
మరోవంక, ఎయిరిండియా విమాన ప్రమాదంపై ఏఏఐబీ ఇచ్చిన ప్రాథమిక నివేదికపై ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్(ఎఫ్‌ఐపీ) ఆందోళన వ్యక్తం చేసింది. దర్యాప్తు పూర్తి కాకుండానే పైలట్లపై నిందలు వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కూలిపోయిన విమానంలోని కాక్‌పిట్ వాయిస్ రికార్డింగ్‌లను పేర్కొంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ వార్తా కథనాన్ని ప్రచురించిన సమయంలోనే ఎఫ్‌ఐసీ నుంచి నిరసన వ్యక్తం కావడం గమనార్హం. పైగా, ఆ పత్రికపై చట్టపర చర్యకు పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది.
ఎఫ్‌ఐపీ అధ్యక్షుడు సిఎస్ రాంధావా వాల్ స్ట్రీట్ జర్నల్ కధనాన్ని తప్పుబడుతూ ప్రమాదంపై ప్రాథమిక దర్యాప్తు నివేదికలో పైలట్లలో ఒకరు ఇంజిన్లకు ఇంధనాన్ని తగ్గించారని చెప్పనప్పటికీ, ప్రచురణ పైలట్ చర్యను సూచిస్తోందని అభ్యంతరం వ్యక్తం చేశారు. “ప్రాథమిక నివేదికలో పైలట్ లోపం లేదా చర్య గురించి ప్రస్తావించనప్పటికీ, పైలట్లను లక్ష్యంగా చేసుకోవడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. వారు పైలట్లను అపఖ్యాతి కావిస్తున్నారు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
“మేము చట్టపరమైన చర్య గురించి ఆలోచిస్తున్నాము. మా న్యాయవాదులను సంప్రదిస్తాము” అని తెలిపారు. ఎఫ్‌ఐపీలో దాదాపు 5,500 మంది పైలట్లు సభ్యులుగా ఉన్నారు. కాగా, దర్యాప్తు ప్రక్రియలో పైలట్ల ప్రాతినిధ్యం లేకపోవడం పట్ల పైలట్ల సమాఖ్య అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఎఫ్‌ఐపీతో పాటు, ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ (ఐసిపిఎ), ఎయిర్‌లైన్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఎల్ పిఎ- ఐ) కూడా దర్యాప్తు ప్రారంభ దశలో ఎటువంటి ఆధారాలు లేకుండా మరణించిన విమానం పైలట్లపై నిందలు వేస్తున్నారని అంటూ ఆందోళన వ్యక్తం చేశాయి.
ఎయిర్ఇండియా విమాన ప్రమాదంపై విదేశీ మీడియా కథనాన్ని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఖండించింది. వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనాన్ని బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యానమని పేర్కొంది. పూర్తి స్థాయి దర్యాప్తు నివేదిక వచ్చే వరకు వేచి ఉండాలని సూచించింది. కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు ఎంపిక చేసుకున్న, ధ్రువీకరించని నివేదికల ఆధారంగా ఆరోపణలు చేస్తున్నాయని ఏఏఐబి ఆగ్రహం వ్యక్తం చేసింది.
అలాంటి చర్యలు బాధ్యతారాహిత్యమని, దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నట్లు తెలిపింది. బాధిత కుటుంబాలకు జరిగిన నష్టాన్ని గౌరవించటం తప్పనిసరని పేర్కొంది. టేకాఫ్ తర్వాత విమానం ఇంజన్ ఫ్యూయల్ స్విచ్‌లు ఒక సెకన్ వ్యవధిలోనే ఆఫ్ అయ్యాయని, విమానం కూలటానికి ముందు కాక్‌పిట్‌లో గందరగోళం ఏర్పడినట్లు తన ప్రాథమిక నివేదికలో తెలిపింది.
తుది నివేదిక వచ్చాకే అసలు నిజం
మరోవైపు అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో తుది నివేదిక వచ్చిన తర్వాతే అసలు నిజం బయటపడుతుందని కేంద్ర పౌరవిమానయాన సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ స్పష్టం చేశారు. విమాన ప్రమాదం జరిగిన 24 గంటల్లోపు బ్లాక్ బాక్స్ కనుగొన్నామని, ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తులో కొన్ని విషయాలు తేలాయని గుర్తు చేశారు. బ్లాక్ బాక్స్‌ను విశ్లేషించి ఒక నెలలోనే ప్రాథమిక ఫలితాలను సమర్పించారని తెలిపారు. ఇంధన సరఫరా ఆగిపోయినట్లుగా పైలట్, కో-పైలట్ మాట్లాడుకున్నారని, కానీ తుది ఫలితాలు వెలువడే వరకు ఎలాంటి ప్రకటన చేయడం సముచితం కాదని హితవు చెప్పారు.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్‌గా అర్షదీప్
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు