ఇండియా కూటమి నుంచి వైదొలగిన ఆప్

ఇండియా కూటమి నుంచి వైదొలగిన ఆప్

విపక్ష ఇండియా కూటమికి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దూరమైంది. శనివారం ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో జరగనున్న ఇండియా కూటమి ఎంపీల భేటీకి హాజరు కావద్దని ఆప్ అధిష్టానం నిర్ణయించింది. ఈవిషయాన్ని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కాంగ్రెస్ పెద్దలకు తెలియజేశారు. తమ ఎంపీలను ఆ భేటీకి పంపేది లేదని స్పష్టం చేశారు.  ప్రత్యేకంగా 2024 లోక్‌సభ ఎన్నికల కోసమే ఇండియా కూటమి ఏర్పడిందని విలేకరులకు సంజయ్ సింగ్ చెప్పారు.

ఈ కూటమి వల్లే విపక్ష పార్టీలకు 240 లోక్‌సభ సీట్లు వచ్చాయని, అది గొప్ప విజయమని పేర్కొన్నారు. సోమవారం నుంచి జరగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై చర్చించేందుకు ఇండియా కూటమి ఎంపీలు శనివారం భేటీ కానున్నారు.  ఇండియా కూటమి చివరిసారిగా లోక్‌సభ ఎన్నికల తర్వాత 2024 జూన్ 1న సమావేశమైంది.

ఏడాది తర్వాత మళ్లీ ఇప్పుడు జరగబోతున్న భేటీకి ఆప్ దూరమవడం, కూటమిలో ఏర్పడిన చీలికకు నిదర్శనంగా నిలుస్తోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఆప్‌తో పాటు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీలు కూడా జులై 19న జరగనున్న ఇండియా కూటమి భేటీకి గైర్హాజరు కానున్నారు.  జులై 21న బంగాల్‌లో నిర్వహించనున్న షహీద్ దివస్ ఉత్సవాల ఏర్పాట్లలో బిజీగా ఉన్నందున సమావేశానికి హాజరుకాలేకపోతున్నామని టీఎంసీ ఎంపీలు సమాచారమిచ్చారు.

ఆపరేషన్ సిందూర్‌పై ప్రత్యేక పార్లమెంటు సెషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గతంలో ఇండియా కూటమి పార్టీలు రాసిన ఉమ్మడి లేఖలో ఆప్ భాగం కాలేదు. అయితే ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ వేరుగా ఓ లేఖను ప్రధాని మోదీకి రాశారు.  ఆ ఘటనతో విపక్ష ఇండియా కూటమికి దూరంగా ఉండటానికి ఆప్ ప్రాధాన్యత ఇస్తోందని తేటతెల్లమైంది. ప్రస్తుతం ఆప్ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం పంజాబ్.

ఇటీవలే అక్కడి ఆప్ ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. బీజేపీతో కలిసి తమ ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రులపై కాంగ్రెస్ కేసులు పెట్టించిందని ఆప్ ఆరోపించింది.  ఈ నేపథ్యంలో ఇండియా కూటమి ఎంపీల భేటీకి ఆప్ దూరం కావడం గమనార్హం. 2027 ఫిబ్రవరిలో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల వరకు ఆప్ ఇదే విధంగా ఒంటరిగా ముందుకు సాగొచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆప్, కాంగ్రెస్ వేర్వేరుగా పోటీ చేసిన సంగతి తెలిసిందే.

2022 సంవత్సరం ద్వితీయార్ధం నుంచి విపక్ష ఇండియా కూటమి ఏర్పాటు కోసం క్షేత్ర స్థాయిలో కసరత్తు చేసిన ముఖ్య నేతల జాబితాలో బిహార్ సీఎం నితీశ్ కుమార్ (జేడీయూ అధినేత) కూడా ఉన్నారు. ఈక్రమంలో అప్పట్లో ఆయన ఆప్ అధినేత, నాటి డిల్లీ సీఎం కేజ్రీవాల్‌తోనూ భేటీ జరిపి విపక్ష కూటమిలో చేరాలని కోరారు. ఈ ప్రయత్నాల ఫలితంగా 2023 జూన్‌ 23న 26 రాజకీయ పార్టీలు కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేశాయి. 

లోక్‌సభ ఎన్నికలకు సరిగ్గా మూడు నెలల ముందు, 2024 జనవరి 28న ఎన్‌డీఏ కూటమిలోకి నితీశ్ మారారు. దీంతో ఇండియా కూటమి సారథ్య బాధ్యతలను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేపట్టారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మరిన్ని పార్టీలు విపక్ష కూటమిని వీడాయి. ఇప్పుడు ఆమ్ ఆద్మీపార్టీ కూడా ఇండియా కూటమికి దూరమైంది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రాజకీయంగా ఒంటరిగా ముందుకు సాగడానికే ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం.