రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన అమెరికా

రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన అమెరికా

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులను ఊచకోత కోసిన ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్ (టిఆర్ఎఫ్)ను అగ్రరాజ్యం అమెరికా ఉగ్ర సంస్థగా ప్రకటించింది. పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబాకు అది ముసుగు సంస్థ అని పేర్కొన్నది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. ఏప్రిల్‌ 22న పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే.

హిందువులను లక్ష్యంగా చేసుకుని చేసిన ఈ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దాడికి పాల్పడింది తామేనంటూ టీఆర్‌ఎఫ్‌ ప్రకటించుకున్నది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎఫ్‌ను అమెరికా విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ది రెసిస్టెంట్‌ ఫ్రంట్‌ను విదేశీ ఉగ్రవాద సంస్థ (ఎఫ్ టి ఓ)గా, ప్రత్యేకంగా నియమితమైన గ్లోబల్‌ టెర్రరిస్ట్‌ (ఎస్ డి జి టి) ఆర్గనైజేషన్‌గా అమెరికా గుర్తిస్తున్నట్లు మార్కో రూబియో ప్రకటించారు. 

2008 ముంబై ఉగ్రదాడి తర్వాత భారత్‌లో చోటుచేసుకున్న దాడుల్లో పహల్గాం ఘటనే అతిపెద్దదని చెప్పారు. భారత భద్రత దళాలపై గతంలో జరిగిన పలు దాడులకు టీఆర్‌ఎఫ్‌ బాధ్యత వహించిందని తెలిపారు. ఇటీవలి సంవత్సరాలలో భారత భద్రతా దళాలపై టిఆర్ఎఫ్ అనేక దాడులు నిర్వహించిందని పేర్కొన్నారు. విస్తృత ఉగ్రవాద నిరోధక ప్రయత్నాలను ప్రస్తావిస్తూ, తీవ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా అమెరికా, మిత్రదేశాల ప్రయోజనాలను కాపాడటానికి ట్రంప్ పరిపాలన కట్టుబడి ఉందని ఆ ప్రకటన పేర్కొంది. “ఈ చర్యలు పహల్గామ్ దాడి బాధితులకు న్యాయం చేయాలనే ట్రంప్ పరిపాలన నిబద్ధతను ప్రతిబింబిస్తాయి. ప్రపంచ భద్రత పట్ల మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాయి” అని తెలిపారు. 

ఎక్స్ లో చేసిన ఒక పోస్ట్‌లో, అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా న్యూఢిల్లీ దృఢమైన వైఖరిని స్పష్టం చేసింది. “భారతదేశం-యుఎస్ఎ ఉగ్రవాద వ్యతిరేక సహకారానికి ఇది మరొక నిదర్శనం. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టిఆర్ఎఫ్)ను నియమించబడిన విదేశీ ఉగ్రవాద సంస్థగా, ప్రత్యేకంగా నియమించిన గ్లోబల్ టెర్రరిస్ట్‌గా జాబితా చేసినందుకు విదేశాంగ శాఖను అభినందిస్తున్నాము. టిఆర్ఎఫ్ లష్కరే తోయిబాకు ప్రతినిధి.  ఏప్రిల్ 22న పహల్గామ్‌లో పౌరులపై జరిగిన ఉగ్రవాద దాడికి బాధ్యత వహించింది” అని తెలిపింది.

టీఆర్‌ఎఫ్‌ 2019లో లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థగా ఏర్పడింది. ఇది లష్కరేకు ఉన్న మరో పేరుతప్ప మరేమీకాదు. ‌పుల్వామా దాడి, జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 ఆర్టికల్‌ రద్దు తర్వాత ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ (టిఏటిఎఫ్) పరిశీలన నుంచి తప్పించుకునేందుకు పాక్‌ ఆర్మీ, ఐఎస్‌ఐ వ్యూహకర్తలు టీఆర్‌ఎఫ్‌ అనే పేరుతో లష్కరే కోర్‌ గ్రూప్‌ను తెరపైకి తెచ్చారు. 

గత మూడునాలుగేండ్లుగా జమ్ముకశ్మీర్‌లో వలస కార్మికులు, కశ్మీరీ పండిట్లతోపాటు సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నది.  2021 జూన్‌లో జమ్ములోని ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ (ఐఏఎఫ్) స్టేషన్‌పై డ్రోన్‌ దాడులు చేసింది. ఈ నేపథ్యంలో చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యుఏపిఏ) కింద 2023 జనవరిలో టీఆర్‌ఎఫ్‌పై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. 2022లో దీని కమాండర్‌ సజ్జాద్‌ గుల్‌ను ఉగ్రవాదిగా ప్రకటించింది.