు ఆ క‌మిటీ పేర్కొన్న‌ది. ఆ రిపోర్టు ఆధారంగా వ‌ర్మ‌ను తొల‌గించాల‌ని అప్ప‌టి సీజేఐ సంజీవ్ ఖ‌న్నా మే 8వ తేదీన రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధానిని కోరారు. 

త‌న‌ను తొల‌గించాల‌ని జ‌స్టిస్ ఖ‌న్నా చేసిన ప్ర‌తిపాద‌న రాజ్యాంగ వ్య‌తిరేక‌మ‌ని జ‌స్టిస్ వ‌ర్మ త‌న పిటీష‌న్‌లో తెలిపారు. జ‌డ్జీల‌పై జ‌రిగిన ఇన్‌హౌజ్ ద‌ర్యాప్తు తీరును జ‌స్టిస్ వ‌ర్మ ప్ర‌శ్నించారు. స‌మాంత‌ర రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ను క్రియేట్ చేసి విచార‌ణ సాగించిన‌ట్లు జ‌స్టిస్ వ‌ర్మ ఆరోపించారు. 1968 జ‌డ్జీల ర‌క్ష‌ణ చ‌ట్టం ప్ర‌కారం ఇన్‌హౌజ్ ద‌ర్యాప్తు జ‌ర‌గ‌లేద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

అధికారిక ఫిర్యాదు లేకుండానే విచార‌ణ చేప‌ట్ట‌డం అక్ర‌మ‌మ‌ని ఆయ‌న తెలిపారు. ఎటువంటి ఆధారాలు లేకుండానే త‌నపై ఆరోప‌ణ‌లు చేసిన‌ట్లు చెప్పారు. జ‌స్టిస్ య‌శ్వంత్ వ‌ర్మ ఇంట్లో మార్చి 14వ తేదీ రాత్రి 11.35 నిమిషాల‌కు అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. అప్పుడు ఆయ‌న ఢిల్లీ హైకోర్టు జ‌డ్జీగా ఉన్నారు. ఆయ‌న స్టోర్‌రూమ్‌లో జ‌రిగిన అగ్నిప్ర‌మాదాన్ని ఆర్పేందుకు ఫైరింజ‌న్లు అక్క‌డ‌కు చేరుకున్నాయి. 

5 నిమిషాల్లోనే ఆ మంట‌ల్ని ఆర్పేశారు. అయితే ఆ స్టోర్‌రూమ్ నుంచి గుర్తు తెలియ‌ని న‌గ‌దును రిక‌వ‌రీ చేశారు. మంటల్లో కాలిపోతున్న నోట్ల క‌ట్ట‌ల‌కు చెందిన ఓ వీడియో కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో జ‌స్టిస్ య‌శ్వంత్ వ‌ర్మ అవినీతికి పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి . ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో జ‌స్టిస్ వ‌ర్మ‌ను అలహాబాద్ హైకోర్టుకు బ‌దిలీ చేశారు.

కాగా, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తిని తొలగించే రాజ్యాంగ అధికారం పార్లమెంటుకు ఉన్నప్పటికీ, అటువంటి తీర్మానాన్ని ప్రారంభించే ప్రక్రియ ఎంపిల చేతుల్లో ఉందని కేంద్ర న్యాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ స్పష్టం చేశారు. జస్టిస్‌ యశ్వంత్‌ వర్మపై అభిశంసనకు గురయ్యే అవకాశం ఉందని చర్చ నేపథ్యంలో స్పందిస్తూ అభిశంసన తీర్మానం తీసుకురావడంలో ప్రభుత్వానికి ఎటువంటి పాత్ర లేదని, అలాంటి ఏదైనా చర్యను ఎంపిలు స్వతంత్రంగా నడిపించాలని నొక్కి చెప్పారు.