2028 నాటికి 7 శాతం దాటనున్నఈవీ కార్ల వాటా

2028 నాటికి 7 శాతం దాటనున్నఈవీ కార్ల వాటా

భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) మార్కెట్‌ వేగంగా విస్తరిస్తున్నది. సరఫరా గొలుసులోని, రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌కు సంబంధించిన సమస్యలు సకాలంలో పరిష్కరించగలిగితే 2028 ఆర్థిక సంవత్సరానికి భారత్‌లో ఎలక్ట్రిక్‌ కార్ల వాటా 7శాతాన్ని దాటుతుందని ఓ నివేదిక పేర్కొంది. అమెరికన్ ఈవీ కంపెనీ టెస్లా భారత్లోకి ప్రవేశించినట్లు అధికారికంగా ప్రకటించిన కేర్ ఏజ్ అడ్వైజరీ ఈ నివేదికను విడుదల చేసింది. 

గత కొద్దిరోజులుగా భారత్‌లోని ఎలక్ట్రికల్‌ కార్ల అమ్మకాల్లో విపరీతంగా పెరుగుతున్నది. నివేదిక ప్రకారం 2021 ఆర్థిక సంవత్సరంలో 5వేల యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ సంఖ్య 2025 ఆర్థిక సంవత్సరం నాటికి 1.07లక్షలు దాటింది.ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలకే ఇప్పటికీ ఈవీ మార్కెట్‌లో పెద్ద వాటా ఉన్నది.

రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌ సమస్యలు పరిష్కరించగలిగితే భారత్‌లో ఈవీ అమ్మకాలు 2028 ఆర్థిక సంవత్సరానికి 7శాతం దాటే అవకాశం ఉంటుందని కేర్‌ఏజ్ సీనియర్ డైరెక్టర్ తన్వి షా పేర్కొన్నారు. కొత్త మోడల్స్‌, చార్జింగ్‌ మౌలిక సదుపాయాల పెరుగుదల, ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌ (పీఎల్ఐ) పథకం కింద బ్యాటరీ స్థానికీకరణ కారణంగా భారత్‌లో ఈవీ రంగానికి గొప్ప అవకాశం ఉందని ఆమె తెలిపారు. 

ఫేమ్‌-3, అధునాతన బ్యాటరీల కోసం పీఎల్‌ఐ పథకం, బ్యాటరీ ముఖ్యమైన ఖనిజాలపై కస్టమ్ సుంకం మినహాయింపు వంటి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా సరఫరాలో గొలుసు బలోపేతమయ్యేందుకు, ఖర్చులు తగ్గించేందు సహాయపడనున్నాయి. ఈవీలు ఎదుర్కొంటున్న పెద్ద సవాల్‌ పబ్లిక్‌ చార్జింగ్‌ మౌలిక సదుపాయాలు లేకపోవడం. ప్రస్తుతం చార్జింగ్‌ మౌలిక సదుపాయాలు పెరుగుతున్నాయి. 

2022 నాటికి భారత్‌లో 5,151 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఉండగా, 2025 ప్రారంభానికి ఈ సంఖ్య 26వేలు దాటింది. ఈ వృద్ధి రేటు ఏటా 72 శాతానికి పైగా ఉంది. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్ వంటి రాష్ట్రాలు ప్రోత్సాహకాలు (భూమి, సబ్సిడీ) ఇస్తున్నాయి. అలాగే, మున్సిపల్ కార్పొరేషన్లు ఇప్పుడు నివాస, వాణిజ్య ప్రాజెక్టుల్లోననూ ఈవీ పార్కింగ్స్‌ను తప్పనిసరి చేస్తున్నాయి. 

ప్రైవేట్ ఛార్జ్ పాయింట్ ఆపరేటర్లు సైతం తమ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్‌లో ఈవీ బ్యాటరీలకు అవసరమైన 16 ఖనిజాలపై ప్రైమరీ కస్టమ్ సుంకాన్ని తొలగించింది. దాంతో ఖర్చులు మరింత తగ్గనున్నాయి. దేశీయంగా ఉత్పత్తి సామర్థ్యం పెరుగనున్నది. 

నివేదిక ప్రకారం 2022 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ 100 శాతం లిథియం అయాన్ సెల్ దిగుమతులపై ఆధారపడి ఉండగా, 2027 నాటికి ఇది 20శాతానికి పడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే దేశంలో బ్యాటరీ తయారీలో పెద్ద పెట్టుబడులు పెడుతున్నారు. ప్రభుత్వ విధానాలు, సాంకేతిక పురోగతి, టెస్లా వంటి టాప్‌ కంపెనీల ప్రవేశంతో భారతదేశ ఈవీ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి.