టీటీడీలో విస్తరిస్తున్న శ్రీవారి సేవకుల సేవలు!

టీటీడీలో విస్తరిస్తున్న శ్రీవారి సేవకుల సేవలు!

ఇప్పటికే చాలా విభాగాలలో వారం రోజుల ప్రాతిపదికన వస్తున్న శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకుంటున్న టీటీడీ మరో నూతన సేవను సీనియర్ సేవక్ పేరుతో ప్రారంభించింది.  ఇందులో 45 నుండి  70 సంవత్సరాల వయసు కలిగిన స్త్రీ, పురుషులకు అవకాశం కల్పిస్తున్నారు. వ్యక్తిగతంగా బుక్ చేసుకునే ఈ
సీనియర్ సేవక్ ను మూడు డివిజన్లు గా విభజించారు. 

15..30..90 రోజులు నిరవధికంగా శ్రీవారి భక్తులకు సేవ చేసుకునే అవకాశం కల్పించారు.15 రోజుల వారికి రెండు పర్యాయములు, 30 రోజుల వారికి మూడు , 90 రోజుల వారికి తొమ్మిది సార్లు శ్రీవారి దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు.  సీనియర్ సేవక్ లలో కొందరిని సాధారణ సేవకుల గ్రూపు లకు సూపర్వైజర్లుగా నియమించి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తారు. 

సేవకులు భక్తులకు అందించే సేవల ఆధారంగా ఎక్సలెంట్, గుడ్, యావరేజ్ అని మూడు గ్రేడ్లు గా సూపర్వైజర్లు గుర్తిస్తారు. ఇందులో ఎక్సలెంట్, గుడ్ గుర్తింపు పొందిన సేవకులకు వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలు లాంటి పర్వదినాలలో సేవలకు అవకాశం కల్పిస్తూ టీటీడీ స్వయంగా ఆహ్వానిస్తుంది.

మరోవంక, వారి సేవ స్వచ్చంద వ్యవస్థలో తీసుకురానున్న సంస్కరణలపై టీటీడీ కసరత్తు ప్రారంభించింది. త్వరలో ప్రారంభించనున్న ప్రొఫెషనల్ శ్రీవారి సేవ, ఎన్ఆర్ఐ సేవ, గ్రూప్ సూపర్వైజర్ల సేవల కార్యాచరణ పురోగతి గురించి సుదీర్ఘoగా అధ్యయనం చేస్తున్నారు. ఐఐఎం-అహ్మదాబాద్ బృందంచే గ్రూప్ సూపర్వైజర్లకు శిక్షణ ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించాలని ఈఓ ఈ సందర్బంగా సంబంధిత అధికారులను ఆదేశించారు. 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీవారి సేవను మరింత ఉన్నతంగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్నారు. ఈ సందర్బంగా ఐటీ డిపార్ట్మెంట్ పవర్ పాయింట్ ద్వారా గ్రూప్ సూపెర్వైసర్ కొరకు రూపొందించిన అప్లికేషన్ ను చూపించారు. దశాబ్దాల క్రితం వందల మందితో ప్రారంభమైన శ్రీవారి సేవ ప్రస్తుతం నిత్యం 3 వేల మందికి పైగా చేరింది. ఈ సంఖ్యను అయిదారు వేల మందికి పెంచేందుకు టీటీడీ రకరకాల నూతన సేవల పేరుతో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 

భవిష్యత్తు అవసరాల దృష్ట్యా వరాహ స్వామి రెస్ట్ హౌస్ సమీపంలో రూ. 200 కోట్లతో రెండు భారీ నూతన భవనాలను నిర్మించారు. స్త్రీ, పురుషులకు వేరువేరుగా నిర్మించిన ఈ భవంతులలో టీటీడీ అత్యాధునిక సౌకర్యాలను ఏర్పాటు చేసింది. టీటీడీలో దశాబ్దాలుగా పోస్టుల భర్తీ చేయకపోగా వేల సంఖ్యలో పదవీ విరమణలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రాబోవు రోజులలో టీటీడీలోని అన్ని విభాగాల్లో  శ్రీవారి సేవకుల సేవలే కీలకం కానున్నాయి.