
ఢిల్లీతో పాటు బెంగళూరులోని 90కి పైగా ప్రైవేటు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం దేశవ్యాప్తంగా కలకలం రేగింది. బెదిరింపు వచ్చిన పాఠశాలల జాబితాలో బెంగళూరులోని మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీకి చెందిన స్కూల్ కూడా ఉండటం గమనార్హం. పాఠశాలల్లో భారీగా పేలుడు పదార్థాలను అమర్చామనీ, బాధపడేందుకు మీరంతా సిద్ధంగా ఉండాలని దుండగులు ఈమెయిళ్లు పంపారు.
విద్యార్థులను ఏం చేయబోతున్నామో చెబుతామంటూ హింసాత్మక రీతిలో హెచ్చరించారు. అప్రమత్తమైన పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్, డాగ్‌స్క్వాడ్, ఫైర్ సిబ్బంది పెద్దఎత్తున రంగంలోకి దిగి స్కూళ్లను ఖాళీ చేయించారు. అయితే తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు దొరకలేదని ఇరు రాష్ట్రాల్లోని అధికారులు తెలిపారు.
డిల్లీ పాఠశాలలకు బాంబ్ బెదిరింపు మెయిల్స్ రావడం ఇది వరసగా నాలుగోరోజు. గత నాలుగు రోజుల్లో కలిపి మొత్తం 40కి పైగా పాఠశాలకు ఈ హెచ్చరికలు రావడంతో టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. ఎన్‌క్రిప్టెడ్ నెట్‌వర్క్స్, విపిఎన్ ల ద్వారా దుండగులు ఈ హెచ్చరికలు పంపుతున్నారని, డార్క్‌నెట్ వాడకం వల్ల వాటిని ట్రాక్ చేయడం కష్టంగా మారినట్లు పోలీసులు చెబుతున్నారు.
ముంబైలోని వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్ కు కూడా ఇటువంటి బెదిరింపు మెయిల్ వచ్చింది. కాగా రోజూ బాంబు బెదిరింపులు రావడం వల్ల గురువారం ఢిల్లీలో అధికారులు పెద్ద ఎత్తున మాక్ డ్రిల్స్ నిర్వహించారు. బెంగళూరులోని 50పైగా పాఠశాలలకు శుక్రవారం ఉదయం బాంబు బెదిరింపులు రావడం రాష్ట్రవ్యాప్తంగా సంచనలంగా మారింది. ఎంఎస్ ధోని గ్లోబల్ స్కూల్‌తో సహా ఆర్.ఆర్.నగర్, కెంగేరీ ప్రాంతాల్లోని వివిధ పాఠశాలలకు మెయిల్స్ ద్వారా బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
దీంతో పాఠశాల సిబ్బంది అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు స్కూళ్లకు చేరుకొని విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. దీనిపై సెయింట్ జర్మనీ అకాడమీ స్కూల్ ప్రిన్సిపాల్ మోనికా ఆంటోని ఈ సంఘటనపై స్పదించారు. “ఈ రోజు ఉదయం 07: 45 గంటలకు మాకు మెయిల్ వచ్చింది. అందులో తరగతి గదిలో పేలుడు పదార్థాలు ఉన్న నల్లటి సంచులను ఉంచాం. నాకు జీవితం మీద విరక్తి చెందింది. నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఈ కాపీని మీడియాకు ఇవ్వండి అని ‘రోడ్‌కిల్’ పేరుతో మెయిల్లో పేర్కొన్నారు” అని ప్రిన్సిపాల్ తెలిపారు.
గత వారం రోజుల్లో సెయింట్ థామస్, వసంత్ వ్యాలీ, మదర్స్ ఇంటర్నేషనల్‌తో సహా దిల్లీలోని దాదాపు 28 పాఠశాలలు ఈమెయిల్స్ వచ్చాయని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. డిసెంబర్ 2023లో బెంగళూరు చుట్టుపక్కల ఉన్న దాదాపు 70 పాఠశాలలకు నకిలీ బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో పాఠశాల సిబ్బంది, పోలీసు అధికారులు అయోమయంలో పడ్డారు.
కొన్ని నివేదికల ప్రకారం గత మూడు సంవత్సరాల్లో కర్ణాటకలో 169 నకిలీ బాంబు బెదిరింపు కేసులు నమోదయ్యాయి. వాటిలో 133 బెంగళూరు నగరంలో హోటళ్ళు, రెస్టారెంట్లు, పాఠశాలలు, కళాశాలలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. కర్ణాటక హోం శాఖ గణాంకాల ప్రకారం, గత మూడు సంవత్సరాలలో ఇటువంటి సంఘటనలకు సంబంధించి బెంగళూరులో 10మంది వ్యక్తులను అధికారులు అరెస్టు చేశారు.
ఈ కేసులను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. నేరం రుజువైతే భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్)లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారు. ఇలాంటి వాటికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. ఓక వేళ నిందితులు మైనర్ అయితే పోలీసు కౌన్సిలింగ్ ఇస్తారు. నేర తీవ్రత ఎక్కువగా ఉంటే జువెనైల్ జస్టిస్ చట్టం కింద చర్యలు తీసుకుంటారు.
More Stories
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము
యాసిన్ మాలిక్ ను `శాంతిదూత’గా అభివర్ణించిన మన్మోహన్!
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి