సంజయ్ దత్ చెప్పుంటే ముంబయి పేలుళ్లు జరిగేవి కాదు

సంజయ్ దత్ చెప్పుంటే ముంబయి పేలుళ్లు జరిగేవి కాదు
1993లో ముంబైలో జరిగిన భయంకరమైన బాంబు పేలుళ్ల ఘటన గురించి అందరికీ తెలిసిందే. ఈ దుర్ఘటనలో మొత్తంగా 267 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే తాజాగా ఈ అంశంపై మాట్లాడిన ప్రముఖ ప్రభుత్వ న్యాయవాది, తాజగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేసిన ప్రవేశించిన ఉజ్వల్ నికమ్ ఈ ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఆయుధాలతో నిండిన వాహనం గురించి పోలీసులకు అప్పుడే సమాచారం ఇచ్చి ఉంటే ఈ విస్ఫోటనం జరిగి ఉండేది కాదని ఆయన స్పష్టం చేశారు. పలు మీడియా ఛానెళ్లు ఆయన్ను ఇంటర్వ్యూ చేయగా నాటి ఘటనల గురించి సంచలన వాఖ్యలు చేశారు. ఉజ్వల్ నికమ్ 26/11 ముంబై ఉగ్రదాడి కేసులో కూడా ప్రాసిక్యూటర్‌గా కీలక పాత్ర పోషించారు.
 
ముఖ్యంగా తన సుదీర్ఘ న్యాయ వృత్తి గురించి ప్రస్తావిస్తూ 1993  మార్చి 12న ముంబైలో వరుస పేలుళ్లు కేసును ప్రత్యేకంగా వివరించారు. ఈ పేలుళ్లు జరగడానికి ముందురోజే అండర్ వరల్డ్ గ్యాంగ్‍స్టర్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు అబూసలేం తీసుకువచ్చిన ఆయుధాలతో నిండిన వాహనం సంజయ్ దత్ ఇంటికి వచ్చిందని చెప్పారు. అందులో హ్యాండ్ గ్రనేడ్లు, ఏకే-47లు, తుపాకుల వంటి ఆయుధాలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ఇందులోంచి సంజయ్ దత్ ఒక ఏకె-47 తుపాకీని తీసుకున్నారని నికమ్ వెల్లడించారు.
కానీ ఆ తర్వాత సంజయ్ దత్ చాలా ఆయుధాలను తిరిగి ఇచ్చేసినప్పటికీ, ఒక ఏకే-47 తుపాకీని తన వద్దే ఉంచుకున్నారని పేర్కొన్నారు. ఆయన ఉగ్రవాద ఆరోపణల నుండి (టెర్రరిస్ట్ అండ్ డిస్రప్టివ్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ – టాడా) నిర్దోషిగా విడుదలైనప్పటికీ, నిషేధిత ఆయుధాన్ని కలిగి ఉన్నందుకు ఆయుధ చట్టం కింద దోషిగా నిర్ధారించినట్లు గుర్తు చేశారు. కానీ ఆ సమయంలో ఆయుధాల వ్యాన్ గురించి సంజయ్ దత్ పోలీసులకు సమాచారం ఉచ్చి ఉంటే, పోలీసులు దర్యాప్తు చేసి ఉండేవారని, దానితో ముంబై పేలుళ్లు జరిగేవి కావని చెప్పారు.

ఇది మాత్రమే కాకుండా సంజయ్ దత్ ఆయుధాలపై ఉన్న ఆసక్తితో ఏకే-47 తీసుకున్నప్పటికీ, దాన్ని ఎప్పుడూ కాల్చలేదని నటుడి లాయర్ చెప్పినట్లు ఉజ్వల్ నికమ్ గుర్తు చేసుకున్నారు. ఈక్రమంలోనే విధించిన ఆరేళ్ళ జైలు శిక్షను సుప్రీం కోర్టు ఐదేళ్లకు తగ్గించగా, సంజయ్ దత్‍కు పుణెలోని యరవాడ జైల్లో శిక్షను అనుభవించారు. 2016లో విడుదల అయ్యారు. 


కాగా, సంజయ్ దత్ కు ఆయుధ చట్టం కింద శిక్ష విధించిన సమయంలో కోర్టు గదిలో  ఆయనతో తాను గుసగుసలాడిన సంభాషణను నికం మీడియాకు కూడా ఇప్పుడు వెల్లడించారు. శిక్ష ప్రకటించిన తర్వాత సంజయ్ దత్ సంయమనంనికం చెబుతూ  “అతని శరీర భాష మారడం నేను చూశాను. అతను షాక్‌లో ఉన్నట్లు నాకు అనిపించింది. తీర్పును అతను తట్టుకోలేకపోయాడు. అతను కదిలిపోయినట్లు కనిపించాడు” అని నికం వివరించారు.
 
“అతను సాక్షి పెట్టెలో ఉన్నారు. నేను సమీపంలో ఉన్నాను. నేను అతనితో మాట్లాడాను. అతను మౌనంగా ఉండి, ఆ తర్వాత వెళ్ళిపోయాడని మీకు గుర్తుండే ఉంటుంది” అని ఆయన తెలిపారు. తాను నటుడికి ఏమి చెప్పారో అడిగినప్పుడు, తాను మొదటిసారిగా ఆ “రహస్యాన్ని” బయటపెడుతున్నానని నికం వెల్లడించారు. “నేను సంజయ్‌తో, ‘సంజయ్ ఇలా చేయకు. మీడియా నిన్ను చూస్తోంది. నువ్వు ఒక నటుడువి. ఆ శిక్ష చూసి నువ్వు భయపడుతున్నట్లు కనిపిస్తే, ప్రజలు నిన్ను దోషిగా భావిస్తారు. నీకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది’ అని చెప్పినట్లు తెలిపారు. ఆయన ‘అవును సార్, అవును సార్’ అని అన్నారట.
 
ఉజ్వల్ నికం భారతదేశంలోని అత్యంత ప్రముఖ పబ్లిక్ ప్రాసిక్యూటర్లలో ఒకరు. ఆయన అనేక ప్రధాన కేసులను విచారించారు, వాటిలో: 1993 పేలుళ్ల కేసు, పాకిస్తాన్ ఉగ్రవాది అజ్మల్ కసబ్‌పై 26/11 ముంబై ఉగ్రవాద దాడుల కేసు, 2011 ట్రిపుల్ పేలుళ్లు, శక్తి మిల్స్ గ్యాంగ్‌రేప్ కేసులు, కోపర్డి, అహ్మద్‌నగర్ అత్యాచారం, హత్య కేసులు వంటి అనేక ప్రముఖ కేసులను విచారించిన తర్వాత నికం వెలుగులోకి వచ్చారు. 1993 పేలుడు,  26/11 దాడి కేసు తర్వాత నికం ప్రసిద్ధి చెందారు. సున్నితమైన ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేర విచారణలలో దోషులుగా నిర్ధారించడంలో ఆయన ప్రసిద్ధి చెందారు.