నిమిష గురించి మిత్ర దేశాలతో మాట్లాడుతున్నాం

నిమిష గురించి మిత్ర దేశాలతో మాట్లాడుతున్నాం

కేర‌ళ న‌ర్సు నిమిష ప్రియ‌కు చెందిన కేసు చాలా సున్నిత‌మైన అంశం అని, మ‌ర‌ణ‌శిక్ష‌ను త‌ప్పించేందుకు ప్ర‌భుత్వం వీలైనంత సాయం చేస్తోంద‌ని కేంద్ర విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. యెమెన్ దేశ‌స్థుడిని హ‌త్య చేసిన కేసులో ఆ దేశం ఆమెకు మ‌ర‌ణ‌శిక్ష విధించిన విష‌యం తెలిసిందే. వాస్త‌వానికి ఈనెల 16వ తేదీన నిమిష ప్రియ‌ను ఉరితీయాల్సి ఉంది. కానీ ఆ నిర్ణ‌యాన్ని యెమెన్ దేశం వాయిదా వేసింది.

తాము నిరంతరం జరుపుతున్న దౌత్యం వల్లే ఇది సాధ్యమైందని ఎంఈఏ తెలిపింది. నిమిష ప్రియ కుటుంబానికి, యెమన్‌కు చెందిన బాధిత కుటుంబానికి మధ్య పరస్పర అంగీకార యోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనేందుకు జరుపుతున్న చర్చల వల్లే మరణశిక్షను వాయిదా వేశారని పేర్కొంది. 

ఇది సున్నితమైన అంశమని, నిమిష ప్రియ కుటుంబానికి భారత ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉందని, చేయూతను అందిస్తోందని విదేశాంగ శాఖ వెల్లడించింది.  న్యాయవాది ద్వారా న్యాయ సహాయాన్ని అందించడంతో పాటు అక్కడి అధికార యంత్రాంగంతో, నిమిష ప్రియ కుటుంబీకులతో భారత రాయబార కార్యాలయ సిబ్బంది నిత్యం టచ్‌లో ఉంటున్నట్లు తెలిపింది. 

ఈ అంశంపై యెమన్‌కు సన్నిహితంగా ఉండే కొన్ని మిత్రదేశాలతోనూ సమన్వయం చేసుకుంటున్నట్లు భారత విదేశాంగ శాఖ పేర్కొంది.  నిమిష కుటుంబానికి అన్ని ర‌కాల సాయాన్ని అందించేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉన్న‌ట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు స్థాకి అధికారుల‌తో నిత్యం ట‌చ్‌లో ఉన్న‌ట్లు విదేశాంగ శాఖ పేర్కొన్నది.  

తలాల్‌ అబ్దో మెహదీని 2017లో హత్యచేసిన భారతీయ నర్సు నిమిష ప్రియకు క్షమాభిక్ష ప్రసాదించాలని లేదా నష్టపరిహారం తీసుకోవాలని(బ్లడ్‌ మనీ) వస్తున్న ప్రతిపాదనలను తమ కుటుంబం అంగీకరించే ప్రసక్తి లేదని బాధిత సోద‌రుడు అబ్దెల్‌ ఫత్తా మెహదీ స్పష్టం చేశారు. షరియా చట్టం ప్రకారం ప్రతీకార న్యాయం(కిసాస్‌) కావాలన్న తమ డిమాండును ఆయన మ‌రోసారి పునరుద్ఘాటించారు. చేసిన నేరానికి నిమిషను ఉరితీయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.