
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నీటిపారుదల విశ్రాంత ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధరరావును ఎసిబి అధికారులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్‌లో మురళీధరరావునివాసంలో మంగళవారం తెల్లవారుజాము నుంచి ఎసిబి అధికారులు జరిపిన సోదాలలో రూ 500 కోట్లకు పైగా విలువైన ఆస్తులను గుర్తించారు.
కొండాపూర్‌లో ఒక విల్లా, బంజారాహిల్స్, యూసు్‌ఫగూడ, కోకాపేట, బేగంపేటల్లో నాలుగు ఫ్లాట్లు, అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో నాలుగు ఇళ్ల స్థలాలు, హైదరాబాద్, కరీంనగర్‌ల్లో రెండు వాణిజ్య సముదాయాలు; కోదాడలో అపార్ట్‌మెంట్, వరంగల్‌లో నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్, మోకిలలో 6,500 గజాల స్థలం, హైదరాబాద్ చుట్టుపక్కల 11 ఎకరాల పొలం; జహీరాబాద్‌లో 2 కేవీ సోలార్ పవర్ ప్రాజెక్టు (ఎన్‌రిచ్), మెర్సిడెస్ బెంజ్ సహా మూడు కార్లు ఆయనకు ఉన్నట్లు ఏసీబీ అధికారుల సోదాల్లో వెల్లడైంది.
ఈ క్రమంలో ఇప్పటికే మాజీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్-ఇన్-చీఫ్ (ఈఎన్‌సీ) హరి రామ్, ఈఈ నూనె శ్రీధర్‌లను అరెస్టు చేశారు. మురళీధర్ రావు ఇళ్లు, కార్యాలయాలు, బంధువుల నివాసాల్లో విస్తృత సోదాలు నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
హైదరాబాద్ నగరంతో పాటు కరీంనగర్, జహీరాబాద్ ప్రాంతాల్లో మొత్తం 11 చోట్ల ఏకకాలంలో సోదాలు జరిపారు. ఇందులో మురళీధర్ రావు కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లు కూడా ఉన్నట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి. ఈ సోదాల్లో భారీగా అక్రమాస్తులను ఏసీబీ గుర్తించినట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టులో సబ్-కాంట్రాక్టుల కేటాయింపుల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఏసీబీ ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్లు తెలుస్తోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మురళీధర్‌రావు పదవీవిరమణ పొందగా, ఆ తర్వాత ఆయన పదవీకాలాన్ని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పొడిగించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన కొంతకాలం పాటు పదవిలో ఉన్నారు. మేడిగడ్డ కుంగిపోయిన ఘటన పై విజిలెన్స్ నివేదిక తర్వాత మురళీధర్‌రావును ప్రభుత్వం తొలగించింది.
గతంలో అరెస్టు చేసిన మాజీ ఈఎన్‌సీ హరి రామ్, ఈఈ నూనె శ్రీధర్‌ల ఇళ్లలో జరిపిన సోదాల్లోనూ ఏసీబీ వందల కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ అక్రమాలన్నీ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన సబ్-కాంట్రాక్టులు, నిధుల కేటాయింపుల్లో జరిగిన అవకతవకల నుంచి వచ్చాయని అనుమానిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిషన్ విచారణను చేపట్టింది. ఈ కమిషన్ విచారణలో మాజీ ఈఎన్‌సీ మురళీధర్ రావును కూడా విచారించారు.
More Stories
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల ఎంపిక ప్రారంభం
తెలంగాణ బతుకమ్మకు రెండు గిన్నిస్ రికార్డులు