
దేశవ్యాప్తంగా ప్రతి భాషలో ప్రతి ఒక్కరికీ సమగ్ర సమాచారాన్నిఅందించడానికి భాషాపరమైన అంతరాలను తగ్గించే ఏఐ-ఆధారిత పరిష్కారాలను అమలు చేసే దిశగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా ఏఐ/ఎమ్ఎల్-ఆధారిత సాంకేతిక పరిష్కారాల కోసం కృషిచేస్తున్న ఇంక్యుబేటర్లు, అంకుర సంస్థలతో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు హైదరాబాద్‌లోని టి-హబ్ లో ఒక సమావేశాన్ని నిర్వహించారు.
ఇందులో టి-హబ్ సీఈఓతో పాటు, టి-హబ్‌లో వివిధ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్న అంకుర సంస్థలు, ఐఐటీ హైదరాబాద్, ఎన్‌ఐటీల ఎక్సలెన్స్ సెంటర్ల ప్రతినిధులు, ఇంజినీరింగ్ విద్యాసంస్థలలో క్రియాశీల ఆవిష్కరణ విభాగాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జాజు మాట్లాడుతూదేశంలోని క్రియేటివ్ ఎకానమీని ప్రోత్సహించాలనే గౌరవ ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వేవెక్స్ స్టార్టప్ యాక్సిలరేటర్ వేదికను ఏర్పాటు చేసిందని తెలిపారు. భవిష్యత్తుకు సన్నద్ధంగా ఉండే అత్యాధునిక డిజిటల్ వ్యవస్థ నిర్మాణంలో కీలకమైన ‘కళా సేతు’, ‘భాషా సేతు’ పోటీలను ఈ వేదిక ద్వారా ప్రారంభించామని తెలిపారు.
ఈ పోటీల్లో పాల్గొని.. దేశంలోని భాషాపరమైన, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించే పరిష్కారాలను దేశీయంగాను, పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగాను అభివృద్ధి చేయాలని ప్రముఖ ఏఐ అంకుర సంస్థలను జాజు ఆహ్వానించారు. https://wavex.wavesbazaar.com లోని వేవెక్స్ పోర్టల్ ద్వారా ‘కళా సేతు’, ‘భాషా సేతు’ పోటీల కోసం అంకురసంస్థలు నమోదు చేసుకుని, దరఖాస్తు చేసుకోవచ్చు. పోటీలకు సంబంధించిన సాంకేతిక, ఇతర వివరాలు వేవెక్స్ పోర్టల్‌లో అందుబాటులో ఉన్నాయి.
ఎంపికైన బృందాలు తమ పరిష్కారాలను న్యూఢిల్లీలో జాతీయ స్థాయి జ్యూరీ ఎదుట ప్రదర్శించాల్సి ఉంటుంది. పోటీల్లో విజేతగా నిలిచిన అంకుర సంస్థ తమ పరిష్కారాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి అనువుగా ఎంఓయూ అందజేస్తారు. అలాగే ప్రయోగాత్మక దశలో ఏఐఆర్, డీడీ, పీఐబీల సహకారంతో పాటు వేవ్ఎక్స్ ఇన్నోవేషన్ ప్లాట్‌ఫామ్ కింద ఇంక్యుబేషన్ అవకాశాలు లభిస్తాయి.
వేవ్స్ కార్యక్రమంలో భాగంగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వేవెక్స్ పేరుతో స్టార్టప్ యాక్సిలరేటర్ విభాగాన్ని ప్రారంభించింది. ఇది మీడియా, వినోదం, భాషా సాంకేతికత రంగాల్లో ఆవిష్కరణలను పెంపొందించే లక్ష్యంతో పనిచేస్తుంది.
గత మే నెలలో ముంబయిలో నిర్వహించిన వేవ్స్ సదస్సులో భాగంగా ప్రభుత్వ సంస్థలు, పెట్టుబడిదారులు, పరిశ్రమ ప్రముఖులతో ప్రత్యక్షంగా సంభాషించేందుకు వీలు కల్పించడం ద్వారా 30కి పైగా సమర్థ అంకుర సంస్థలకు నిధులు పొందే అవకాశాలను వేవెక్స్ కల్పించింది. హ్యాకథాన్‌లు, ఇంక్యుబేషన్, మెంటార్‌షిప్, జాతీయ స్థాయి వేదికలతో కలిసిపనిచేయడం వంటి కార్యకలాపాల ద్వారా వేవెక్స్ విప్లవాత్మక ఆవిష్కరణలకు సహకారం అందిస్తోంది.
More Stories
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల ఎంపిక ప్రారంభం
తెలంగాణ బతుకమ్మకు రెండు గిన్నిస్ రికార్డులు