చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో జై శంకర్ భేటీ

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో జై శంకర్ భేటీ
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మంగళవారం భారత విదేశాంగ శాఖామంత్రి జైశంకర్‌ భేటి అయ్యారు. జైశంకర్‌ రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం జైశంర్‌ చైనాకు చేరుకున్నారు. మంగళవారం ఆ  దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌తో జైశంకర్‌ భేటీ అయ్యారు. జిన్‌పింగ్‌తో కలిసి దిగిన ఫొటోను ఆయన తన ఎక్స్‌ పోస్టులో షేర్‌ చేశారు. 
 
ఇటీవలి కాలంలో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో జరిగిన పరిణామాల గురించి ఆయనకు వివరించారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ తరఫున ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని జైశంకర్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. 2020లో గల్వాన్ ఘటనతో ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తిన జరిగిన తర్వాత భారత విదేశాంగశాఖ మంత్రి చైనాలో పర్యటించడం ఇదే మొదటిసారి.
 
జైశంకర్‌తోపాటు షాంగై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఎస్‌సిఓ) సభ్యులు కూడా జిన్‌పింగ్‌ని కలిశారు. 2020 గల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారి షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ విదేశాంగ మంత్రుల సదస్సు కోసం జైశంకర్ చైనాలో పర్యటిస్తున్నారు. సోమవారం చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్ , విదేశాంగమంత్రి వాంగ్ యీతో భేటీ అయిన ఆయన, చైనా-భారత్ సంబంధాలు క్రమంగా బలపడుతున్నట్లు వివరించారు. 
 
ద్వైపాక్షిక సంబంధాలు, సహకారాలను మరింత బలోపేతం చేసుకోవడం వల్ల ఇరుదేశాలతో పాటు ప్రపంచానికి కూడా ప్రయోజనకరమని అభిప్రాయపడ్డారు. చైనా వైపు నుంచి ప్రవహించే సరిహద్దు నదుల్లో నీటికి సంబంధించిన సమాచారాన్ని అందించడంపై జైశంకర్ వారితో చర్చించారు. “సరిహద్దు సమస్యలను పరిష్కరించడం, ప్రజల రాకపోకలను సాధారణీకరించడం, నిర్బంధ వాణిజ్య చర్చలను, అడ్డంకులను నివారించడం మా బాధ్యత. పరస్పర గౌరవం, ఆసక్తులు, సున్నితత్వం ఆధారంగా ద్వైపాక్షిక సంబంధాలు సానుకూల పథంలో అభివృద్ధి చెందుతాయని ఆశిస్తున్నాము” అని చెప్పారు.

జూన్ నెలలో భారత రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్లు చైనాలో పర్యటించారు. అప్పుడు రాజనాథ్ సింగ్ చైనాలోని క్వింగ్డావోలో జరిగిన షాంఘై సహకార సంస్థ సభ్యదేశాల రక్షణ మంత్రిత్వస్థాయి సదస్సుకు హాజరయ్యారు. ఇప్పుడు విదేశాంగ మంత్రి జైశంకర్ చైనాలో పర్యటిస్తున్నారు. మరోవైపు దశాబ్దాలుగా ఉన్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించే లక్ష్యంతో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ వచ్చే నెల భారత్ కు రానున్నారు. ఆయన నేరుగా భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్ తో భేటీ కానున్నారు.