ఆశ్చర్యకరమైన రాజకీయ పరిణామంలో, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ బుధవారం శివసేన (యుబిటి) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు అధికార ఎన్డీయే కూటమితో చేతులు కలపడాన్ని పరిశీలించమని ఆహ్వానించారు. శాసన మండలిలో ప్రసంగిస్తూ, ఫడ్నవీస్ సరదాగానే సూటిగా వ్యాఖ్య చేస్తూ, “ఉద్ధవ్ జీ, మేము 2029 వరకు ప్రతిపక్షంలో కూర్చోవడానికి అవకాశం లేదు. కానీ మీరు ఇక్కడకు (పాలక పక్షానికి) రావాలనుకుంటే, దానిని పరిగణించవచ్చు. అయినప్పటికీ అలాంటి నిర్ణయం ప్రత్యేకమైన రీతిలో తీసుకోవలసి ఉంటుంద” అంటూ బహిరంగంగా స్వాగతం పలికారు.
ఉద్ధవ్ శివసేన వర్గానికి చెందిన శాసన మండలిలో పదవీ విరమణ చేసిన ప్రతిపక్ష నాయకుడు అంబదాస్ దన్వే గురించి మాట్లాడుతూ ఫడ్నవీస్ ఈ ప్రకటన చేశారు. “అంబదాస్ దన్వే ఎక్కడ ఉన్నా – అధికార పార్టీలో ఉన్నా లేదా ప్రతిపక్షంలో ఉన్నా – ఆయన నిజమైన విశ్వాసాలు హిందుత్వలో పాతుకుపోయాయి” అని ముఖ్యమంత్రి ధన్వే ప్రధాన సిద్ధాంతాన్ని ప్రశంసించారు.
ఇటీవల ఉద్ధవ్ ఠాక్రేతో జరిగిన సమావేశం తర్వాత ఫడ్నవీస్ అసెంబ్లీలో ప్రత్యక్ష ప్రతిపాదన చేయడం మహారాష్ట్ర రాజకీయ రంగంలో ఒక ముఖ్యమైన రాజకీయ ప్రకటనగా భావిస్తున్నారు. కీలకమైన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బిఎంసి) ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఈ ప్రకటన వెలువడటం ప్రాధాన్యత సంతరింప చేసుకుంది. ప్రస్తుతం, బీఎంసీ ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన (యుబిటి) నియంత్రణలో ఉంది. అయితే గత ఎన్నికలలో, బిజెపి, శివసేన దాదాపు సమాన సీట్లను కలిగి ఉన్నాయి. కాగా, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అసెంబ్లీలో చేసిన ఈ వ్యాఖ్యలు భారీ ఊహాగానాలకు తెరతీశాయి. పాత మిత్రులైన బీజేపీ, ఉద్ధవ్ ఠాక్రే తిరిగి కలుస్తారా? అన్న చర్చకు దారి తీసింది. సీఎం ఫడ్నవీస్ బహిరంగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి. దీంతో ఆ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. అయితే దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యలను తాను జోక్‌గా భావిస్తున్నట్లు ఉద్ధవ్ ఠాక్రే ఆ తర్వాత కొట్టిపారవేసారు.
ఇలా ఉండగా, మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు బీజేపీ చెక్ పెట్టే ప్రయత్నంగా అనుమానిస్తున్నారు. షిండే వర్గం శివసేన ఎమ్మెల్యేలు, మంత్రుల ప్రవర్తన రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. తన వర్గం ఎమ్మెల్యేలపై షిండేకు నియంత్రణ లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే మరాఠీ భాషా వివాదం నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే తిరిగి కలుసుకోవడం కూడా బీజేపీని కలవరపరుస్తున్నది. దీంతో ఉద్ధవ్ ఠాక్రేతో తిరిగి జతకట్టాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మరోవంక, ఉద్ధవ్ ఠాక్రే ఇటీవల తన విడిపోయిన బంధువు, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ ఠాక్రేతో చేతులు కలిపి, మహారాష్ట్ర పాఠశాలల్లో హిందీని తప్పనిసరి భాషగా చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ చర్యను సంయుక్తంగా వ్యతిరేకించారు. ఇద్దరి మధ్య దాదాపు రెండు దశాబ్దాల రాజకీయ వైరం తర్వాత ఐక్యత ప్రదర్శించారు. అయితే, బహిరంగంగా కలిసినట్లు కనిపించినప్పటికీ, వారి మధ్య సైద్ధాంతిక విభేదాలు కొనసాగుతున్నాయి.
ఉత్తర భారత సమాజాలపై ఎంఎన్ఎస్ దూకుడు వైఖరితో శివసేన అసౌకర్యంగా ఉంది. రెండు పార్టీల మధ్య శాశ్వత రాజకీయ కూటమిపై సందేహాలు వ్యక్తం చేస్తోంది. రాజ్ థాకరే పొత్తు చర్చను ఖండించారు. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే బుధవారం ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యుబిటి)తో పొత్తు పెట్టుకోవడంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు.
తాను మాట్లాడని పదాలు మీడియాలోని ఒక వర్గంలో తనకు తప్పుగా ఆపాదించినట్లు ఆరోపించారు. ఎక్స్ ఒక పోస్ట్‌లో, థాకరే సహితం ఏదైనా రాజకీయ ప్రకటన చేయాలనుకుంటే, విలేకరుల సమావేశం నిర్వహించడం ద్వారా చేస్తానని చెప్పారు.
More Stories
కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట .. 10 మంది మృతి
400 కిలోల బంగారంతో సహా రూ 400 కోట్ల మావోయిస్టుల నిధులు!
అజారుద్దీన్‌కు మంత్రిపదవితో కాంగ్రెస్ లో అసమ్మతి కుంపటి!