కర్ణాటకలో ఏరోస్పేస్‌ పార్క్‌ భూసేకరణ రద్దు

కర్ణాటకలో ఏరోస్పేస్‌ పార్క్‌ భూసేకరణ రద్దు
మూడేళ్ళకు పైగా రైతులు సాగించిన మహోద్యమంతో కర్ణాటక ప్రభుత్వం దిగొచ్చింది.  ఏరోస్పేస్‌ పార్క్‌ కోసం చేపట్టదలచిన వేలాది ఎకరాల భూ సేకరణ ప్రక్రియను ఉపసంహరించుకుంది. దేవనహళ్లి తాలుకాలోని 13 గ్రామాల్లో 1777 ఎకరాల భూమిని ఏరోస్పేస్‌ పార్కు నిర్మాణం కోసం సేకరించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం తలపెట్టింది. అయితే రైతులు ఈ ప్రతిపాదనను తీవ్రంగా ప్రతిఘటించారు. 
 
తక్షణమే భూ సేకరణను నిలిపివేయాంటూ రైతులు ప్రారంభించిన నిరనలు మంగళవారానికి 1198వ రోజుకు చేరాయి. ఈ పరిస్థితుల్లో రైతుల డిమాండ్‌కు తలొగ్గుతున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరాయమ్య ప్రకటించారు. బెంగళూరులో రైతు ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే ఈ ప్రాజెక్టు కోసం ఎవరైతే స్వచ్చందంగా తమ భూమిని ఇవ్వాలనకుంటున్నారో అటువంటి రైతుల నుండి భూమిని ప్రభుత్వం సేకరిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. 
 
అధిక ధరలకు ఆ భూమిని కొనుగోలు చేయడమే కాకుండా, ఆ రైతులకు అభివృద్ధిపరిచిన భూమిలో కొంత భాగాన్ని ఇవ్వడం వంటి చర్యలు కూడా చేపడతామని ప్రకటించారు. ఈ ప్రతిపాదిత పార్కులో కొత్తగా ఫ్యాక్టరీలు పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తలు ఇక్కడ అవకాశం లేకపోతే పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోయే అవకాశం వుందని పేర్కొన్నారు. 
 
అయినప్పటికీ, తమ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోరాదని గట్టిగా పట్టుబడుతున్న రైతుల ప్రయోజనాలను దృష్టిలో వుంచుకుని ఇక ఈ భూ సేకరణ ప్రక్రియను పూర్తిగా నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. తమ డిమాండ్‌ సాధన కోసం దేవనహళ్లి తాలుకా రైతులు చన్నరాయపట్నాలో గత 1198 రోజులుగా నిరసనలు కొనసాగిస్తున్నారు.
 
 తమ భూములన్నీ మంచి సాగుభూములని, పక్కనే బెంగళూరులోనే గల మార్కెట్లలో తమ పంటలకు మంచి గిట్టుబాటు ధర వస్తోందని, అటువంటి భూములను ఏరోస్పేస్‌ పార్కు కోసం ఎలా స్వాధీనం చేసుకుంటారని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పారిశ్రామికాభివృద్ధి పేరుతో సాగు భూముల స్వాధీనం చేసుకోవడంలో ఆంతర్యాన్ని వారు ప్రశ్నించారు.
జులై మొదటి వారంలో రైతు ప్రతినిధులతో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. ఇందులోని చట్టపరమైన సమస్యలను పరిశీలించి, పరిష్కరించేందుకు కొంత సమయం కావాలని కోరారు. చిట్టచివరిగా నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు మంగళవారం ప్రకటించారు.