ఉక్రెయిన్‌ నూతన ప్రధానిగా యూలియా స్వైరైదెకో

ఉక్రెయిన్‌ నూతన ప్రధానిగా యూలియా స్వైరైదెకో

ఉక్రెయిన్‌ నూతన ప్రధాన మంత్రిగా యూలియా స్వైరైదెకో నియమితులయ్యారు. అంతకు ముందు ప్రధానిగా ఉన్న డెనిస్‌ ష్మిహాల్‌ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. మార్చి 4, 2020న ప్రధాని బాధ్యతలు స్వీకరించిన డెనిస్‌ దాదాపు ఐదేళ్లకు పైగానే ఆ పదవిలో కొనసాగారు. అయితే, అధ్యక్షుడు జెలెన్‌ స్కీ ప్రభుత్వంలో గణనీయమైన భారీ పునర్వ్యవస్థీకరణ చేపడుతున్నారు.

ఇందులో భాగంగానే డెనిస్‌ ప్రధాని పదవికి రాజీనామా చేసినట్లు తెలిసింది. ఆయన తన రాజీనామా లేఖను అధ్యక్షుడికి పంపారు. ఆయన రాజీనామాతో ప్రస్తుతం ఉక్రెయిన్‌ ఉప ప్రధానిగా, మహిళా ఆర్థికమంత్రిగా ఉన్న యూలియా స్వైరైదెకోను ప్రధానిగా జెలెన్‌స్కీ ప్రతిపాదించారు. ఇప్పుడు ఆమెను అధికారికంగా ప్రకటించారు. యూలియా జెలెన్‌స్కీకి సన్నిహితురాలు. సుదీర్ఘకాలం నుంచి మంచి మిత్రురాలు కూడా. 

అమెరికా-ఉక్రెయిన్‌ ఖనిజ ఒప్పందంలో యులియా కీలకపాత్ర పోషించారు. రక్షణ సహకారం, ఆర్థిక పునరుద్ధరణ, పునర్మిర్మాణం వంటి అంశాలపై పశ్చిమ దేశాల భాగస్వాములతో ఉన్నత స్థాయి చర్చలు జరిపేటపుడు తరచుగా యులియానే పాల్గొంటారు. అయితే మొత్తంగా ప్రభుత్వ పునర్వ్యస్థీకరణ ఎప్పుడు జరుగుతుందనేది స్పష్టంగా తెలియరాలేదు. ఎందుకంటే జెలెన్‌స్కీ తీసుకునే చర్యలకు ఉక్రెయిన్‌ పార్లమెంట్‌ ఆమోద ముద్ర వేయాల్సి వుంటుంది.

అయితే అమెరికాతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలంటే తాము కొన్ని చర్యలు తీసుకోవడం కీలకమని భావిస్తున్నట్లు జెలెన్‌స్కీ గత వారంలో చెప్పారు. ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు సరఫరా చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇప్పటికే హామీ ఇచ్చి వున్నారు. . అలాగే అమెరికాలో ఉక్రెయిన్‌ రాయబారిని కూడా మార్చాలని జెలెన్‌స్కీ యోచిస్తున్నారు.